వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఈ రోజు రైతుబంధు నిధుల విడుదల పై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా అధికారులు ఇప్పటి వరకు 40% శాతం మంది రైతులకు రైతుబంధు అందిందని అనగా 27 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలలోకి రైతుబంధు జమ చేయడం జరిగిందని తెలిపారు. వరి, ఇతర యాసంగి పంటల నాట్లు, సాగు ముమ్మరంగా రాష్ట్రావ్యాప్తంగా జరుగుతునందున త్వరతిగతిన రైతుబంధు సొమ్ము జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించారు.
రోజు వారిగా నిధులు విడుదల జరిగేలా చూడాలని, వచ్చే సోమవారం నుండి అధిక సంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయం నూతన ప్రభుత్వం యొక్క అత్యున్నత ప్రాధాన్యత అని, గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతు బంధును రైతులకు సకాలంలో అందచేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలు రైతుబంధు డబ్బుల విడుదల పై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.