నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్:
నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా అందరూ మాస్కులు ధరించారు. జనాలు ఇళ్లలోనే ఉండి తలుపులు, కిటికీలు వేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నేతల భూతులు వినలేక:
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం అంతే అంటూ మరికొద్దిమంది భూతులు మాట్లాడుతున్నారు.. గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు.. ప్రజల అందరూ ఆ నేతల భూతులు వినలేక.. పోలింగ్ భూత్‌లోకి వెళ్లి ఓటు వేసి ఓడించారు.. భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని పేర్కొన్నారు.
బాలికలదే పై చేయి.. కృష్ణా జిల్లా ఫస్ట్:
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత.. సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు.. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణంగా పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ:
చిన్నకోడూరు (మం) గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీంనగర్ లో వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పండి.. గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఏ ఊరికి వెళ్దామో రండి రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్దాం.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీపక్షాన తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను.
ఆస్తి కోసం యువతి హత్య:
ఆస్తుల కోసం అయినవారిని పొట్టనబెట్టుకుంటున్నారు. ఆస్తి తమకే దక్కాలన్న దురాశతో అన్నదమ్ములను, అక్కాచెల్లెల్లను, తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లి కూతురిని హత్య చేసింది. మేడిపల్లిలో దారుణ హత్యకు గురైన మహేశ్వరి కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరిని హత్య చేసింది సవతి తల్లి లలిత ఆమె మరిది రవి అతని స్నేహితుడు వీరన్నలుగా పోలీసులు గుర్తించారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు మృతి:
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం వద్దకు వెళ్లిన రైతు విద్యుత్ వైర్లు కాళ్లకు తగిలి మృతిచెందాడు. పుల్కాల్ (మం) మీన్ పూర్ తండాలో రెండ్రోజుల క్రితం గాలి దూమరానికి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇది గమనించిన రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కరెంట్ కట్ చేశాం..త్వరలోనే వైర్ పునరుద్దరిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు అధికారులు. కరెంట్ కట్ చేశామని అధికారులే చెప్పడంతో నిన్న రాత్రి పొలం వద్దకు వెళ్లాడు రైతు రమేష్(33).
దేశంలో డ్రోన్, ఐఈడీ దాడులు జరగొచ్చు:
దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని సూచించాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. రెండు చోట్ల రైల్వే స్టేషన్‌లోకి చొరబడి రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వక్ఫ్ చట్టం వ్యతిరేకంగా అల్లర్లు సృష్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లుగా గవర్నర్ ఆనంద్ బోస్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు.
గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కి తీసుకెళ్తుండగా:
దేశంలో ఎక్కడైనా బాయ్స్ హాస్టల్‌లోకి అమ్మాయిలు అనుమతి ఉండదు.. అలాగే ఉమెన్స్ హాస్టల్‌లోకి అబ్బాయిలకు అనుమతి ఉండదు. చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటిది ఒక విద్యార్థి.. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం తలెత్తకుండా సరికొత్త ఉపాయం ఆలోచించాడు. అంతే ఏకంగా ఒక పెద్ద సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను పెట్టి హాస్టల్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అతగాడి ఎత్తులు.. చిత్తులైపోయాయి. గార్డులు చాకచక్యంగా కనిపెట్టి పట్టుకున్నారు. ఈ ఘటన హర్యానాలోని ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.
దిగొచ్చిన ఇరాన్:
ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని ఒమన్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా ఉంటే.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నాయకత్వంలో అణు చర్చలు జరగనున్నట్లు తెలిపాయి.
భారత్‌కి రాబోతున్న అమెరికా ఉపాధ్యక్షుడు:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.
అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు:
స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులకి అజిత్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, అర్జున్ దాస్ విలన్‌గా కనిపించాడు. ఇందులో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘తొట్టు తొట్టు’ పాటతో విశేష స్పందన అందుకుంది. దీంతో తాజాగా ఈ మూవీ జర్నీ పై ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందం వ్యక్తం చేసింది. ‘ నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. అజిత్ సార్ అంటే నాకెంతో అభిమానం. చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఫస్ట్ డే నుంచి షూట్ చివరి రోజు వరకు మీరెంతో సపోర్ట్ చేశారు. నేను కూడా టీమ్ భాగమేననే భావన కలిగించేలా ధైర్యం చెప్పారు. సెట్‌ల్లో ఎవరూ ఇబ్బందిపడకుండా ఉండేలా మీరు అందరితో చాలా కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా షిప్‌ల్లో షూట్ చేసిన రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనమంతా కలిసి భోజనం చేయడం.. సరదాగా మాట్లాడుకోవడం నాకు ఎంతో నచ్చింది. మీలాంటి మంచి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. కుటుంబం, కార్లు, రేస్, ట్రావెలింగ్ గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళలో కనిపించే ఆ మెరుపు అందరినీ ఆకర్షిస్తోంది. వృత్తిపై మీకున్న నిబద్ధత, సహనం, నాలాంటి ఎంతోమంది కొత్తతరం నటీనటులకు స్ఫూర్తి సార్. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాలు మీ నుంచి నేర్చుకున్నా. ‘తుట్టు తుట్టు’ పాటలో మీతో కలిసి వర్క్ చేయడం నా జీవితంలో మర్చిపోలేను’ అని ప్రియా రాసుకొచ్చింది.
ఆ హీరోతో రొమాన్స్ చేయాలనేది నా కోరిక:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇందులో హీరోయిన్‌గా నటించిని షాలిని పాండే మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అమాయకత్వం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులో, ముఖ్యంగా యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోతుంది అనుకున్నారు కానీ ఆషించినంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరోయిన్ చేసిన సినిమాలు ఏవి కూడా పెద్ద సక్సెస్ సాధించలేదు. దీంతో ప్రజంట్ హిందీ, తమిళ భాషలో సినిమా, సిరీస్‌లో నటిస్తూ అక్కడ తన టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. మనకు తెలిసి రణ్ బీర్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలా మంది హీరోయిన్‌లు ఆయనతో నటించడానికి ఆరాట పడుతుంటారు. కనీసం ఆయన పక్కన కనిపించిన చాలు అనుకునే హీరోయిన్‌లు కూడాచాలా మంది ఉన్నారు. అందులో షాలిని పాండే కూడా ఒకరు. రీసెంట్‌గా రణబీర్ కపూర్‌తో నటించాలని తన కోరికను వ్యక్తం చేసింది షాలిని ‘రణబీర్ కపూర్ నటనలో ఒక మాయ ఉంటుంది. అతని కళ్లలో ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. రణ్ బీర్‌తో కలిసి ఒక్కరోజైనా పని చేయాలని.. తెరపై ప్రేమగా కనిపించాలనేది నా కోరిక. ప్రతి ఒక మూవీలో అతని నటనలో మార్పు కనిపిస్తూనే ఉంటుంది. అది అతని మ్యాజిక్’ అని చెప్పుకొచ్చింది షాలిని.
గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్:
ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరం కాగా.. తాజాగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని జీటీ శనివారం అధికారికంగా తెలిపింది. అయితే ఈ సీజన్‌లో ఇంతవరకు స్టార్ ప్లేయర్ ఫిలిప్స్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
బంగారం ప్రియలకు భారీ షాక్:
గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈరోజన్నా తగ్గుతుందనుకుంటే.. రేట్స్ మళ్లీ షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270, 22 క్యారెట్లపై రూ.250 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (ఏప్రిల్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700గా.. 24 క్యారెట్ల ధర రూ.95,670గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు రోజుల్లోనే పుత్తడి ధరలు దాదాపుగా 6 వేలు పెరిగాయి. గతేడాదే ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర.. ఇప్పుడు లకారానికి నాలుగు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. వచ్చే వారంలో కూడా పసిడి ధరలు ఇలానే పరుగులు పెడితే.. లక్ష రూపాయలను చేరుకుంటుంది. గోల్డ్ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అనలిస్టుల అంచనాలు తల్లకిందులు అయ్యాయి.