కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి కలుగుతుంది అంటే అది.. పారదర్శకతకి సమాచార హక్కు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది ఆయనే.. తెలంగాణతో ఆయనకు ఎంతో అనుబంధం ముడిపడి ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైల్ మొదటి దశ పూర్తి చేసుకున్నాం అంటే మన్మోహన్ సింగ్ క్రెడిట్ అని కొనియాడారు.
మన్మోహన్ సింగ్‌ని బీజేపీ అవమానించింది.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలంపై వివాదం నెలకొంది. మాజీ ప్రధానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. స్మారక చిహ్నం నిర్మించడానికి కేటాయించిన స్థలంలో ఆయన అంత్యక్రియలు చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనని తిరస్కరించడం ద్వారా బీజేపీ మన్మోహన్ సింగ్‌ని అవమానించిందని రాహుల్ గాంధీ శనివారం అన్నారు.
‘‘భారతదేశ గొప్ప కుమారుడు, సిక్కు సమాజానికి మొదటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ అంత్యక్రియల్ని నిగంబోధ్ ఘాట్‌లో ఈ రోజు నిర్వహించడం ద్వారా అవమానించింది’’ అని అంత్యక్రియలు పూర్తయిన కొన్ని గంటల తర్వాత రాహుల్ గాంధీ అన్నారు.
మాజీ ప్రధాని అంత్యక్రియలను ప్రత్యేక స్మారక స్థలంలో నిర్వహించాలని కాంగ్రెస్ శుక్రవారం కేంద్రాన్ని కోరింది. అయితే, ప్రభుత్వ శ్మశానవాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లో మృతదేహాన్ని దహనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పెద్ద వివాదానికి కారణమైంది. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించబడుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఆయన కుటుంబానికి తెలియజేసింది.
మన్మోహన్ సింగ్ ఓ అరుదైన రాజకీయ నాయకుడు.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మంత్రి నారాలోకేష్ ఆశక్తి కర ట్వీట్ చేశారు. భారతదేశం మన్మోహన్ సింగ్ అస్తమయంపై శోకసంద్రంలో మునిగిన సమయంలో ఆయన మా కుటుంబం పట్ల చూపిన ప్రేమను గుర్తు చేసుకోవాలంటూ నారా లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘2004 మాకు పరీక్షా సమయం. అప్పడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్నికోల్పోయింది.. చంద్రబాబు నాయుడుపైనా ఆ ఎన్నికల ముందే భయంకరమైన దాడి అలిపిరి ఘటన రూపంలో జరిగింది.. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడుకు సెక్యూరిటీని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.. దీంతో చంద్రబాబు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను కలిసి తన సెక్యూరిటీని తిరిగి పునరుద్దరించాలని కోరారు. తనపై జరిగిన అలిపిరి నక్సల్స్ దాడి వ్యవహరాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.
ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం..ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు..
ఇండిగో విమానం ఆలస్యం కావడంతో 100 మంది ప్రయాణికులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగా 16 గంటల ఆలస్యం కావడంతో ఇస్తాంబుల్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. ఇస్తాంబుల్‌కి ఉదయం 6.55 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 6E17 ఇప్పుడు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ‘‘మా ఫ్లైట్ 6E17, వాస్తవానికి ముంబై నుండి ఇస్తాంబుల్‌కి నడపాల్సి ఉంది, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైనందుకు మేము చింతిస్తున్నాము. దురదృష్టవశాత్తు, సమస్యను సరిదిద్దడానికి, గమ్యస్థానానికి పంపించడానికి మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, చివరికి మేము విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది’’ అని ఇండిగో చెప్పింది. ప్రత్యామ్నాయ విమానాన్ని రాత్రి 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు చెప్పింది.
కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసింది
విద్యుత్ చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ను చూసైనా ప్రభుత్వం వెనక్కు తగ్గాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ స్థాయిలో అప్పులు చేసి పెన్షన్ 4 వేలు తప్ప ఇక ఏమి మేలు చేశారో చెప్పాలన్నారు. ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పది లక్షల కోట్లు అప్పులు చేయడానికి ప్రభుత్వం మానసికంగా సిద్ధం అయినట్టు కనిపిస్తోందన్నారు బొత్స సత్యనారాయణ. హనీమూన్ పీరియడ్ అయిపొయింది…..ఆత్మ పరిశీలన చేసుకుని హామీలు అమలు చేయండన్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలు ఒక్కొక్కరికి రూ.24 వేలు
గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను అందించడంపై సన్నాహాలు ప్రారంభించగా, యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగింది. ఈ చర్యలు బీసీ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడతాయి.
పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. ఇది వారి బాధ్యతే అన్న డిప్యూటీ సీఎం
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నకిలీ ఐపీఎస్‌గా గుర్తించారు. తాజాగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “నకిలీ ఐపీఎస్ అధికారి ముసుగులో ఓ వ్యక్తి వచ్చాడని నాకు తెలిసింది. ఫొటోలు కూడా దిగాడు అని చెబుతున్నారు. పోలీసులు దీన్ని ఎందుకు గమనించలేక పోయారు. ఇది రాష్ట్ర పోలీసు, ఇంటెలిజెన్స్, హోం శాఖ, డీజీపీ బాధ్యత. నాకు కేవలం పని చేయడం మాత్రమే తెలుసు. అధికారం లేనప్పుడు కూడా పని చేశాం. ఇప్పుడూ పని చేస్తున్నాం. పని చేయడం మా బాధ్యత.” అని వ్యాఖ్యానించారు.
మన్మోహన్ సింగ్ కోసం భూటాన్ ప్రత్యేక ప్రార్థనలు..
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం యావత్ దేశాన్ని బాధించింది. భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరొందిన మన్మోహన్ సింగ్ మరణంపై దేశంలోని ప్రముఖ నాయకులతో పాటు, ప్రపంచదేశాధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన అంత్యక్రియలకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. అంతకుముందు భూటాన్ రాజధాని థింఫులోని బౌద్ధ ఆశ్రమంలో మన్మోహన్ సింగ్ కోసం ప్రార్థనలు నిర్వహించారు. టాన్ ప్రభుత్వం ప్రకారం… భూటాన్‌ని మొత్తం 20 జిల్లాల్లో భారత మాజీ ప్రధాని కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భూటాన్ జాతీయ జెండాను దేశవ్యాప్తంగా, రాయబార కార్యాలయాలు, విదేశాల్లో ఉన్న కాన్సులేట్ల వద్ద అవనతం చేశారు. రాజు నేతృత్వంలోని తాషిచోడ్‌జోంగ్‌లోని థింపూస్ కున్రేలో జరిగిన వేడుకలో 1000 దీపాలను వెలిగించారు. ఈ ప్రార్థనల్లో ప్రధాని షేరింగ్ టోబ్‌గే, భారత రాయబారి సుధాకర్ దలేలా, పలువురు రాజకుటుంబ సభ్యులు, భూటాన్ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తను జనసేన పార్టీ ఆదుకుంటుంది
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాయల్ కన్వెన్షన్ హల్‌లో జరిగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఇటీవల మరణించిన బాధిత కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నాదెండ్ల మనోహర్ రాజానగరం చేరుకున్నారు. ముందుగా మధురపూడి ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుండి రాజానగరం చేరుకున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఇటీవల మరణించిన వారి బాధిత కుటుంబసభ్యులకు చెక్కుల పంపిణీ చేశారు. 21 మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను జనసేన పార్టీ ఆదుకుంటుందన్నారు. పవన్ కల్యాణ్ వలన దేశంలో జనసేన పార్టీకి గుర్తింపు వచ్చిందని, జాతీయ నాయకులతో మన్ననలు పొందారన్నారు నాదెండ్ల మనోహర్. పవన్ కల్యాణ్ కోసం కాదు జనం కోసం కార్యకర్తల కోసం నిలబడ్డారని, ప్రజా సమస్యలపై పోరాడే విధంగా నిలబడ్డామన్నారు నాదెండ్ల మనోహర్.