Tirumala: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
6 లక్షల లడ్డూలు నిల్వ ఉంచడంతో పాటు నిత్యం 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు వాహనాలు అనుమతించేలా ఏర్పాట్లు చేశామన్నారు. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. తిరుమలలో 17వ తేదీన వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీన శ్రీవారికి పట్టు వస్ర్తాలను సీఎం జగన్ సమర్పించనున్నారు. 22వ తేదీన గరుడ వాహన సేవ, 23వ తేదీన స్వర్ణ రథ ఊరేగింపు జరగనున్నాయి. 27వ తేదీన ధ్వజాఅవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.