అర్ధరాత్రి నుంచే తనను, తమ నేతలను హౌస్ అరెస్టు చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యాబై మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలోని నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్పీతో కూడా ప్రభుత్వం అబద్దం చెప్పిందని భూమన పేర్కొన్నారు. తమని గోశాల వద్దకు పంపలేదని, అందుకే రోడ్డుపై బైఠాయించామని భూమన చెప్పారు. ఎస్వీ గోశాలపై కూటమి నేతలు, భూమన పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది.
భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘టీటీడీ గోశాల రావాలని సవాల్ విసిరిన వెంటనే నేను సిద్దం అంటూ చాలెంజ్ స్వీకరించాను. నాతో సహా మా నేతలందరినీ హౌస్ అరెస్టు చేశారు. యాబై మందికి పైగా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు. నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారు. ఎస్పీతోనే అబద్దాలు చెప్పించారు. మమ్మల్ని వెళ్ళకుండా అడుగుఅడగునా అడ్డుకున్నారు. నాకు ఫోన్ చేసి గోశాలకు రావాలని ఎమ్మెల్యేలు కోరారు, వస్తానని వారికీ చెప్పాను. నాకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ రాకుండా తోకముడిచారు’ అని అన్నారు.
గురువారం ఉదయం గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, కలికిరి మురళీ మోహన్, ఆరణి శ్రీనివాసులతో పాటు టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు వెళ్లారు. అక్కడి నుంచే భూమన కరుణాకర్ రెడ్డికి వారు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్రస్థాయికి రావాలని కోరారు. పోలీసులు సూచనల మేరకు ఐదుగురితో రావాలని భూమనను కోరారు. గోశాలకు వస్తానని భూమన వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో గోశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.