పురాతన కాలంలో విధించే పన్నులు, జరిమానాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. స్కూలుకి వెళ్లే పిల్లలు బొట్టు పెట్టుకోవడం, చేతికి కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం మామూలే. కానీ ఏపీలోని ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఇలాంటివి పాటిస్తే తాట తీస్తారు. జరిమానాలు విధిస్తారు. ఆ ట్రైనింగ్ స్కూల్ ఎక్కుడుందా అడుగుతున్నారా… అక్కడికే వస్తున్నాం. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే జరిమానాలు విధించే ట్రైనింగ్ సెంటర్ కర్నూలు డీఎంహెచ్ వో ప్రాంగణంలో ఉంది. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఉంది. అందులో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా ఉంది. ఈ కోర్సుకు ప్రిన్సిపల్, వార్డెన్‌గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. ఆమె నిత్యం వేధిస్తుండటం… బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ కోసం వస్తే వార్డెన్ తన వ్యక్తిగత సేవలన్నీ చేయించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
వేధింపులు ఎక్కువ కావడంతో రెండురోజుల క్రితం ఇద్దరు యువతులు ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించారు. బాధితులు తమ సమస్యను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజయ సుశీలను పిలిపించి వసతి గృహంలో ఉండకూడదని.. ఇల్లు చూసుకోవాలని చెప్పారు. తనపై ఫిర్యాదు చేయడంతో విజయ సుశీల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులవద్ద గతంలో తీసుకున్న లేఖలను బూచిగా చూపి తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించారు.
దీంతో గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిలో ఓ యువతి మంగళవారం మళ్లీ సూసైడ్ కి ప్రయత్నించడం కలకలం రేపింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు సెలవులిచ్చి విద్యార్థినులందరినీ ఇంటికి పంపేశారు. తమను వేధించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ తీసుకుంటున్న యువతులు కోరుతున్నారు. ఈరోజుల్లో ఇలాంటి రూల్స్, జరిమానాలు ఏంటని సభ్యసమాజం నివ్వెరపోతోంది.
Read Also: Live Incident: ఎన్ని బాధలున్నాయ్ కొడుకా.. ఇలా కావాలనే రైలుకింద పడ్డావు