కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం:
కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని మండిపడ్డారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ నగర పంచాయతీ కౌన్సిలర్లు ఈ కలిశారు.
పొగాకు రైతులు అధైర్యపడొద్దు:
పొగాకు రైతులు ధరలపై అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటికే పొగాకు ధరలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారన్నారు. రైతులు దగ్గర ఉన్న పొగాకు పంటను కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి కొనే విదంగా చూస్తామన్నారు. బాపట్ల జిల్లా టూరిజంకి ఆయువు పట్టు అని, టూరిజంతో జిల్లా జీడీపీ పెరుగుగుతుందన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తున్నాం అని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు బాపట్ల జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం:
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించే పరిస్థితి లేదని, పని భారం విభజన జరుగుతోంది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాకే అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామన్నారు. రేషనలైజేషన్ వల్ల పని భారం తగ్గుతుందని, సచివాలయాల సంఖ్య పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు సచివాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆర్‌ఎస్ఎస్ నేతలే టార్గెట్:
సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్, సమీర్ ఫోన్ చాటింగ్స్ రిట్రీవ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోడ్ భాషలో సిరాజ్, సమీర్ ఛాటింగ్ జరిపారు. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని ఛాటింగ్ లో పేర్కొన్నారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కెమికల్ ల్యాబ్‌కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు. అంతేకాకుండా.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఆర్ఎస్‌ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సిరాజ్ సందేశమిచ్చాడు. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులు నిర్వహిద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఛాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో ఛాటింగ్‌లో చూపెట్టుకున్నాడు.
అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం:
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పట్ల అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందిస్తోంది. భారీగా ప్రాణనష్టం చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక శాఖలు తమవంతుగా ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని నాగ్‌పూర్‌కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని ఈ బృందం టెక్నికల్ విశ్లేషణల ద్వారా ప్రమాదానికి కారణాలపై దృష్టిసారించింది. ఈ బృందం నివేదిక కీలకంగా మారనుంది. అంతేగాక, చార్మినార్ పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై వారు ఇప్పటికే పలు శాఖలకు అధికారికంగా లేఖలు పంపారు. వాటిలో ONGC, ఫైర్ డిపార్ట్‌మెంట్, GHMC, విద్యుత్ శాఖ, ఫోరెన్సిక్ విభాగంతో పాటు పలు గ్యాస్ కంపెనీలు ఉన్నాయి. వీరందరూ తమ పరిశీలనలు పూర్తి చేసి నివేదికలను పోలీసులకు అందించనున్నారు.
24 గంటల్లో వెళ్లిపో:
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి మరో అధికారిని భారత్ బహిష్కరించింది. ఆ అధికారిని పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తన హోదాకు అనుగుణంగా నడుచుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ నెలలో ఇది రెండోసారి బహిష్కరణ. మే 13న.. ఓ పాకిస్థాన్ అధికారిని భారత్ బహిష్కరించింది.
ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్ భారత్ స్టేషన్ల’ ప్రారంభోత్సవం:
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (22 మే, 2025) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
మహిళ అస్థిపంజరాన్ని తవ్వి బయటకు తీసిన యువకుడు:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కాంతి ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక యువకుడు ఏడేళ్ల మహిళ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం కాంతి ప్రాంతంలో ఒక స్థానిక మహిళను ఖననం చేశారు. తాజాగా అదే స్త్రీ అస్థిపంజరాన్ని ఆ యువకుడు సమాధి నుంచి తవ్వి బయటకు తీశాడు. అనంతరం అతను అస్థిపంజరంతో నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇది చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ యువకుడిని ప్రభాకర్ సీతగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు అతన్ని పోలీసులకు అప్పగించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగిందని, స్థానికులు పోలీసులపై ఇటుకలు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామస్థులతో మాట్లాడిన పోలీసులు.. చివరకు జనసమూహాన్ని నియంత్రించి, తీవ్రంగా గాయపడిన యువకుడిని కాంతి ఉపజిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
హోంమంత్రి ఇంటిని తగులబెట్టిన ఆందోళనకారులు:
పాకిస్థాన్‌ను ప్రస్తుతం అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ఒక వైపు బలూచిస్థాన్‌లో అస్థిరత నెలకొంది. మరోవైపు సింధ్ ప్రావిన్స్ లో నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఘటన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. తాజాగా పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు. నౌషాహ్రో ఫిరోజ్ జిల్లాలోని సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. ఆందోళనకారులు ఇళ్లలోని వస్తువులను తగులబెట్టి, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు నిరసనకారులు మరణించారు. ఒక డీఎస్పీ, ఆరుగురు పోలీసులతో సహా డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారు.
ఫీల్డ్ మార్షల్ గా ప్రోమోషన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్:
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కేబినెట్ ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ పదవికి ప్రమోట్ చేసింది. నిజానికి ఇది దేశ చరిత్రలో ఇలా చేయడం రెండోసారి మాత్రమే. ఇదివరకు 1959లో మహ్మద్ అయూబ్ ఖాన్‌కు ఈ పదివిని ఇచ్చారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన “ఆపరేషన్ సిందూర్” సైనిక సంఘర్షణలో మునీర్ పాత్రను ఈ ప్రమోషన్‌కు కారణంగా పేర్కొంది పాక్ ప్రభుత్వం. అయితే, ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఓటమి ఎదురయ్యినప్పటికీ కేవలం 10 రోజుల్లోనే ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.
ప్లేఆఫ్స్ లో నిలిచేదెవరో:
నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ ను మొదటగా బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆడటం లేదు. అతని స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ కోసం వచ్చాడు. ఈ మ్యాచ్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’ లాంటిది. ప్లేఆఫ్స్‌కు నాల్గవ స్థానం కోసం ఇరు జట్ల మధ్య గట్టి పోటీ జరుగుతోంది. నేడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు గెలిస్తే వారు ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక తన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.
రానా నాయుడు-2 టీజర్ వచ్చేసింది:
రానా నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. వైలెన్స్, రొమాన్స్ అంతకు మించి బోల్డ్, బూతులు ఉండటంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ సిరీస్ సీజన్-2 వచ్చేసింది. రానా నాయుడు-2 పేరుతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రానా, వెంకటేశ్ యాక్షన్ అదరగొట్టారు. ఈ టీజర్ లో బోల్డ్ నెస్ అనే మాటనే లేదు. కేవలం యాక్షన్ మాత్రమే చూపించారు. సిరీస్ లో ఉందో లేదో తెలియదు గానీ.. టీజర్ లో మాత్రం దాని జోలికి పోకుండా కట్ చేశారు.
థగ్ లైఫ్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్:
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, శింబు కీలక పాత్రలో నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ. పైగా ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అందాల బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించగా.. ఈ సెకండ్ సింగిల్ ఆమె మీదనే చేశారు. రెహమాన్ మ్యూజిక్ అందించగా.. అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ వోకల్స్ సాంగ్ పాడారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం బాగుంది.