సీఎం పదవికి జగన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను పంపారు. తాజాగా మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. “ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కివస్తున్నాయి. జరిగిన పరిస్థితులు చూస్తే ఫలితాలు నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి జరుగుతుందని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మంది చేసాం. వాళ్ల కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్ధం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్ధను సైతం తీసుకొస్తూ… గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీచాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా అవ్వాతాతల చూపిన ఆప్యాయత ఏమయ్యిందో కూడా తెలియడం లేదు.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్తో చంద్రబాబు భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ గ్రాంఢ్ వెల్ కమ్ పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియపర్చుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేకంగా భేటీ అయిన ఇరువురు నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశం పైనా చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఇరువురు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కాగా, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత ధ్యపవన్ కళ్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ భార్యకొణిదెల అన్నా లెజినోవా, కొణిదెల అకిరా నందన్ తో కలిసి చంద్రబాబు నాయుడిని సత్కరించారు. ఇక, పవన్ కొడుకు అకిరా నందన్ చంద్రబాబు ఆశీర్వాధం తీసుకున్నారు. అకిరాకు టీడీపీ అధినేత ఆశీస్సులు అందించారు.
దర్శిలో ఉద్రిక్తత.. కౌంటింగ్లో అవకతవకలపై టీడీపీ, వైసీపీ ఏజెంట్ల ఆరోపణలు..
ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఏజెంట్ల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు టీడీపీ ఏజెంట్లు వచ్చారు. తమకు మెజారిటీ వచ్చే రాళ్ళూరు ఈవీఎంల కౌంటింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పిచింది. ఇక, ఇరు పార్టీల ఏజెంట్లకు సర్దిచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్వో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపణ చేస్తున్నారు. కాగా, వెంటనే ఆర్వోను సస్పెండ్ చేసి రీ కౌంటింగ్ నిర్వహించాలని టీడీపీ పార్టీకి చెందిన ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో దర్శి నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య పహారా కాస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డి అభినందనలు
ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజారిటీ రావడంతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతోనే బీజేపీకి సీట్లొచ్చాయి
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి అంతర్గతంగా చేసుకున్న ఒప్పందంతో కమలం పార్టీ 8 సీట్లు గెలవగలిగారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని అడిగాం. అందుకే బీజేపీ, ఎన్డీఏ కూటమి కంటే అత్యధికంగా సీట్లు రావడం జరిగింది. సింగిల్‌గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెబుతున్న అహంకారానికి ఫుల్‌స్టాప్ పడింది. రాబోయే రెండు మూడు రోజుల్లో దేశ రాజకీయలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి. దేశంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నవారంతా ఆలోచించాలి.’’ అని కోరారు. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి కనీవినీ ఎరుగని మెజారిటీ వచ్చింది. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. రెండవ అతిపెద్ద మెజారిటీ వచ్చింది ఖమ్మంలోనే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చారన్నారు. హైదరాబాద్ మొదటి నుంచి ఎంఐఎం సోదరులు గెలుస్తారు. మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకు గడిచిన అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే 1.67 శాతం అధికంగా ఓట్లు వచ్చాయి.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రధాని మోడి.. కాకపోతే మెజారిటీ..
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై ఆయన విజయం సాధించారు. కానీ ఈసారి గెలుపు మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది. అతను తన సమీప ప్రత్యర్థి అజయ్ రాయ్‌పై 152,513 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మోదీకి 612,970 ఓట్లు రాగా, అజయ్ రాయ్‌కు 4,60,457 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అథర్ జమాల్ లారీకి 33,766 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ నగరానికి చెందిన యుగ తులసి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలిశెట్టి శివకుమార్ 5,750 ఓట్లు సాధించారు. గత రెండు ఎన్నికల్లో మోడీ మెజారిటీ బాగా తగ్గిపోయింది. అతను 2019 ఎన్నికలలో 479,505 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు. అతను 2014 సాధారణ ఎన్నికల్లో 371,784 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్‌లో చేదు ఫలితాన్ని బీజేపీ అంగీకరించాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈసారి 33 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మెజారిటీ కూడా తగ్గిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజల ఫలితాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయం. ఈ పోరాటం మోడీ వర్సెస్ పబ్లిక్ అని ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజలకు, ఇండియా కూటమి నేతలకు.. పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు. కూటమి కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం పోరాడలేదని.. ప్రభుత్వ సంస్థలపై ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని తెలిపారు. ఈ ఎన్నికలు ఈడీ, సీబీఐకి వ్యతిరేకంగా జరిగాయని.. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికలు జరిగాయన్నారు. దేశంలోని పేదలు, రైతులు, వెనుకబడిన వాళ్ళే రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ముందుకు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ మీతో ఉంటుంది.. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై మీరు ఏమనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మా కూటమి నేతలతో మాట్లాడి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంపై స్పందించారు. తమ వెనుక దాక్కున్న తన సోదరి కృషికి ఈ విజయమని తెలిపారు.
హరోంహర.. ఒక్కరోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి..
నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడిపోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే బీజేపీ కి మెజారిటీ ఆధిక్యత ఉన్నప్పటికీ మార్కెట్లో ఎందుకు పడ్డాయోన్న విషయాన్ని పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నేడు ఉదయం నుంచి బేర్ గుప్పెట్లోకి వెళ్లిన స్టాక్ సూచీలు.. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా కోలుకోలేదు. దీంతో ఒకానొక దశలో 6000 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 70,234 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ మార్కెట్లో పుంజుకొని మార్కెట్ నుంచి సమయానికి 4390 పాయింట్ల నష్టంతో 72 079 వద్ద ముగిసింది. ఇక మరోవైపు నిఫ్టీ 50లో దాదాపు 1379 పాయింట్లు మేర నష్టపోయి 21,884 పాయింట్లు వద్ద నిలిచింది. ఇక నేడు లాభపడిన సూచీల విషయానికి వస్తే.. హెచ్‌యూఎల్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా షేర్లులు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.