గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట:
గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట లభించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలలో జీవీఎంసీ గడువు కావాలని కోరింది. వర్కర్స్ డిమాండ్లను బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జీవీఎంసీ మాట తప్పితే.. శుక్రవారం నుంచి తిరిగి నిరవధిక సమ్మెకు వెళతాం అని యూనియన్లు హెచ్చరించాయి. తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్ట్ ఉద్యోగులు తిరిగి విధులకు హాజరుకానున్నారు. సిబ్బంది మొత్తం తమ తమ డ్యూటీలలో చేరేందుకు సిద్దమయ్యారు. పంపింగ్, డిస్ట్రిబ్యూషన్‌కు సమయం పట్టే అవకాశం ఉంది. మంచినీటి సరఫరా పునరుద్ధరణకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టనుంది.
విజయనగరం ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ:
విజయనగరం ఉగ్రకుట్ర లింకుల కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల ఉగ్రకుట్ర కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర ప్లాన్ చేశారు. సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. త్వరలోనే నిందితులు ఇద్దరినీ ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోనుంది. ఇద్దరినీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు విజయనగరం పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
కమిటీ ముందుకు రావాలని.. నన్ను ఎవరు పిలవలేదు:
హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు.. ఆయనకు ప్రత్యేక వర్గం లేదని వెల్లడించారు. నేను పిలిచినా నా దగ్గరికి వస్తారు.. ఇక, భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేద్దాం అనుకున్నాను.. కానీ, కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి.. నేను పోటీ చేయొద్దని అనుకున్నా.. అక్కడ నాకు బలం ఉంది.. టీడీపీ నుంచి వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాను.. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు అని కొండా మురళి ఆరోపించారు.
రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం:
రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ సిద్ధమైంది. రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ప్రతిగా.. శామీర్ పేట్ లో భూములను తెలంగాణ సర్కార్ ఇవ్వనుంది. కాసేపట్లో రక్షణ శాఖతో MoU చేసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 90 ఎకరాల భూములను కేంద్ర రక్షణ శాఖ ఇవ్వనుంది. రక్షణ శాఖ భూముల కారణంగా లేట్ అవుతున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు.. ఈ ఒప్పందం పూర్తయితే ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత స్పీడ్ కానున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల స్కామ్:
సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే లక్ష్యంగా ఈ దాందా కొనసాగుతుంది. ఒక్కో సర్టిఫికేట్ ని 10 వేల నుంచి 20 వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. జిన్నారం మండల కేంద్రంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం బయటపడింది. చిన్న పొరపాటుతో కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. సర్టిఫికెట్ లో తేదీ తప్పు వేసి, మాజీ తహశీల్దార్ డిజిటల్ సైన్ ఫోర్జరీ చేయడంతో నకిలీ సర్టిఫికెట్ దందా బయటకి వచ్చింది. స్థానిక మీ సేవా, ఆన్ లైన్ కేంద్రాల్లో ఈ స్కామ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సర్టిఫికెట్ లో వచ్చే నెల జులై 19 తేదీతో మాజీ ఎమ్మార్వో భిక్షపతి పేరుతో డిజిటల్ సైన్ ఉంది. అయితే, కుల ధ్రువీకరణ పత్రం కోసం మనోజ్ కుమార్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. తమ కుమారుడు గౌరీ శంకర్ కి మాదిగ కులం పేరుతో సర్టిఫికెట్ జారీ చేశారు. మనోజ్ కుమార్ అనే వ్యక్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రస్తుత తహశీల్దార్ దేవదాసు ఫిర్యాదు చేశారు.
13 మంది మావోలు లొంగుబాటు:
దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు తీవ్ర ప్రతి ఘటనలు ఎదురవుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్ట్ కీలక నేతలతో సహా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక అభయారణ్యంలో మావోల మనుగడ కష్టంగా మారింది. ఇప్పటికే తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ పిలుపు సత్ ఫలితాన్ని ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 8 మంది మహిళలు సహా 13 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. కేంద్రం కల్పించిన నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
డ్రైవర్‌కు రూ.150 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ:
ఎంత అభిమానం ఉన్నా.. లేదంటే ఎంత ప్రేమ ఉన్నా.. రక్తసంబంధులైనా ఏదో కొంత సాయం చేయడమో.. గిఫ్ట్‌గా ఇవ్వడమో చేస్తుంటారు. అంతేకానీ కోట్లకు కోట్ల ఆస్తులైతే ఇవ్వరు కదా? కానీ మహారాష్ట్రలో మాత్రం ఒక ఎంపీ ఏకంగా తన కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చేశారు. అతడు రక్తసంబంధి కాదు.. బంధువు కాదు.. అయినా కూడా అన్ని కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఎలా ఇచ్చారంటూ తీవ్ర చర్చనీయాంశమైంది. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే.. అధ్యక్ష పదవిలో ఉన్నవాళ్లకు కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈ విషయం గురించి తనకు ఎవరైనా ముందే చెప్పుంటే.. అసలు ఈ రేసులో ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేసుకున్నారు.
ఖమేనీతో మర్యాదగా ఉండండి:
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం సాగుతోంది. నిన్నామొన్నటి దాకా క్షిపణులతో దాడులు చేసుకోగా.. తాజాగా వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పట్ల గౌరవంగా.. మర్యాదగా మాట్లాడాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీని చంపకుండా రక్షించామని, కానీ ఆయనకు కృతజ్ఞత లేదంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో తమకు తెలుసని.. అమెరికా, ఇజ్రాయెల్ దళాల చేతుల్లో చావకుండా కాపాడామని.. అతి ఘోరమైన చావు నుంచి తానే కాపాడినట్లు పేర్కొన్నారు.. అయినా ఖమేనీ తనకు ధన్యవాదాలు తెలపలేదని ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇరు దేశాల మధ్య అగ్గి రాజేసింది.
పసిడి ప్రియులకు శుభవార్త:
దేశంలోని పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకు పైగా ఎగబాకిన పసిడి రేట్లు.. రోజు రోజుకు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90 వేలకు దిగొచ్చింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (జూన్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,420గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,420గా ఉంది.
మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం పై అభిమానులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంచనాలకు మేకర్స్ అనుగుణంగా స్పందించకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ, చిత్ర బృందం నుంచి సరైన అప్డేట్స్ లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా, ఈ వారం ట్రైలర్‌కు సంబంధించి అప్డేట్ వస్తుందని ప్రకటించినప్పటికీ, అది ఇప్పటివరకు విడుదల కాలేదు. వారం ముగియబోతున్నా కూడా కనీసం ఒక టీజర్, పోస్టర్, గ్లింప్స్ లాంటి ఏదైనా చిన్న హింట్ ఇవ్వకుండా, పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోవడం వలన ఫ్యాన్స్ నిరాశ కు లోనవుతున్నారు. దీంతొ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా కూడా ప్రమోషన్ పరంగా ఏమీ చేయకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్:
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డీక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 19న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటో షేర్ చేసిన ఇలియానా.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘కియాను రఫే డోలన్‌ని పరిచయం చేస్తున్నా. జూన్ 19న పుట్టాడు. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’ అని రాసుకొచ్చారు. ఇలియానాకు ప్రముఖులు, ఫాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.