పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజలను, పార్టీని,తనను నమ్ముకోని చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను నమ్ముకొని, ఆయన ఓటు బ్యాంకుతో గెలవాలన్న స్థాయికి దిగజారాడన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. సీఎం జగన్‌ను పవన్ కల్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారని చెప్పారు.
బీజేపీలో చేరిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు
తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ సమక్షంలో నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు నేడు ఢిలీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసేవారు బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రధాని నేతృత్వంలో 10 ఏళ్లలో పేదలకు వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ళు,గ్యాస్,నీళ్లు,మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని, దేశ ఖ్యాతి ,వికసిత భారత్ లక్ష్యాన్ని,పేదరిక నిర్ములన కోసం మోడీ చేస్తున్న పని చూసి బీజేపీలో చేరుతున్న అని రాములు చెప్పారన్నారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. రాములు చేరికను స్వాగతం పలుకుతున్నానన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారని, అన్నివర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లే వ్యక్తి రాములు అని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ నాయకత్వంలో దేశ ప్రజల పక్షాన పనిచేసేందుకు బీజేపీ లో చేరారని, రాములు చేరిక ప్రభావం రానున్న ఎన్నికల్లో ఉంటుందన్నారు.
మంకీ ఫీవర్‌తో మరొకరు మృతి.. 10 రోజుల్లో మూడో మరణం..
కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్’ వ్యాధి కలవరపెడుతోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)గా పిలువబడే ఈ వ్యాధి బారిన పడి మరో వ్యక్తి మరణించాడు. చిక్కమగళూర్‌లో 43 ఏళ్ల వ్యవసాయ కూలీ బుధవారం ఉదయం మృతి చెందింది. కేఎఫ్‌డీ ఇన్‌ఫెక్షన్‌తో మహిళ ఫిబ్రవరి 21న శివమొగ్గలోని మెగాన్ హాస్పిటల్‌లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. మరోవైపు కేఎఫ్‌డీ వ్యాక్సిన్ల స్టాక్ అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
అంతకుముందు ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్ధాపూర్ పట్టణంలో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సారి మంకీ ఫీవర్ వ్యాప్తి అధ్వానంగా ఉందని, ముఖ్యంగా 12 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపుగా 500 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి రాష్ట్రాన్ని తాకుతుందని మేం ఊహించలేదని, అందుకే వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున నిల్వ చేయలేదని, వ్యాక్సిన్ల తయారీ జరుగుతోందని మే 2025 నాటికి మాత్రమే అందుబాటులోకి వస్తాయని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.
పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు
పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు రాష్ట్రంలో సింగపూర్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని స్పష్టం చేశారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక వాతావరణం ఉంటుందని, సర్వత్ర స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని.. మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు. ఇక్కడ పెట్టుబడులకు సలహాలు సూచనలు ఇవ్వండి… ఆహ్వానించే విషయం లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంతో హైదరాబాద్ లో పెట్టుబడుల భూమ్ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మా, TEXTILE, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ పట్టణంలోని పురాతన మూసీ నదిని పునర్-జీవింప చేసే చర్యలు ప్రారంభించామన్నారు. మూసి రివర్ ఫ్రెంట్ బోర్డు ద్వారా మంచినీటితో మూసిని నింపి.. థేమ్స్ నదిలా మారుస్తామన్నారు.
పవన్ సినిమా డైలాగ్‌లు చెప్పినంత ఈజీ కాదు..
ముఖ్యమంత్రి జగన్ కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాపులకు రూ.25 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. విశాఖలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని ఆయన వెల్లడించారు. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
బయటపడ్డ నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు
నగరంలోని కేబీఆర్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైదరాబాద్ నిజాం ప్రైవేట్ పెట్రోల్ పంపు అందరి దృష్టిని ఆకర్షించింది. కేబీఆర్ ఉద్యానవ నంలో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడడంతో ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వచ్చే పాదచారులు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. ఇంకేముంది.. ఈ పెట్రోల్ పంపుకు సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. నిజాం – తన కార్లు, ట్రక్కులు ఇతర మోటారు ఇంధనం యంత్రాలలో నింపేందుకు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఈ పెట్రోల్ పంపు చిత్రాలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
రాష్ట్రంలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. గురువారం సచివాలయంలో BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. BEML కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సిఎండి శంతను రాయ్ డిప్యూటీ సీఎం వివరించారు. బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందని, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్డ్ లో, సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పనిచేస్తున్నట్టు వివరించారు. హైదరాబాదులో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు.
కన్నుల పండువగా వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం
ఏపీలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పారుపూడి కనక చింతయ్య సమేత శ్రీ వీరమ్మ తల్లి పేరంటాల మహోత్సవ వేడుకలు గత 11 రోజులుగా ఉయ్యూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన వీరమ్మ తల్లి సిడి బండి బండి మహోత్సవం వేడుక కన్నుల పండుగ ఉయ్యూరు పట్టణంలో గురువారం కొనసాగింది. వేలాది మంది భక్తుల కోలాహలం, యువకుల నృత్యాలతో డప్పు దరువుల నడుమ సాగిన సిడి బండి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.
ఆనవాయితీగా భక్తులు సిడి బండికి అరటికాయలు విసిరేసి భక్తిని చాటారు. అనంతరం వీరమ్మ తల్లి ఉయ్యాల మండపం వద్ద సిడి ఆడించి ఆలయానికి సిడి బండి చేరుకొని మూడు ప్రదక్షిణలు నిర్వహించారు.దీనికి తోడు ఉయ్యూరు దళితవాడకు చెందిన ఉయ్యూరు వంశానికి చెందిన ఉయ్యూరు కృష్ణఫర్ కుమారుడు ఉయ్యూరు అనుపమ్ (ఈ ఏడాది వివాహం చేసుకున్నందుకు పసుపు కుంకుమలు పుచ్చుకున్న వరుడు ) ను పోలీసు బందోబస్తు నడుమ ఊరేగింపుగా తోడుకొని ఉయ్యూరు ప్రధాన సెంటర్ కు తీసుకురాగా.. అక్కడినుంచి సందడిగా ఆలయంకు చేరుకున్న కావలసిన వసతులు కల్పించి ఆలయం ఎదుట సిడి బండి బుట్టలో కూర్చుండబెట్టి సిడి ఆడించారు.ఈ సందర్భంగా భక్తులు కోర్కెలను తీర్చాలని కోరుతూ అరటికాయలు విసిరేసి మొక్కులు తీర్చుకున్నారు.