*నేటి నుంచి సామాన్యులకు బాలరాముడి దర్శనం..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి సమయాల వివరాలను వారి వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని ప్రకటించారు. ఉదయం 6.30కి జాగరణ హారతికి ఒక రోజు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. రాత్రి 7.30 గంటల సంధ్యా హారతికి అదే రోజు బుకింగ్చేసుకున్నా సరిపోతుందని తెలిపింది. శ్రీరాముని దర్శనం కావాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచిత పాస్ ఇస్తారు. బాలరాముని దర్శనం, హారతి పాస్‌ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీరు మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసి, OTPని నమోదు చేసి ధృవీకరించినట్లయితే, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లాగిన్ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్’ విభాగంలోకి వెళ్లి గుర్తింపు వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత హారతి/దర్శన సమయ స్లాట్‌లను ఎంచుకుని.. పాస్ కోసం బుక్ చేసుకోండి. అయోధ్య రామమందిరానికి చేరుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, వారణాసి, కోల్‌కతా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్కడి నుంచి అయోధ్య రామమందిరానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయోధ్య మహర్షి వాల్మీకి విమానాశ్రయం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.
*ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో దిగిన 100చార్టర్డ్ విమానాలు
అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. సోమవారం కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో దాదాపు 100 చార్టర్డ్ విమానాలు లాండ్ అయ్యాయి. ఈవెంట్ కోసం ఆహ్వానితుల జాబితాలో 7,000 కంటే ఎక్కువ మంది అతిథులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అయోధ్యలోని మహా దేవాలయంలో రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వివిధ రంగాలకు చెందిన వందలాది మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ BAOA ప్రెసిడెంట్, కెప్టెన్ ఆర్కే బాలి మాట్లాడుతూ.. సోమవారం అయోధ్యకు వెళ్లడానికి సుమారు 100 చార్టర్డ్ విమానాలు బుక్ చేయబడ్డాయి. వీటిలో దాదాపు 50 విమానాలు బిజినెస్ క్లాస్ విమానాలు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో శంకుస్థాపన జరిగిన రోజు దాదాపు 100 విమానాలు నడిచాయని ప్రైవేట్ ఎయిర్ ఆపరేటర్ కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు, ఒక సీనియర్ విమానాశ్రయ అధికారి మాట్లాడుతూ.. గ్రాండ్‌మ్ టెంపుల్ పవిత్రోత్సవానికి హాజరయ్యేందుకు వందలాది మంది ప్రత్యేక అతిథుల రాకతో, ల్యాండింగ్, డిపార్చర్ విమానాల సంఖ్య దాదాపు 100కి చేరుకోవచ్చని అంచనా. ఆదివారం కూడా కార్పొరేట్ దిగ్గజాలు, ప్రత్యేక అతిథులు సహా పలువురు అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం దాదాపు 90 విమానాలు నడిచాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోహన్ భగవత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనుపమ్ ఖేర్, కైలాష్ ఖేర్, జుబిన్ నౌటియల్, ప్రసూన్ జోషి, సచిన్ టెండూల్కర్ మరియు అనిల్ అంబానీ ఉదయం విమానాల్లో చేరుకున్నారు. వీరితో పాటు హేమమాలిని, కంగనా రనౌత్, శ్రీశ్రీ రవిశంకర్, మొరారీ బాపు, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మధుర్ భండార్కర్, సుభాష్ ఘాయ్, షెఫాలీ షా, సోనూ నిగమ్ ఆదివారం నాడు అయోధ్య చేరుకున్నారు. రాంలాలా సింహాసనం పొందిన తరువాత, భక్తులు ఆయన దర్శనం కోసం అర్థరాత్రి వరకు బిజీగా ఉన్నారని మీకు తెలియజేద్దాం. ఉదయం నుంచే భక్తులు హారతిలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నారు.
*చర్చలు సఫలం.. నేటి నుంచి విధుల్లోకి అంగన్‌వాడీలు
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు. జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు కోరినట్లు, రాతపూర్వకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వ హామీతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ఇవాళ ఆఖరిగా అంగన్వాడీలతో చర్చించామని.. 11 డిమాండ్లు కూడా అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. జీతాల అంశంపై జులై నెలలో పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రమోషన్ వయోపరిమితి 50 సంవత్సరాలు చేస్తామని, ప్రైమ్ ఏరియా, ట్రైబల్ ఏరియాలుగా విభజిస్తామన్నారు. మట్టి ఖర్చులకు 20 వేలు ఇవ్వడానికి అంగీకరించామని.. సమ్మె కాలంలో జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎంతో చర్చించి సమ్మె కాలంలో పెట్టిన కేసులు మాఫీ చేస్తామన్నారు. పని చేసే సమయంలో యాప్‌ల వంటి సమస్యలపై స్పెషల్ సీఎస్‌తో గైడ్ లైన్స్ తయారు చేయాలని చెప్పామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని.. ఏ ఒక్కరి మీదా కక్ష సాధింపు చర్య లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ఒంటెద్దు పోకడ కాదు కనుక అందరితో చర్చించామన్నారు. చర్చలను మేం అంగీకరించామని, సమ్మెను విరమించినట్లు అంగన్‌వాడీ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. జీతాలు పెంపుపై నిర్దిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తాం అన్నారని ఏపీ అంగన్వాడీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వెల్లడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌ను పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. అంగన్‌వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్‌వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పిందన్నారు. టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని.. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తామని వెల్లడించారు. సమ్మె కాలానికి జీతం ఇస్తాం అని, కేసులు ఎత్తేస్తాం అని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మూడు రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తాం అన్నారని ఏపీ అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు బేబీ రాణి తెలిపారు. కమిటీ వివరాలు మాకు అందిస్తాం అన్నారని వెల్లడించారు.
*డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆసరా పథకం నిధుల విడుదలకు సమయం ఖరారైంది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్ సర్కారు.. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ పర్యటన కోసం.. నేడు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్ జగన్.
*శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేడు టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. రేపు ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలలోని 09 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,568 మంది భక్తులు దర్శించుకున్నారు. 22084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.58 కోట్లు వచ్చింది.
*ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో భూకంపం.. చైనాలో భూకంప కేంద్రం
దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాల్లో సోమవారం (జనవరి 22) రాత్రి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సంభవించిన భూకంపంతో చాలా మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. భూకంప కేంద్రం చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్‌లో ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. రాత్రి 11.39 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో ఉంది. అంతకుముందు ఆదివారం (జనవరి 21) తెల్లవారుజామున 3:39 గంటలకు సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. వీరి కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. గత కొన్ని నెలల్లో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో చాలాసార్లు భూకంపం సంభవించింది. గత ఆరు నెలలుగా ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఆగస్టు 5, అక్టోబర్ 15, అక్టోబర్ 3, నవంబర్ 3, నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో భూకంపం సంభవించింది. నవంబర్ 3న నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.
మీరు భూకంప ప్రకంపనలను అనుభవిస్తే ప్రశాంతంగా ఉండండి. ఒక టేబుల్ కిందకు వచ్చి, ఒక చేత్తో మీ తలను కప్పి, మరొక చేత్తో టేబుల్‌ని పట్టుకోండి. వణుకు ఆగిన వెంటనే బయటకు వెళ్లండి. లిఫ్ట్ ఉపయోగించవద్దు. మీరు బయటకు వచ్చినప్పుడు, భవనాలు, చెట్లు, గోడలు, స్తంభాలకు దూరంగా ఉండండి. మీరు భూకంపం సమయంలో వాహనంలో ఉన్నట్లయితే, దానిని బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసి లోపల ఉండండి. వంతెనలపై నడవడం మానుకోండి. దెబ్బతిన్న భవనాల్లోకి ప్రవేశించడం మానుకోండి. శిథిలాలలో చిక్కుకున్నట్లయితే అగ్గిపెట్టెను వెలిగించవద్దు. మీ నోటిని గుడ్డతో కప్పుకోండి, పైపులు, గోడలపై నొక్కండి. వీలైతే ఈలలు వేయండి. సహాయం కోసం బిగ్గరగా అరవండి.
*మయన్మార్ సైనికులను తిరిగి పంపిన ఇండియన్ ఆర్మీ..
మయన్మార్ నుంచి భారత్‌కు వచ్చిన 276 మంది సైనికుల్లో 184 మందిని సోమవారం తిరిగి తమ దేశానికి ఇండియన్ ఆర్మీ పంపించింది. ఈ మయన్మార్ సైనికులు గత వారం జాతి తిరుగుబాటు బృందంతో కాల్పులు జరిపిన తర్వాత మిజోరంకు వచ్చారు. 184 మంది మయన్మార్ సైనికులను రెండు విమానాల్లో తిరిగి సిట్వే (అక్యాబ్)కి తరలించారు. మయన్మార్ దళాలు బయలుదేరే ముందు భారత అధికారులు అవసరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన 92 మంది మయన్మార్ సైనికులను ఇవాళ విమానంలో రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. పొరుగు దేశం నుంచి సైన్యాన్ని వెనక్కి పంపేలా చూడాలని మిజోరం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. గత వారం 17న దేశంలోని రఖైన్ రాష్ట్రంలోని వారి శిబిరాలపై జాతి సమూహాలు దాడి చేసి స్వాధీనం చేసుకున్న తర్వాత వందలాది మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరంలోని లాంగ్‌తలై జిల్లాలో ఆశ్రయం పొందారు. మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా కూడా గత వారం జనవరి 20న షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈ సమస్యను లేవనెత్తారు. మయన్మార్ దళాలను వెనక్కి పంపాలని కోరారు. మయన్మార్ సైన్యం ప్రజాస్వామ్య అనుకూల మిలీషియాల మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో మయన్మార్ ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతుందనే ఆందోళనతో ప్రజల స్వేచ్ఛా సంచారాన్ని నిరోధించేందుకు భారత్-మయన్మార్ సరిహద్దు పొడవునా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. మయన్మార్‌తో స్వేచ్ఛా ఉద్యమ పాలన (ఎఫ్‌ఎంఆర్) ఒప్పందాన్ని ప్రభుత్వం పునరాలోచిస్తుంది. ఈ ఉద్యమానికి ముగింపు పలకబోతోందని జనవరి 20న అమిత్ షా చెప్పారు. భారతదేశం- మయన్మార్ మధ్య 1,643 కి.మీ పొడవైన కంచె లేని సరిహద్దు ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 635 మంది మయన్మార్ సైనికులు తమ దేశం విడిచి మిజోరంలోకి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు. అస్సాం రైఫిల్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 359 మంది సైనికులను తిరిగి మయన్మార్ పంపించినట్లు సమాచారం.
కెనడా వెళ్లే విద్యార్థులకు షాక్..
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వచ్చే రెండేళ్ల పాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించడంతో పాటు వీసా జారీపై పరిమితిని విధించింది. కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ఒట్టావాలో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కెనడాలో వేగంగా పెరుగుతున్న గృహ సంక్షోభంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విద్యార్థి వీసా కోతలు విధిస్తుంది. ఇక, ఈ సంవత్సరం కెనడాకు కొత్త స్టడీ వీసాలలో మొత్తం 35శాతం తగ్గించింది. అంటారియో వంటి నిర్దిష్ట ప్రావిన్సులు 50శాతం వరకు మరింత కోతలు విధించాయి. అయితే, మెడిసిన్, లా వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లతో పాటు మాస్టర్స్- డాక్టరల్ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థుల జీవిత భాగస్వాములకు రాబోయే వారాల్లో ఓపెన్ వర్క్ పర్మిట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ ప్రకటనతో కెనడాకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను నిరాశపరిచింది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు పంజాబ్- గుజరాత్‌ల నుంచి వెళ్లారు. ప్రస్తుతం కెనడాలో దాదాపు మూడున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇక, కెనడాలో భారత్‌తో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మిలియన్ దాటింది. కోవిడ్-19 తర్వాత కెనడా 2023లో రికార్డు స్థాయిలో 5.80 లక్షల స్టడీ వీసాలను జారీ చేసింది. ఇక, కెనడాలో గృహ సంక్షోభం కారణంగా లిబరల్ పార్టీ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విమర్శలకు గురవుతోంది. కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.. దీని కారణంగా ఇంటి అద్దెలు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. తాత్కాలిక నివాసితులలో ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఇది కెనడాలో గృహ సరఫరాను దెబ్బతీసింది.
*పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,800కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 63,050కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తుంది.. కిలో పై రూ. 75,600 గా ఉంది.. ఈరోజు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి… ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,480గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,050గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది.. వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. కిలో వెండి ధర పై రూ.75,600కి చేరింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 75,600.. బెంగళూరులో రూ. 72,900గా ఉంది.. ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..