తండేల్ పైరసీ.. అరెస్ట్ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక
నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తండేల్’. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టడమే కాదు ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక యాంటీ పైరసీ సెల్ కారణంగా కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ జరగడం లేదు. రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి జడలు విప్పుకుంటోంది . దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించారు.
గత ప్రభుత్వ అక్రమాల విచారణకు బ్యాంకులు సహకరించాలి..
ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. ఆహార అలవాట్లు మారాయి.. అగ్రికల్చర్ స్థానంలో హార్టికర్చల్ వచ్చేస్తోంది అని పేర్కొన్నారు. హార్టికల్చర్ సాగుకు, ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలి అని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదు.. దీని కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్ఎఈలకు రుణాలను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది.. దానికి బ్యాంకులు సహకరించాలి అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి.. స్పందించిన కిషన్ రెడ్డి
చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి.. జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని ఆయన కొనియాడారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
సన్యాసిగా మారిన మాజీ నటి మమతా కులకర్ణి సంచలన నిర్ణయం..
బాలీవుడ్ ఒకప్పటి అందాల నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారి వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆమె సన్యాసిగా మారారు. అయితే, ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
రాజకీయ లబ్ది కోసమే లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు..
టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు.. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని పేర్కొన్నారు. ఆవు నెయ్యి సరఫరాలో కూడా శాంపిల్ టెస్ట్ లు ఉంటాయి.. శాంపిల్ లో క్వాలిటీ లేకపోతే ఏ నెయ్యినీ తిరుమల కొండ పైకి అనుమతించరు.. గత ప్రభుత్వాలలో నాణ్యతా లేని అనేక సందర్భాలలో నెయ్యి వెనక్కి పంపారు.. వనస్పతి కలిసిందని అధికారులు చెప్తుంటే.. రాజకీయ లబ్ధి పొందాలని.. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారు.. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
రామరాజ్యం ఆర్మీ వీర రాఘవరెడ్డి అరెస్టు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు ఆయనపై దాడి చేయడంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీర రాఘవ రెడ్డి, రామరాజ్యం అనే ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రామరాజ్యం స్థాపన కావాలని ప్రచారం చేస్తున్న అతడు, పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వచ్చాడు. అతని ఆర్మీలో చేరాలంటే, 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం, 2 కిలోమీటర్లు పరిగెత్తగల సామర్థ్యం ఉండాలి, అలాగే వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. సభ్యులకు నెలకు రూ. 20,000 జీతం అందిస్తానని అతను చెప్పి యువతను ఆకర్షిస్తున్నాడు.
కేంద్ర జలశక్తి మంత్రికి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి లేఖ..
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి లేఖ రాశారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఎర్ర కాలువ పునరుద్ధరణకు 268.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నల్లజెర్ల, దేవరపల్లి మధ్య 6 కిలోమీటర్ల నిడివిలో కుడి, ఎడమ గట్టుల శాశ్వత పునరుద్ధరణకు రూ. 72 కోట్లు ఇవ్వాలన్నారు. దేవర పల్లి, నిడదవోలు మధ్య 6వ కిలోమీటరు నుంచి 33. 390 కిలోమీటరు వరకూ ఎడమ గట్టు శాశ్వత పునరుద్ధరణకు రూ. 114 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, తాడేపల్లి గూడెం మండలం వైపు 6వ కిలోమీటరు నుంచి 33.390 కిలోమీటరు వరకూ కుడి గట్టు శాశ్వత పునరుద్ధరణకు రూ. 82.5 కోట్లు.. ఇటీవల వరదల్లో పరిమితికి మించి పొంగడంతో జరిగిన డ్యామేజీ అని పురంధేశ్వరి వెల్లడించారు.
అర్చకులు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. అండగా ఉంటామని హామీ
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం ఆయన చేస్తామని అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం అన్నారు, నిందితుల పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలసి రంగరాజన్ ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడించడం జరిగింది. యాదయ్య మాట్లాడుతూ.. రంగరాజన్ పై దాడి చేయడం అప్రజాస్వామికం ఇటువంటి దాడులు మంచివి కావు, పోలీస్ వారు వారిపై చర్యలు తీసుకునేలా చూస్తాం అన్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతాం..
శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్ గేట్లు ఉచితం చేస్తాం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగమ శాస్త్రాలకు పండితుల సలహాతో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం.. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు మంచి నీరు, ఆహారం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీశాఖ నిబంధనలతో ఉన్న త్రాగు నీటి ప్లాస్టిక్ బాటిళ్లను సమీకరించి తీసి వేయాలని సూచించామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నాం.. ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ఏర్పాటు సీసీ కెమెరాలతో భక్తులకు సత్రాలకు వెళ్లేందుకు మినీ వ్యాన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
రైతన్నలకు అలర్ట్.. 1834 కోట్ల నిధులు రైతుల ఖాతాలోకి.. ఎన్ని ఎకరాల వరకు అంటే..?
రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. గత నెల 27న 4,41,911 రైతుల 9,48,332.35 ఎకరాలకు రూ.5,68,99,97,265 నిధులు జమ చేయగా.. ఈనెల 5వ తేదీన 17,03,419 రైతులకు చెందిన 9,29,234.20 ఎకరాలకు రూ. 5,57,54,07,019 నిధులు విడుదల చేశారు. అయితే.. ఈ రోజు 8,65,999 మంది రైతులకు చెందిన 11,79,247.17 ఎకరాలకు రూ. 7,07,54,84,664 లకు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు మొత్తంగా 30,11,329 రైతులకు చెందిన 30,56,814.32 ఎకరాలకు రూ. 18,34,08,88,948 లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసినట్లు పేర్కొంది.