కాంట్రాక్ట్ క్యారేజీ వెహికల్స్ పై పెంచిన పన్నులను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు విజ్ఝప్తి చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.గోపాల్ రెడ్డి, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోని పలువురు నాయకులు ఈరోజు బండి సంజయ్ కుమార్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్ట్ క్యారేజీ వెహికల్స్ కు సంబంధించి ఒక్కో సీటుకు 892 రూపాయల 50 పైసల ట్యాక్స్ వసూలు చేసేవారని… కోవిడ్ పరిస్థితుల అనంతరం ఈ మొత్తాన్ని చెల్లించడమే తమకు భారంగా మారిందన్నారు.
కానీ ప్రభుత్వం ఒక్కో సీటుపై అదనంగా 25 శాతం పెంచిందన్నారు. అట్లాగే గ్రీన్ ట్యాక్స్, ఫిట్ నెస్, బార్డర్ ట్యాక్స్ పేరిట పన్నులను విపరీతంగా పెంచేశారని వాపోయారు. పెంచిన ట్యాక్సులను రద్దు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా వారు బండి సంజయ్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.