సరికొత్త ఆలోచనలతో బెజవాడ పోలీసులు:
కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై ప్రయాణికులకు చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విజయవాడ పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అర్ధరాత్రి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే.. ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు పోలీసు శాఖ తరఫున సీపీ హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆలోచనలతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు.
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి:
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటుండగా క్రాకర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాక పట్టణంలోని వడ్లపూడి రజకవీధిలో చోటుచేసుకుంది. ఈ ఘనటనపై సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనటనతో రజకవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2025 నూతన సంవత్సరం నేపథ్యంలో రజకవీధిలోని సుద్దమళ్ల శివ అనే వ్యక్తి స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. అర్ధరాత్రి 12:05 కేక్ కట్ చేసే సమయంలో క్రాకర్ వెలిగించాడు. క్రాకర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయి శివ నూదిటిపై పెద్ద గాయం అయింది. గాయం కారణంగా అతడు అక్కడికి అక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే కూర్మన్నపాలెం 4S ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
భారీగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు:
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అత్యంత భారీగా జరిగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు. అయితే, ఈ వేడుకల మధ్య కొన్ని అవాంఛిత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. చెప్పినట్లుగానే.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లపై మందుబాబులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుల సమయంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
బీజేపీకి మధురస్మృతులను మిగిల్చింది:
నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, బీజేపీకి మీరు అందించిన మద్దతు వల్ల మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ మెరుగైన భాగస్వామ్యం పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలయినటువంటి మొత్తం ఓట్లలో 77,43,947 ఓట్లను సొంతం చేసుకున్న బీజేపీ, 36 శాతం ఓట్లతో తెలంగాణవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపిందని కిషన్ రెడ్డి తెలిపారు.
మణిపూర్‌లో ఉద్రిక్తత:
మణిపూర్‌లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. మంగళవారం కాంగ్‌పోక్పి జిల్లాలో కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు భద్రతా బలగాలతో ఘర్షణ పడ్డారు. ఘర్షణ అనంతరం ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అయితే, భద్రతా బలగాలు స్వల్పంగా లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రశాంతంగా ఉందని చెప్పారు. కొద్ది గంటల క్రితం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సమయంలో ఈ సంఘటన కనిపించింది.
బీచ్‌లో కూరుకుపోయిన కారు:
బీచ్ అంటేనే ఆహ్లాదం.. ఉల్లాసం.. సంతోషం.. పైగా న్యూఇయర్ సమయం. పాత ఏడాదికి గుడ్‌బై చెప్పి.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న సమయం. అయితే ఇద్దరు ముంబై టూరిస్టులు ఉదయం బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఖరీదైన కారుతో బీచ్‌లో రైడింగ్ చేస్తున్నారు. అంతే ఉన్నట్టుండి ఇసుకలో కారు కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. ఇక చేసేదేమీ లేక ఎడ్లబండి సాయంతో బయటకు తీశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ దాడులు:
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గత వారం ఫ్రాన్స్ క్షిపణి దాడులు నిర్వహించిందని ఫ్రెంచ్ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను మంగళవారం తెలిపారు. సిరియాలో అమెరికా ఇదే విధమైన సైనిక దాడి తర్వాత ఫ్రెంచ్ వైమానిక దాడి చేసిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. సిరియాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదం పుంజుకోకుండా కట్టడి చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఫ్రెంచ్ వైమానిక దళాలు.. సిరియన్ భూభాగంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడుల చేసినట్లు వెల్లడించారు. అమెరికా చేసిన దాడిని అనుసరించి.. ఈ దాడులు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు.
విదాముయార్చి’ రిలీజ్ వాయిదా:
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ పై అనుమానం నెలకొంది. ఆ అనుమానాలను నిజం చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు ‘విదాముయార్చి’ మేకర్స్. అనివార్య కారణాల వలన ఈ సినిమాను పొంగల్ కు రిలీజ్ చెయ్యట్లేదు అని అధికారకంగా ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.
ఒకటి కాదు.. రెండు ట్రైలర్స్:
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైలర్‌ను చూసే సినిమా పై ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ఆడియెన్స్. ట్రైలర్ ఏ మాత్రం బాగున్నా సరే మొదటి రోజు భారీగా టికెట్లు తెగినట్టే. ఇక పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలకు మినిమమ్ వంద కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే చెప్పుకొచ్చాడు. ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్‌ను డిసైడ్ చేస్తుందని అన్నారు. అందుకే ఓ రేంజ్‌లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామని విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కట్ చేసినట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తి అయినట్టుగా సమాచారం. ఇందులో.. చరణ్ పాత్రల లుక్స్, ఎమోషన్స్, శంకర్ మార్క్ యాక్షన్ హైలెట్‌గా నిలవనుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బీజీఎం మాత్రం పీక్స్ అని అంటున్నారు.