వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీనే.. మళ్ళీ వైసీపీకే ప్రజల మద్దతు..!
బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడి వైసీపీలో జగన్ సమక్షంలో చేరాను అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాను అని ఆయన తెలిపారు. వంగవీటి రంగాను అభిమానించే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎలా జట్టు కడతారు అని ప్రశ్నించారు. వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీనే అని వంగవీటి నరేంద్ర ఆరోపించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రభుత్వం వరి ‘ఎ’ గ్రేడ్‌కు కనీస మద్దతు ధర రూ. 2203
నిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో మొత్తం 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, వాటిలో 417 కేంద్రాలు సహకార సంఘాల కింద, 39 ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ద్వారా, ఆరు కేంద్రాలు మునిసిపల్ ఏరియాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) కింద పనిచేస్తాయని తెలిపారు.
పాకిస్తాన్‌లో కుప్పకూలిన బొగ్గు గని.. 12 మంది దుర్మరణం..
పాకిస్తాన్‌లో బొగ్గు గని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారు. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిపోయిన బొగ్గు గని నుంచి బుధవారం మరో 10 మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు. రెస్క్యూ ముగిసిన తర్వాత మొత్తం మృతుల సంఖ్య 12గా తేలిందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఖోస్ట్ మైనింగ్ ప్రాంతంలో ప్రైవేట్ బోగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో పలువురు కార్మికులు భూమి అడుగున 800 అడుగుల కింద చిక్కుకుపోయారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభలు..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో జిల్లా నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించనున్నారు.. ఇక, ప్రొద్దుటూరులో వైసీపీ మొదటి సభ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రచారానికి జగన్ సిద్ధం సభలు ఏర్పాటు చేయబోతున్నాని ఆయన తెలిపారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆతర్వాత ఎన్నికల ప్రచార సభ ఉంటుందన్నారు. మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర కొనసాగనుంది.. రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఏర్పాటు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు.
మోడీ గ్యారంటీ- ఈటల ష్యూరిటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల
మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ పేరుతో విడుదల చేశారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వేలాదిగా తరలివచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మే 13 వ తారీకు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావంను మల్కాజిగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని, యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదన్ని నిజం చేయాలని.. దాంట్లో మల్కాజిగిరి కూడా ఉండాలని చెప్పి వారు సమర శంఖం పురించండం జరిగిందన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు మాటలు ‘నేతీ బీరకాయలో నెయ్యి’ చందoలా ఉన్నాయి
బీఆర్‌ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నెయ్యి అనె చందoలాగా ఉన్నాయని, గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి రూ.10,000 పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. తదనంతరం 350 కోట్లకి ఉతర్వూలు జారీచేసి పరిహారం అందించిన పాపాన పోలేదు అదే విధంగా అదే నెలలో మరియొక్క మారు 1,25,000 ఎకరాల పంట నష్టం సంభవించిన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100 కు 100 శాతం పంటలు నష్టపోయి ఇసుక మేటలు వేసిన సందర్భములో అప్పటి ప్రభుత్వంలోని నాయకులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, రుణ మాఫీ అమలు చేస్తామని గొప్పగా చెప్పుకున్న B.R.S నాయకులు మొదటి విడత మాఫీని నాలుగు విడతలగా ఇవ్వడంతో ఆ మొత్తం అసలుకు బదులు వడ్డీ జమైన సందర్భము ప్రతి ఒక్క రైతుకి అనుభవమేనన్నారు.
హస్తం గూటికి చేరిన బీఎస్పీ సస్పెండ్ ఎంపీ
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఐదు రోజుల క్రితం డానిష్ అలీ కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఆరోజు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. మొత్తానికి బుధవారం ఆయన హస్తం గూటికి చేరారు. ఢిల్లీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ కేటాయించింది.
జగన్ను మరో రెండుసార్లు గెలిపించుకోవాలి..
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. పేద వర్గాల కోసం చిత్త శుద్ధితో జగన్ పరిపాలన చేస్తున్నారు.. ఏపీలో జగన్ రాజ్యసభ సీట్లు కూడా బీసీలకు ఇచ్చారు.. జగన్ ధైర్యం వల్లే ఇది సాధ్యమని పక్క రాష్ట్రాల నేతలు అంటున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్లో మెజార్టీ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినఘనత జగన్ దే అని తెలిపారు. జగన్ ను మరో రెండు సార్లు గెలిపించుకోవాల్సి ఉంది.. జగన్ ఓ సంఘ సంస్కర్త అంటూ ఎంపీ ఆర్. కృష్ణయ్య కొనియాడారు.
ఏపీలో పలు చోట్ల టీడీపీ- వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. పోలీసులు అలర్ట్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో టీడీపీ- వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.. అయినా, పలు చోట్ల ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి.
తాజాగా, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడుకి సంబంధించిన కేవీఆర్ సూపర్ మార్ట్ లో భారీ మొత్తంలో చీరలు ఉన్నాయని ఎన్నికల అధికారికి టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. కేవీఆర్ సూపర్ మార్కెట్లో అధికారులు తనిఖీ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక, మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించని వైసీపీ కీలక నాయకుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాని మోడీ భూటాన్ దేశ పర్యటన వాయిదా..
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది. అయితే, భూటాన్ లోని పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో పర్యటన వాయిదా పడినట్లు అధికార ప్రకటన తెలిపింది. ‘‘పారో విమానాశ్రయంపై కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, 2024 మార్చి 21-22 తేదీల్లో భూటాన్‌లో ప్రధాని పర్యటనను వాయిదా వేయాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. కొత్త తేదీలను దౌత్య మార్గాల ద్వారా ఇరుపక్షాలు రూపొందిస్తున్నాయి.’’ అని ప్రకటన పేర్కొంది.