Puppies Killed: మూగజీవుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు గుర్తు తెలియని దుండగులు. తమ క్రూరత్వాన్ని చిన్న బుజ్జి కుక్కపిల్లలపై చూపించారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో రెండు కుక్క పిల్లలను చంపినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.పార్క్ వద్ద చెట్టుకు వేలాడుతున్న కుక్కపిల్లల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. జంతు కార్యకర్తలు, రాజకీయ నాయకులతో సహా పలువురు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
ద్వారక ప్రాంతంలోని ఓ పార్కులో వీధిలో తిరిగే చిన్న కుక్కపిల్లలను చంపిన ఘటనపై ఫిర్యాదు అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ కూడా ఈ పోస్ట్‌పై స్పందించారు. మూగజీవులపై దుండగుల ప్రవర్తనపై మండిపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనెసా అల్ఫోన్సో అనే మహిళ ఫిర్యాదు చేసింది. తాను కుక్కలకు ఆహారం ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఒకటి చెట్టు కొమ్మకు వేలాడుతోందని.. మరొకటి కిందపడి ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Cell Phones Robbery: పోలీస్ డ్రెస్ లో వచ్చి… సెల్ ఫోన్స్ చోరీ
అయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ బరేలి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయి రెండు కుక్కపిల్లలను గాయపరిచారు. కుక్క చెవులను కత్తిరించి మందుతో కలిపి సేవించారు. అంతకుముందు కొందరు ఆకతాయిలు ఓ పెంపుడు కుక్కకు విషం కలిపిన మాంసం ముక్కలు పెట్టి హత్య చేశారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకులు తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తున్నందుకే చంపేశారని యజమాని ఆరోపించారు.