భారత్ జీ20 ప్రెసిడెన్సీ ప్రపంచానికి మార్గాన్ని నిర్దేశించింది..
భారత జీ20 అధ్యక్షత గురించి ప్రశంసలు కురిపించారు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా. భారత్ తన జీ20 ప్రెసిడెన్సీలో ప్రపంచానికి ఒక మార్గాన్ని నిర్దేశించిందని, జీ20 డిక్లరేషన్‌ను అన్ని జీ20 దేశాలు ఏకాభిప్రాయంగా ఆమోదించాయని ప్రశంసించారు. సవాళ్లు ఎల్లప్పుడూ ఉంటాయని, అయితే ఏకాభిప్రాయం సాధించడం ద్వారా భారతదేశం మార్గాన్ని చూపిందని ఉద్ఘాటించారు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కలికిన దేశాలు ఒక దగ్గరకు చేరిన సమయంలో.. జీ20 డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందినందుకు అభినందిస్తున్నానని ఆయన అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయగలరా అని వ్యాఖ్యానించారు. అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుకాల ఎవరున్నారో చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని నారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు తనను బీజేపీ కాపాడుతుందని భ్రమల్లో వున్నారని.. ఇప్పటి రాజకీయాలు ఏంటో తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ సాయం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సాధ్యం కాదన్నారు. బీజేపీని, వైసీపీని దూరంగా పెడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదు అని నారాయణ స్పష్టం చేశారు.
“ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..
చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.
ఆసియా నుంచి యూరప్ వరకు మౌళిక సదుపాయాలను విస్తరించిే ఈ అంతర్జాతీయ ప్రాజెక్టుపై ఇజ్రాయిల్ దృష్టి సారించిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహూ ఓ వీడియో సందేశంలో తెలిపారు. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయిల్ ముఖచిత్రాన్ని ఈ ప్రాజెక్టు మారుస్తుందని అన్నారు. భారతదేశం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు అరబ్, గల్ఫ్ దేశాలను, యూరోపియన్ దేశాలతో కలుపుతుందని నెతన్యాహూ అన్నారు. ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన యూఎస్ఏకి నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ ఒక బొమ్మరిల్లులా అయింది
పెద్దపెళ్లి జిల్లా ధర్మారం మండలం తండాబి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ చేరికలు కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఒక బొమ్మరిల్లు లా అయిందని ఆయన వ్యాఖ్యానించారు.గత కాంగ్రెస్ హయాంలో కరెంటు,వ్యవసాయం, పిల్లలకు చదువులు లేవని, ఎండిపోయిన తెలంగాణ ను పచ్చగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. మూడు గంటల కరెంటు ఇచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల లేదా బి అర్ ఎస్ పార్టీకి వేయాల ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కొప్పుల ఈశ్వర్. మంచి ప్రభుత్వం ఉండే పార్టీలో చేరాలని, సాయంత్రం కు వచ్చే వారి మాటలు విని మోసపోవద్దన్నారు కొప్పుల ఈశ్వర్. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మల్లి గెలిపించి మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు కొప్పుల ఈశ్వర్.
ప్రకాష్ రాజ్ నిరసన సెగ.. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలే కారణం..
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా పలు హిందూ సంఘాలు కలబురిగిలో ఆదివారం నిరసన చేపట్టాయి. నల్ల బట్టలు ధరించి ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాను ఎగరేశారు. అంతకుముందు రోజు హిందూ సంస్థ సభ్యులు కలబురిగి జిల్లా కలెక్టర్ కి ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించారు. అతడిని నగరంలోకి రాకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. కలబురిగిలో ఓ డిబేట్ లో పాల్గొనడానికి ప్రకాష్ రాజ్ వెళ్లే ముందే వ్యతిరేకత ఎదురైంది. ప్రకాష్ రాజ్ కి హిందూ సంస్థల నుంచి వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో కూడా ఇలాంటి నిరసనలే ఎదురయ్యాయి. కొన్ని వారాల క్రితం శివమొగ్గ నగరంలో ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత గోమూత్రం చల్లి ప్రక్షాళన చేశారు.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. న్యాయమూర్తి బెంచ్ మీదికి వచ్చిన తర్వాత కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించారు. 30 మంది మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఆ తర్వాత తీర్పును చదివారు. సిఐడి తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఈనెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చంద్రబాబును కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఆయనను తరలించే ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సెంట్రల్ జైలు వద్ద సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా రాజమండ్రిలో 36 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
పవన్ కళ్యాణ్ నా పోస్టర్ ను కాపీ కొట్టాడు…
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్రపట్టదు. ఇక ఈ మధ్య పాలిటిక్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న వర్మ .. జగన్ కు మద్దతు ఇస్తూ.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఏకిపారేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే వ్యూహం అనే సినిమా తీస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జగన్ జైలుకు వెళ్లడం దగ్గరనుంచి ఆయన పాదయాత్ర.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు.. అన్ని చుపించానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ లో కూడా జగన్ కోణంలోనే చూపించినట్లు తెలుస్తోంది.
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో డ్రోన్ దాడి.. 40 మంది మృతి
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆదివారం రాజధాని ఖార్టూమ్‌లోని మార్కెట్‌లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారందరినీ సూడాన్‌లోని బషీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆదివారం నాటి డ్రోన్ దాడి వెనుక ఏ గ్రూపు హస్తం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్ 15న సూడాన్‌లో ప్రారంభమైన అంతర్యుద్ధం తర్వాత పౌరుల మరణాల సంఖ్య ఇదే అత్యధికం. ప్రస్తుతం నివాస ప్రాంతాలపై దాడి పరిధి పెరుగుతోంది. ఇక్కడ అధికారం కోసం సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఏప్రిల్ నుంచి పోరాటం సాగుతోంది.
భారత్ ఐదో “సూపర్ పవర్”..
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఈ రోజు ముగిశాయి. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి పలువురు దేశాధినేతుల, ఇతర సంస్థల అధికారులు న్యూఢిల్లీకి వచ్చారు. భారత్ వారందరూ ఫిదా అయ్యేలా ఆతిథ్యం ఇచ్చింది.
దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదు
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.. చంద్రబాబు పద్నాలుగేళ్ల పరిపాలనలో ఒక దృఢమైన అభిప్రాయానికి వచ్చాడని తెలిపారు. ఎన్ని అన్యాయాలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని భావించాడని పేర్కొన్నారు. ఏ కేసయినా స్టేలతో తెచ్చుకోవచ్చని చంద్రబాబు ఆలోచన.. కుట్రలతో, కుతంత్రాలతో బయటపడటం చంద్రబాబు నైజమని విమర్శించారు. చట్టానికి లోబడి ఎవరైనా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని కోర్టు తీర్పు ద్వారా నిరూపితం అయ్యిందని విజయసాయి రెడ్డి అన్నారు.
మళ్లీ వర్షం.. మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ జట్టులో కీలకమైన బౌలర్లను రంగంలోకి దించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. షమీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడుతున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరుజట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.