మా లక్ష్యం వికసిత్ భారత్.. అందుకే ప్రజలు మూడోసారి ఆశీర్వదించారు
ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ కాబట్టే.. మూడోసారి దేశ ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.
క్యాన్సర్‌తో చాలా మంది చనిపోతున్నారు.. సరైన అవగాహన కల్పించాలి!
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాప్తి పెను సవాల్ గా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 17.5 శాతం కాన్సర్ కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. 9 శాతం మరణాలు క్యాన్సర్ వాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రజలకు సరైన అవగాహన లోపం, సరైనా టైంలో చికిత్స లేకపోవడంతో మరణాలు కొనసాగుతున్నాయి.. క్యాన్సర్ రోగానికి చికిత్స పోందితే నయం అవుతాయి.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ బాధితులను అదుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
కుంభమేళాకి భూటాన్ రాజు… సంగమంలో పుణ్యస్నానం..
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి భూటాన్ రాజు వచ్చారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఆయన త్రివేణి సంగమంతో పవిత్ర స్నానం చేశారు. దీనికి ముందు రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ సూర్యుడికి ‘‘అర్ఘ్యం’’ సమర్పించారు. విమానాశ్రయానికి వచ్చిన రాజు భూటాన్ సంప్రదాయ దుస్తుల్ని ధరించారు. పవిత్ర స్నానం చేస్తున్న సమయంలో కాషాయ దుస్తుల్లో ఉన్నారు. వాంగ్‌చుక్, సీఎం ఆదిత్యనాథ్‌లతో పాటు ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, విష్ణుస్వామి శాఖ నాయకుడు జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్ (సతువా బాబా) కూడా ఉన్నారు.
నాకోసం ఎవరూ పాదయాత్ర చేయొద్దు.. నేనే మీ అందరినీ కలుస్తా!
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
దళితుల అభ్యున్నతికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మద్ధతు ఇచ్చిందని, దళితులకు ఉన్నత పదవులు , అవకాశాలను కల్పించేందుకు ఎప్పటికీ పాటుపడిందని చెప్పారు. ముందుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీకి ప్రవేశ పెట్టారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజే.. నేను సభలో ప్రకటన చేశా అని ఆయన వ్యాఖ్యానించారు.
2014లో కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టారు.. ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను మేము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారని, 2014 నవంబర్ 29న కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టారని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ను స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా.. బీసీలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్‌కి అలర్ట్..
భారత్‌కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ నౌకల గమనాన్ని పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. తాజాగా చైనా నౌకల్ని మాల్దీవులు అనుమతించడం భారత్‌ని ఆందోళనపరుస్తోంది. ఈ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లు, రిమోట్ ఆపరేటేడ్ వెహికల్స్ (ROVలు) ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది సముద్రగర్భాన్ని మ్యాప్ చేయడంతో పాటు కీలక సైనిక సమాచారాన్ని సంపాదించగలదు.
కుంభమేళాలో 2000 మంది మరణించారు.. ఉద్ధవ్ ఎంపీ సంచలన ఆరోపణ..
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మొత్తం 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఇప్పుడు దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు మృతుల సంఖ్యని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ సహా ఇతర ప్రతిపక్షాలు యోగి సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సంఘటనపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 2000 మంది మరణించారని మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొక్కిసలాట మృతుల అధికారిక సంఖ్యను ఆయన ప్రశ్నించారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన నారా లోకేష్
ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైష్ణవ్ ను శాలువతో సత్కరించారు లోకేశ్. ఇక, ఏపీ మంత్రి వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్ తో పాటు టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఇక, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలను మంత్రి లోకేశ్ అభినందించారు. సమష్టి కృషితోనే ఏపీకి మేలని, కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడుకోగలిగాం అని కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో.. ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగించాలని సూచించారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలతో నారా లోకేశ్ కాసేపు మాట్లాడారు.
అధిక వడ్డీల పేరుతో భారీ మోసం..
నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారంను స్టార్ట్ చేశాడు. అయితే.. 2020-2023 వరకు పెట్టుబడి పెట్టిన వారికి ఒక లక్షకు 50 వేలు అధిక వడ్డీ చెల్లించిన ముజమ్మిల్.. 2023 ఆగస్టు నుండి పరారీలో ఉన్నాడు. అయితే.. అధిక వడ్డీ ఇస్తానంటూ కల్వకుర్తి పరిసర ప్రాంతాల ప్రజల వద్ద రూ.90 కోట్లు తీసుకుని 50 కోట్లు తిరిగి ఇచ్చాడు. మిగతా 40 కోట్లుతో ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాడు. ఇటీవల తనను కొందరు వ్యక్తులు ట్రేడింగ్ పేరుతో మోసం చేసినట్లు ముజమ్మిల్ వీడియో విడుదల చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ముజమ్మిల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు..