ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్:
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పరార్ అయిన మురళి కోసం మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్ లో అధికారులు గాలించారు. ఇక, తిరుపతిలోని కేఆర్ నగర్ లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లిన అతడ్ని సీఐడీ డీఎస్పీ డీవీ వేణుగోపాల్ బృందం అరెస్టు చేసింది. అయితే, ఆర్డీవో మురళి ముందస్తు బయలు కోసం హైకోర్టుకు దరఖాస్తు చేయగా రిజెక్ట్ అయింది. ఇక, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోవడంతో అరెస్టు అనంతరం బెయిలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం మురళిని అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు తెలిపిన సీఐడీ అధికారులు వెల్లడించారు.
టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ :
తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. పుత్తూరులోని ఓ చర్చిలో ప్రార్థనలు చేసినట్లే అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్ చేశాడు. ఇక, దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా ఏఈవో రాజశేఖర్ బాబుని ఈవో శ్యామలరావు సస్పెండ్ చేశారు.
కేబినెట్ భేటీ ప్రత్యేకత ఏంటో తెలుసా?:
జులై 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంకు మంత్రులు అందరూ హాజరుకానున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు 18 సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. సుమారు 315 పైచిలుకు అంశాలపై క్యాబినెట్ చర్చించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై ఈసారి సమీక్ష చేయనున్నారు. ప్రతిసారీ జరిగే కేబినెట్ మీటింగ్ హాల్‌లో కాకుండా.. సీఎం మీటింగ్ హాల్‌లో 19వ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
యూరియా సరఫరా వేగవంతం చేయండి:
ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికి రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. వానాకాలం సాగు దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరారు.
మద్యం మత్తులో పోలీసులతో యువతి హల్‌చల్:
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం ప్రారంభించారు. దాడికి కూడా యత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం స్పాన్సర్ చేసిందా:
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నట్లు తెలిసింది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ నేతృత్వంలోని టూరిజం డిపార్ట్‌మెంట్ అమెకు స్పాన్సర్ చేసిందని వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి మహమ్మద్ రియాస్ స్పందించారు. గతంలో రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నియమించిన ఓ ఏజెన్సీ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దేశంలోని పలువురు యూట్యూబర్‌లను రాష్ట్రానికి ఆహ్వానించిందని తెలిపారు. “రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నియమించిన ఓ ఏజెన్సీ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పలువురు యూట్యూబర్‌లను రాష్ట్రానికి ఆహ్వానించింది. ఇందులో జ్యోతి ఒకరు. ఆమెపై గూఢచర్య ఆరోపణలు రావడానికి చాలా కాలం ముందు ఇది జరిగింది. జ్యోతి మల్హోత్రా ఎంపిక వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రేమీ లేదు.” అని మంత్రి స్పష్టం చేశారు.
నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు:
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు. “రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉంది. అది ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ మేము దీన్ని ప్రచారం చేయలేకపోతున్నాం. శివుడు, విశ్వామిత్రుడు కూడా ఇక్కడే జన్మించారు. ఈ విషయం వాల్మీకి రామయణంలో రాశారు.” అని కేపీ శర్మ ఓలి వ్యాఖ్యానించారు.
కొత్త పార్టీ ప్రకటనతో మస్క్‌కు ఎదురుదెబ్బ:
జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా, ఎలాన్ మస్క్ నికర విలువ తగ్గుతూ వస్తోంది. అయితే, ట్రంప్‌తో జరిగిన గొడవ మధ్య, ఎలోన్ మస్క్ నిరంతరం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. సంపద క్రమంగా తగ్గుతోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని డేటాను ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద కేవలం 24 గంటల్లో 15.3 బిలియన్ డాలర్లు తగ్గింది. అతని నికర విలువ 346 బిలియన్ డాలర్లకు (మస్క్ నెట్‌వర్త్ ఫాల్) పడిపోయింది. ఈ తాజా పతనంతో 2025 సంవత్సరంలో మస్క్ నష్టం 86.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.
బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్:
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్‌కు నటుడు షైన్ టామ్ చాకో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. షూటింగ్ సమయంలో జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నా అని, కావాలని చేసింది కాదని చాకో తెలిపారు. ఆ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. చాకో నుంచి అలాంటి అనుభవంను తాను అస్సలు ఊహించలేదని విన్సీ చెప్పారు. వివాదం సమసిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు. చాకో, విన్సీ కలిసి నటించిన చిత్రం ‘సూత్రవాక్యం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా త్రిస్సూర్‌లోని పుతుక్కాడ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విన్సీకి చాకో క్షమాపణలు చెప్పారు.
నాగ సాధువులతో కలిసి ‘కన్నప్ప’ను వీక్షించిన మోహన్ బాబు:
విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాగ సాధువులతో కలిసి నటుడు మోహన్ బాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు.ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది.” అని వెల్లడించారు.
క్రికెట్ జుజుబీ:
క్రికెట్‌లో కన్నా వింబుల్డన్‌లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో.. వింబుల్డన్ ప్రతి మ్యాచ్‌లోనూ అంతే ఉంటుందన్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం గ్రేట్ అని విరాట్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2025 టోర్నీ జరుగుతోంది. లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. సోమవారం జకోవిచ్, మినార్ మధ్య మ్యాచ్‌ను సతీసమేతంగా వీక్షించాడు.
మూడో టెస్టులో బుమ్రా ఎంట్రీ:
ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ టీమ్స్ చెరో మ్యాచ్ గెలిచాయి. జులై 10 నుంచి లార్డ్స్‌లో మూడవ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. మూడో టెస్టులో ఆడడం టీమిండియాకు సానుకూలాంశం. అయితే లార్డ్స్ టెస్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడేది అనుమానంగానే ఉంది.