Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్‌లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Pragya Jaiswal : అప్పుడు చేజారిన అవకాశం..ఇన్నాళ్లకు మళ్ళీ వచ్చింది..
మే 4వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం చెప్పుకొచ్చింది. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80 వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. గతంలో ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని మూడు నెలల ముందు వరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం పెంచినట్లు ప్రకటించింది. మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు టైంలో ఆన్‌లైన్ బుకింగ్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.