కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదు..
తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు. అబద్దపు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఒక్క బీజేపీ కూటమి మాత్రమేనని మంత్రి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు అందజేస్తున్నామన్నారు. తమపై విశ్వాసంతో మహారాష్ట్రలో ముచ్చటగా మూడోసారి ప్రజలు అధికారం ఇచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి హేమంత్ భార్య విజయం.. సంబరాల్లో కల్పన
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జేఎంఎం పార్టీ జయకేతనం ఎగరేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 41 మ్యాజిక్ ఫిగర్ దాటుకుని 57 స్థానాల్లో దూసుకుపోయింది. ఇక ముఖ్యమంత్రి హేమంత్ భార్య కల్పనా సోరెన్ భారీ విజయం సాధించారు. గాండే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో ఆమె కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై కల్పన విక్టరీ సాధించారు. విజయం అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. గాండే ప్రజలు తనను కూతురిలా ప్రేమించారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలపై మోడీ రియాక్షన్ ఇదే..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్‌లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్‌లో జేఎంఎం ఘన విజయం సాధించింది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు.. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురందేశ్వరి తెలిపారు.
వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో జరుగనున్న రైతు సదస్సు పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే సదస్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మహబూబ్ నగర్ రైతుల సభను బహిరంగ సభలా కాకుండా.. రైతులకు అవగాహన కల్పించే సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు, మెళకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థక శాఖల అధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పార్టీల మధ్య విమర్శలు సహజం.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దు
గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ ఎల్లమ్మ ఆలయం ఆవరణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రాజకీయ విమర్శలతో గత ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అలాగే ప్రవర్తిస్తుందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేశాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని చెప్పానని, కేంద్ర ప్రభుత్వం సకరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. పార్టీల మధ్య విమర్శలు సహజం, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దని, మహారాష్ట్రలో 220 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు బండి సంజయ్. మహారాష్ట్రలో ఓటమికి కారణం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యంత్రులే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
వారి చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది..
వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో ఈ నెల 17,18,19 తేదీలలో అనేక పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశామన్నారు. ఆ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కేసులు కూడా పెట్టినట్లు సమాచారం లేదని అంబటి రాంబాబు తెలిపారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ మెజారిటీ సాధించింది. రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. జేఎంఎం ప్లస్ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదన్నారు. మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ. 3000 రూపాయలు ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు గుర్తుపట్టారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్ ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. మహారాష్ట్రలోఅదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని కేటీఆర్ అన్నారు.ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కి కేటీఆర్ సలహా ఇచ్చారు.
ఈనెల 28వ తేదీ నుండి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు
ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పంచమి తీర్థానికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు.. ఆ రోజు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఈవో తెలిపారు. పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు ముందు రోజు రాత్రి నుండే భక్తులకు కేటాయించిన ప్రాంతాల్లో భోజనం మొదలుకొని అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయని ఈవో పేర్కొన్నారు. పంచమి రోజున 1500 మంది అదనపు సిబ్బందితో భద్రత ఉంటుందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అత్యంత వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ అధికారులు చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.