ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు
ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలిగాలులతో దృశ్యమానత తగ్గింది. ఈరోజు (జనవరి 4) ఉదయం రన్‌వేపై దృశ్యమానత సున్నాగా ఉండటంతో విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసినందున ఢిల్లీ ఎయిర్ పోర్టులో 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 30 విమానాలు రద్దు చేయబడ్డాయి.
విహారయాత్రలో విషాదం.. బీటెక్ విద్యార్ధి మృతి
అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ వద్ద విహార యాత్ర విషాదాంతమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు కలిసి గిరి, సాయి దత్త, మోహన్, కేదార్, మళ్లీ, దినేష్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో సాయి దత్తకి ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత కలగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో యువకులు దారి తప్పిపోయారు. ఈ క్రమంలో వారు శ్రీకాళహస్తిలోని తమ స్నేహితులకు ఫోన్ చేసి, తాము దారి తప్పిన విషయాన్ని తెలియజేశారు.
“గేమ్ ఛేంజర్” సెన్సేషన్.. థియేటర్లలో సోల్డ్ ఔట్ బోర్డ్స్
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరి కొన్ని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు.
హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు జనవరి 10వ తేదీన శిక్ష విధిస్తామని న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు. అయితే నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే ఛాన్స్ మాత్రం లేదని సమాచారం. శిక్ష విధించినా తన అధికారాన్ని, అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తించే విధంగానే ఉండబోతోందని చెప్పారు. అయితే, పోర్న్ స్టార్ కు హష్ మనీ ఇచ్చిన వ్యవహారంలో ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై నమోదైన అభియోగాలను కొట్టి వేసేందుకు న్యూయార్క్ కోర్టు తోసిపుచ్చింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ప్రెసిడెంట్స్ కు రక్షణ ఉంటుందని జడ్జి జువాన్ పేర్కొన్నారు. హష్ మనీ కేసు లాంటి వ్యవహారాల్లో ట్రంప్‌కు రక్షణ ఇవ్వలేమన్నారు. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలారు.. గత ఏడాది నవంబర్‌లో న్యాయస్థానం శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా.. అదే సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో అది వాయిదా పడింది.
రిటైర్‌మెంట్‌పై మౌనం వీడిన రోహిత్
సిడ్నీ టెస్ట్‌కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ‘రైతు భరోసా’ పథకం విధివిధానాలు ఖరారు చేయడం ఈ భేటీకి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రైతు భరోసాపై కొన్ని సిఫార్సులు రూపొందించింది. వీటిలో పంట వేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడం, అలాగే రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.
వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకగా దర్శనాలు జరుగుతుండడంతో.. భక్తులు వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
రాంపూర్ అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్లు…
గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ , కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ లు కలిసి పులి ఆనవాళ్ళ కొరకు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండంగా, రాంపూర్ అటవీ ప్రాంతంలోని మగ పులి ఆనవాళ్ళను మరోసారి కనుక్కోవడం జరిగింది.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ రోజుల్లో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా జరుగుతున్న నేపథ్యంలో “గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు కాబోతుండడంతో ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు రాజమండ్రికి చేరుకుంటున్నారు.