ఏపీలో రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి:
రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని మోడీ మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
జడ్జి ముందు తన వాదనలు తానే వినిపించిన పీఎస్‌ఆర్:
ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును బుధవారం ఉదయం జడ్జి ముందు సీఐడీ ప్రవేశపెట్టింది. రిమాండ్ కోసం వాదనలు జరిగ్గా.. జడ్జి ముందు పీఎస్‌ఆర్ తన వాదనలు తానే వినిపించుకున్నారు. జత్వాన్ని కేసులో ఏం జరిగిందన్న అంశాలను జడ్జికి పీఎస్ఆర్ వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. మాజీ డీసీపీ విశాల్ గున్నిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారి.. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారని జడ్జ్ ముందు పీఎస్‌ఆర్ చెప్పారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నిని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారని చెప్పారు.
ఉగ్రవాద ఘటనపై బీజేపీ ఎంపీల రియాక్షన్:
వర్గం పేరు అడిగి దాడి చేయడాన్ని సభ్య సమాజం ఖండిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్‌లో అసమర్థ నాయకత్వం ఉందని.. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ నిప్పులు పోస్తుందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. భారత్‌ను దెబ్బతీయాలని పాక్ చూస్తే అది ఆ దేశ పొరపాటే అన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్య అని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ అంశంపై స్పందించారు. “దేశ అభివృద్ధి చూడలేక పాక్ భారత్ ను దొంగ దొబ్బ తీసింది. కశ్మీర్ సంస్కృతిని కాపాడేందుకు మోడీ చేస్తోన్న ప్రయత్నం అడ్డుకునేందుకు కుట్ర చేసింది. పాక్ ఉగ్రవాద చర్యలకు మానుకోకపోతే.. ప్రపంచ దేశాలు పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించడం ఖాయం. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను ఏరి వేయాలి. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఘాతుకం జరిగినప్పుడు నిన్న నేను శ్రీనగర్‌లో ఉన్నాను. పాక్ దొంగ దెబ్బలు దేశ ప్రజలంతా ఖండించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే?:
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన కొన్ని గంటల్లో స్పందించిన ఇజ్రాయెల్ గాజాలో బాంబుల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే రీతిలో పాకిస్థాన్ అనవసరంగా భారత్‌తో పెట్టుకుంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ లాగానే భారత్ స్పందించి.. హసమాస్‌ను మట్టుబెట్టినట్లు పాకిస్థాన్‌ను లేపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలి:
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన హృదయాన్ని కలిచి వేసిందన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, మేము నివాళులు అర్పిస్తున్నాం.. గాయపడిన పర్యాటకులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. మన దేశ ఐక్యత, సమగ్రతపై జరిగిన దాడి ఇది.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఈ ఉగ్రదాడిని ఖండించాలి అని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు.
కాశ్మీర్‌లో హై టెన్షన్ వాతావరణం:
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో వణికిపోతున్నారు. భారత ఆర్మీని చూసినా కూడా మహిళలు, చిన్నారులు గజగజలాడిపోతున్నారు. నిన్నటి ఘటనతో ఒక విధమైన భీతావాహ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం కాశ్మీర్‌లో భద్రతా దళాలు మోహరించాయి. ఉగ్రమూకల కోసం జల్లెడ పడుతున్నాయి. మంగళవారం దాడి తర్వాత సమీపంలోనే ముష్కరులు నక్కి ఉంటారని భావిస్తున్నారు. దీంతో భద్రతా దళాలు వెతుకలాట ప్రారంభించాయి. మరోవైపు జమ్మూలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు నిర్వహించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల:
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు దాదాపు 28 మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది. మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు బయటకు వచ్చాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. బాధితులు తెలిపిన వివరాలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రతాదళాలు ఈ ఊహా చిత్రాను రూపొందించారు. వీరిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఈ ఉగ్రవాదులు కశ్మీర్‌ను విడిచి వెళ్లే అవకాశం లేదని, సమీప ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది.ఈ దాడిలో కనీసం 5–6 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం.
పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీగా సైన్యం:
పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది? పహల్గావ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల మరణం అనంతరం జమ్మూకశ్మీర్ సరిహద్దులో విస్తృతమైన పాకిస్థాన్ కార్యకలాపాలు చేస్తోందని వదంతులను ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు సరిహద్దు సైనిక స్థావరం వైపు వెళుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పాకిస్థాన్ తన ప్రధాన విమానాలను జమ్మూ కాశ్మీర్‌కు దగ్గరగా ఉన్న భారత సరిహద్దుకు సమీపంలోని స్థావరాలకు తరలిస్తోందనే వాదనలతో సోషల్ మీడియా నిండిపోయింది. పాకిస్థాన్ వైమానిక దళం (PAF) యొక్క ప్రధాన విమానాలు కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తరాన ఉన్న స్థావరాల వైపు బయలుదేరుతున్నట్లు చూపించే ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24 నుంచి తీసిన స్క్రీన్‌షాట్‌లు ఎక్స్‌లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఆ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు:
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం అన్నారు. పొరుగు దేశంలో అశాంతికి భారతదేశం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికార PML-N పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు అయిన ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్‌లో హింసకు కేంద్రపాలిత ప్రాంతంలోని విప్లవం, స్వదేశీ శక్తులే అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు. మంగళవారం పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడంతో దాదాపు 30 మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారతదేశం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వ్యాఖ్య వెలువడినప్పటికీ.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించడం గమనార్హం. ఆసిఫ్ లైవ్ 92 న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. “ఈ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆదేశంలో పుట్టిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉద్యామాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు, దక్షిణాన ఛత్తీస్‌గఢ్, మణిపూర్ లాంటి ప్రదేశాలన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.” అని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి.. ఆ సినిమా బ్యాన్:
జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందనే వాదనలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ టైమ్ లో పాకిస్థాన్ కు సంబంధించిన చాలా విషయాలపై చర్చ జరుగుతోంది. ఇదే టైమ్ లో సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమానే అబిర్ గులాల్. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో పాకిస్థానీ నటుడు ఫవర్ ఖాన్ హీరోగా చేస్తుండగా.. వాణి కపూర్ అందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్తి ఎస్ బాగ్ది డైరెక్ట్ చేసిన ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇది బాలీవుడ్ సినిమాగా రాబోతోంది. కానీ పాకిస్థానీ నటుడు ఉన్నందున వద్దనే వాదనలు ఎక్కువయ్యాయి.
సూర్య కౌంట్‌డౌన్ స్టార్ట్:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీని సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 1న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుండి, ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజైన కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజు మార్క్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా మనం చూసే ట్రైలర్ కి కాస్త భిన్నంగా.. రెండున్నర నిమిషాల నిడివితో, ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా, ప్రధాన పాత్రల అన్నిటినీ పరిచయం చేస్తూ, వివిధ సన్నివేశాల్లో నటీనటుల హావభావాలను చూపిస్తూ,ఆడియన్స్ కు అసలు అర్థం కాకుండా ఈ ట్రైలర్ వీడియో ని కట్ చేశారు. ఇక పోతే ఇప్పుడు సూర్య కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.
సునీత చెప్పినవన్నీ అబద్దాలే:
టాలీవుడ్ లో ఇప్పుడు పాడుతా తీయగా షో మీద నానా రచ్చ జరుగుతోంది. సింగర్ ప్రవస్తి ఈ షోమీద, జడ్జిల మీద చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్ సునీత, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పందించారు. అయితే సునీత ఇచ్చిన రిప్లై మీద ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేసింది. అసలు సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ కొట్టి పారేసింది. ఏ ఒక్కటి కూడా నిజం లేదని వాపోయింది. మేడం మీరు వీడియోలో చక్కగా మాట్లాడారు. బయట కూడా అలాగే మాట్లాడితే ఇంకా బాగుండేది. మీరు చెప్పినట్టు నేను ఛానెల్ వాళ్లకు రైట్స్ ఉన్న పాటలే ఎంచుకున్నాను. కానీ నన్ను పాడొద్దన్నారు. అదే పాటను వేరే అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే ఓకే చేశారు. నేను కొన్ని సార్లు మీరు ఓకే అన్న పాటకు రిహార్సల్స్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయించారు.
నల్ల రిబ్బన్లతో బరిలోకి ప్లేయర్స్:
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, అంపైర్లు ఒక్క నిమిషం మౌనం పాటించనున్నారు. ఉగ్రదాడికి నిరసనగా ఈ మ్యాచ్‌లో ఛీర్ లీడర్స్ కూడా ఉండరు. మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ప్రేక్షకులను సాయత్రం 4 గంటల నుంచే లోపలికి అనుమతిస్తారు.