తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు. నేటితో గడువు ముగియనున్న తరుణంలో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బైకులు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, లారీ వంటి భారీ వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారని అన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, నిర్ణయాలను చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదని, అన్ని రంగాల్లో మోడి ప్రభుత్వం అద్భుతమయిన అభివృద్ధి సాధించిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంలో రాజకీయ అంశాలు లేకుండా, అభివృద్ధి పైనే మాట్లాడారని, వివిధ శాఖలు సాధించిన అనేక అంశాలు, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చారన్నారు. దేశప్రజలకు స్పష్టమయిన సందేశం రాష్ట్రపతి ఇచ్చారని, తెలంగాణ లో ఈ రోజుతో గ్రామ పంచాయితీల ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగుస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పంచాయితీ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయితీల నిధులు దారి మళ్లించారని, సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తోంది.. ప్రభుత్వం ఎటువంటి స్పష్టమయిన నిర్ణయం తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి.
స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత సమాజం రాకెట్ యుగంలో దూసుకెళ్తోంది. ఈ జనరేషన్‌లో మొబైల్ ఉపయోగించనివాళ్లే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏది ఉన్నా.. లేకున్నా ప్రతి పౌరుడి చేతిలో మాత్రం ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మనిషికి మొబైల్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో ఎన్నికల స్టంటో.. లేదంటే దేశీయంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలను ప్రోత్సహించేందుకో తెలియదు గానీ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి(వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ – ఓడీఓపీ)లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులను సీఎం జగన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్-ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు రావడం గమనార్హం. ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు రాగా.. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి. సామాజిక, ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం – వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అధికారులు అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు కలిశారు. వారిని సీఎం జగన్ అభినందించారు.
స్టాఫ్ నర్సుల నియామకంతో మాట నిలబెట్టుకున్నాం
ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాటను స్టాఫ్ నర్సుల నియామకంతో నిలబెట్టుకున్నామన్నారు భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతీ యువకుల కలలను సహకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్ధులమై పనిచేస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన విషయం మీకు తెలుసు అని ఆయన అన్నారు.
ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం.. ప్రభుత్వ బడుల్లో ఐబీ విద్యావిధానం
ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్య అమలుకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ ప్రకారం పేద పిల్లలకు విద్యాభ్యాసం అందనుంది.
బడ్జెట్‌పై ప్రధాని మోడీ ఏమన్నారంటే..!
గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్‌కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకూడదు.. మేము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు మోడీ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్‌తో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని.. ప్రజల ఆశీస్సులతో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి..
ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే అని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే… మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హారీష్ రావు గారు… పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదంటూ ఆయన హెద్దెవ చేశారు. అవాకులు చెవాకులు పలకడం కాదు… ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గద్దర్ జయంతి రోజు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకుల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.