సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసులో నలుగురు అరెస్ట్
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి. హరీష్ రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ రావు కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆధారిత డేటా ఎంట్రీ ఆపరేటర్ జోగుల నరేష్ కుమార్, కారు డ్రైవర్ కొర్లపాటి వంశీ, అసెంబ్లీ అటెండర్ బాలగోని వెంకటేష్ గౌడ్, గోదావరిఖని నివాసి ఓంకార్‌లను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.5 లక్షల CMRF చెక్కులను వీరు ఎన్‌క్యాష్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నలుగురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అంతేకాకుండా.. వారి వద్ద నుంచి కొన్ని CMRF చెక్కులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేజ్రీవాల్ హెల్త్‌పై ఆందోళన.. ఆప్ కీలక ప్రకటన
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. డయాబెటిక్‌తో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్‌ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి.
ఇటీవల కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఆరోపించారు. ఒక దశలో షుగర్ లెవల్ 46 ఎంజీ స్థాయికి పడిపోయినట్లు సమాచారం. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం అని కోరాయి.
వారం రోజుల్లో 38 కోట్లు సీజ్.. ఇంకా..!
లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులోకి వచ్చిన నేపథ్యంలో రూ.38 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో చూపని నగదు, వస్తువులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జప్తు చేశాయి. మార్చి 18 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.38,12,34,123 నగదు, మద్యం, బంగారం, వెండి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఫ్రీబీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
9.01 కోట్ల నగదుతో పాటు రూ.8.14 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. అదనంగా, 3.34 కోట్ల రూపాయల మద్యం మరియు 13.66 కోట్ల రూపాయల విలువైన గంజాయి వంటి డ్రగ్స్‌ను తెలంగాణ పోలీసులు మరియు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జప్తు చేశాయి.
3.95 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు వంటి ఉచిత వస్తువులను కూడా పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని పీఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల అధికారులు మార్చి 21, 22 తేదీల్లో ఆకస్మిక దాడులు చేశారు.
ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షంతో పాటు ఉరుములతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది.
మార్చి 29, 30 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్‌బ్యాక్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో బీజేపీకే మెజార్టీ సీట్లు
తెలంగాణలో ఈసారి బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్న కిషన్ రెడ్డి.. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అంబర్ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గోల్నాక డివిజన్ శ్రీనివాస్ టవర్స్ కదిరి భాగ్, శంకర్ నగర్ బస్తిలో పర్యటించారు. అనంతరం సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రామ్ గోపాల్ పేట్, కాబ్రా కాంప్లెక్స్, పాన్ బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కలాసిగూడ, ఓల్డ్ బోయిగూడా, నాలా బజార్, మొండా మార్కెట్ బస్తిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పది మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
యువతి వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
ఓ అమ్మాయి వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి బంధువులు. కరీంనగర్ శివారులోని తీగల వంతెన పై రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గం మద్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. తన చావు కారణమైన వారిని శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. బైపాస్ రోడ్డు లోని ఓ మెస్ లో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, తమతో పని చేసే అమ్మాయి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. తమ కుమారుడు చావుకి అమ్మాయి బంధువుల వేధింపులే కారణమని వారిపై కేసు నమోదు చేయాలని మృతుడు రాజశేఖర్ రెడ్డి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భావితరాల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..
ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లింది. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతటి మహా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తల ఎత్తుకుని రెపరెపలాడుతుందన్నారు. ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా మార్పు తీసుకుని వచ్చామన్నారు. భావితరాల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించామన్నారు. రాష్ట్రంలో కోట్ల గుండెలు వైసీపీకి మద్దతు పలుకుతూ2024 ఎన్నికలకు సిద్ధం అంటున్నాయన్నారు. వైసీపీ జెండా ఏ జెండాతో జతకట్టడం లేదని.. ప్రజలే మన అజెండా అంటూ సీఎం పేర్కొన్నారు. ప్రొద్దుటూరు సభ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుందన్నారు.
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణ పై అసత్య ప్రచారం
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇఛ్చింది. 555 అభ్యర్థులు సెలెక్టయ్యారు. ఫిబ్రవరి 14న ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కు ప్రభుత్వం అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ టైమ్ ఇచ్చింది. సెలెక్టయిన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. వీరందరూ 3 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 45 రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణనిచ్చేందుకు షెడ్యూల్ ఖరారైంది. మిగతా అభ్యర్థులను జల్లా టాస్క్ ఫోర్స్, ఎన్ ఫోర్స్మెంట్ టీమ్స్, ఎక్సైజ్ స్టేషన్స్, చెక్ పోస్టుల వద్ద ఫీల్డ్ ట్రైనింగ్ కు పంపించటం జరుగుతుంది. జాయినింగ్ కు ఏప్రిల్ 13వ తేదీ వరకు గడువు ఇచ్చినందున.. ఈలోపు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వటం లేదనే ఆరోపణలు అర్థరహితమైనవి. ఇప్పటివరకు జాయినైన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించడమైందన్నారు.
పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు.. పవన్ హెచ్చరిక
జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు. కూటమి ఏర్పాటనేది ఏపీ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. పొత్తులో భాగంగా పార్టీ కోసం చేసిన త్యాగాలు రాష్ట్ర సౌభాగ్యం, అభివృద్ధి కోసమేనన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.. మిత్రపక్ష కూటమిని గెలిపిద్దామని ఆయన సూచనలు చేశారు.
CMRF చెక్కుల గోల్‌మాల్.. హరీష్ రావు ఏమన్నారంటే..?
ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్‌ఎఫ్ ) చెక్కులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు కార్యాలయం తన ప్రమేయాన్ని ఖండించింది. తనకు సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా చెక్కులను క్యాష్ చేశారనే వార్తలపై హరీష్ రావు కార్యాలయం స్పందిస్తూ, నిందితుడు నరేష్‌కు మాజీ మంత్రితో ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది.
డిసెంబర్ 6, 2023న తన మంత్రి క్యాంపు కార్యాలయం కార్యకలాపాలు నిలిపివేసినట్లు హరీష్ రావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న నరేష్‌ను కూడా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాలయంతో ఎలాంటి సంబంధాలు లేవు.