Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 5) భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో ట్రేడర్ల ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ముగిసాయి. ట్రంప్ ప్రభుత్వం అదనంగా విధించబోయే ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
Read Also: WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా!
ఇదివరకు ట్రంప్ 60 దేశాలపై అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలను విధించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఈ సుంకాల అమలును జూలై 9వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన ట్రేడింగ్ ప్రారంభానికి ముందే రావడం వల్ల, మార్కెట్ ఆరంభంలోనే లాభాలవైపు దూసుకెళ్లింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్ 74835 పాయింట్ల వద్ద పాజిటివ్‌గా మొదలు కాగా.. ఇంట్రాడేలో కనిష్ఠంగా 74,762 పాయింట్ల వద్ద, గరిష్ఠంగా 75,467 పాయింట్ల వరకు వెళ్లింది. ఇక మార్కెట్ ముగిసే సమయానికి 1,310 పాయింట్ల భారీ లాభంతో 75,157 వద్ద ముగిసింది.
మరోవైపు నిఫ్టీ కూడా 430 పాయింట్ల లాభంతో 22,828 వద్ద ముగిసింది.ఈ రోజు ట్రేడింగ్‌లో మెటల్ సూచీ అత్యధికంగా 4 శాతం పెరగగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ వంటి కంపెనీలు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. వీటితోపాటి ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యూ, టెలికాం, ఫార్మా రంగాలు కూడా భారీ లాభాలలో ముగిసాయి. మొత్తంగా చూస్తే, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచింది. అదనపు సుంకాల వాయిదా నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించి, దేశీయ మార్కెట్లకు ఉపిరిలా పనిచేసింది.