భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్..
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మందికి పైగా సిబ్బంది విమాన ప్రమాద స్థలంలో పౌరవిమానయాన శాఖ బృందాల్లో చేరారు. DFDR (డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్) దొరకడంతో దీనిని విశ్లేషణ కోసం పంపించనున్నారు.
ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైద్య విద్యార్థి..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ విమానం దగ్గర్లోని బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలోని 241 ప్రయాణికులే కాకుండా.. హాస్టల్‌లో ఉన్న 24 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. ఈ ప్రమాదం నుంచి ఓ వైద్య విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్నాడు. తాజాగా తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన డాక్టర్ అరుణ్ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవాలను పంచుకున్నారు. తాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడించారు.
పరిస్థితి మరింత దిగజారుతుంది.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల గురించి తమకు ముందే సమాచారం ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీతో సహా అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. ఇరాన్ తిరిగి చర్చల టేబుల్‌పైకి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇక పై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అమలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఈ సందర్బంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ.. తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశాం.. అర్హులు ఎంత మంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లయింట్ ద్వారా దానిని పరిష్కరిస్తామన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులతో సహా) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణలో 28 బార్లకు లాటరీ ప్రక్రియ పూర్తి.. జీహెచ్ఎంసీ పరిధిలో అధిక స్పందన
తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఈరోజు ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఈ లాటరీ ప్రక్రియ శుక్రవారం నార్సింగ్‌లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ నేతృత్వంలో నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148 దరఖాస్తులు అందాయి. మొత్తం 28 బార్లకు 3,668 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు..
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 241 మంది మృతిచెందగా ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి సిద్ధమా..? కేటీఆర్ సవాల్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏసీబీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఆయన, సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, పాలన చేయడం చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక్కో రోజు ఒక్కో డ్రామా వేస్తున్నాడు. ఈ చిల్లర కుట్రలతో మమ్మల్ని ఆపలేరు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం,” అని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ సంబంధిత సంస్థ అకౌంట్‌లోనే ఉన్నాయని, అయినప్పటికీ వాటిని వెనక్కి రప్పించలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరలా ఏసీబీ నోటీసులు పంపిందని ఎద్దేవా చేశారు.
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు.