వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరతగతిన పూర్తి చేస్తాం..
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. జిల్లాకు తలమాణికమైన వెలుగొండ ప్రాజెక్ట్ త్వరతగతిన పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో రాజకీయాలకు తావు ఇవ్వలేదన్నారు.
3 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ..
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత, ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. సోమవారం గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై జార్ఖండ్‌లోని అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే.. ఈ ప్రధాని ప్రసంగంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, కాపీయింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవడం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాల గురించి ప్రధాని నేరుగా మాట్లాడటం చాలా అరుదు.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. నూతన క్రీడా పాలసీకి ఆమోదం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన క్రీడా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన పాలసీ కావాలన్నారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేశామన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. ఇందులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారి..
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ ను ప్రత్యేక అధికారి గా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.
భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది. ఈ కేసుకు సంబంధించి లోకాయుక్త పోలీసులు ఇప్పటికే ముఖ్యమంత్రి భార్య పార్వతి బీఎంను ప్రశ్నించారు.
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త బుధవారం విచారణకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి లోకాయుక్త పోలీసులు ఇప్పటికే ముఖ్యమంత్రి భార్య పార్వతి బీఎంను ప్రశ్నించారు. లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్‌కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది. నగరానికి సమీపంలోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమికి పరిహారంగా పార్వతికి 14 విలువైన ప్లాట్లను కేటాయించడంపై కేసు ముడిపడి ఉంది.
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మంత్రి సీతక్క భేటీ
సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకుంటున్నారు. గతంతో పోలిస్తే నాణ్యమైన చీరలు ఇవ్వాలని మంత్రికి అంగన్వాడి టీచర్లు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే.. పలు రకాల డిజైన్ చీరలను చూయించి నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని అంగన్వాడి టీచర్లను సీతక్క కోరారు. డిజైన్, రంగుల్లో మార్పులు చేయాలని అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు సూచించినట్లు తెలుస్తోంది. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి త్వరలో చీరలు పంపిణీ చేస్తామని సీతక్క చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అమ్మలాగా చిన్నారుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్న అంగన్వాడి టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే చీరలు ఇవ్వాలని నిర్ణయించామని, మంచి నాణ్యమైన చీరలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు.
తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది, కానీ మనం ఓపికగా ఉండాలి…
మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమేళనం నిర్వహించిన నామిడ్ల శ్రీను, వారి బృందానికి నా ధన్యవాదములు తెలిపారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్ట్ తీర్పు లోబడే నేను మాట్లాడుతానని, షెడ్యూల్ కుల వర్గీకరణను నేను మనసా.. వచా కట్టు పడి వుంటానన్నారు. ధండోరా ఉద్యమానికి నేను అన్ని సందర్భాలలో ముందు ఉండి నడిపిచానని, ఉద్యమానికి ప్రధాన కారణం మంద కృష్ణ మాదిగ అని నేను ఒప్పుకుంటున్న, ఐనవాళ్లే ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు కడియం శ్రీహరి. తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది,కానీ మనం ఓపిక గా ఉండాలని, సుప్రీం కోర్టులో ఆరుగురు జడ్జిలు ఈ వర్గీకరణ కు మద్దతు ఇచ్చారు, ఒక్క జడ్జి మాత్రమే మద్దతు ఇవ్వలేదన్నారు కడియం శ్రీహరి.
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ , శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 11 తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్‌లో రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలి..
బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లను కోరారు. జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. మిల్లర్లపై మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని మంత్రుల సమావేశంలో చర్చించామన్నారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకు వచ్చే విధంగా అందరం కలిసి లోతుగా అధ్యయనం చేద్దామని వెల్లడించారు. 1550 రైస్ మిల్స్ నేడు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయన్నారు. కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉన్న రైస్ మిల్లర్లను కలుపుకుని వెళ్లాలని సూచించారు. 19వేల 800కోట్లు టర్నోవర్ ఉన్న పౌరసరఫరాలశాఖలో 41వేల 150కోట్లు బకాయిలు చేసి గత ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. రుణాలు తీసుకుని రైతులకు కూడా చెల్లించకుండా వెళ్లిపోయారని విమర్శించారు. సీఎం చంద్రబాబుతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రైతుల బకాయిలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వారి సహకారంతో రూ.1674కోట్ల బకాయిలు రైతులకు నెల రోజుల్లో చెల్లించామన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే లోపే రూ.283 కోట్లు బకాయిలు చెల్లించాం.. మరో వారం రోజుల్లో 200కోట్లు చెల్లిస్తామన్నారు. కష్టపడి పండించిన ధాన్యం వారికి నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్చ రైతులకు కల్పించామన్నారు.
ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాల పై దృష్టి సారించాలి
ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. జాయింట్ వెంచర్స్‌లో విలువైన ఆస్తులు ఉన్నాయి.. ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్, హౌసింగ్, లా సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ సమావేశమై వారంలోగా సమస్యకు పరిష్కారం అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల స్థితిగతులను సబ్ కమిటీ సమీక్షించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించాలని పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.