సీఎం గెలిచాడు.. ఈ మంత్రులు ఓడారు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలు మాత్రం ఆది నుంచి తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు.. ఖచ్చితంగా గెలుస్తాం.. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ మద్దతు కూడా అవసరం ఉండదనే చెప్పారు.. అలాంటి విక్టరీనే అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, కాంగ్రెస్ వేవ్‌లో మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు.. సీఎం బసవరాజ్ బొమ్మై సహా డజను మంది కేబినెట్ మంత్రులు గెలుపొందగా, పద కొండు మంది మంత్రులు కర్ణాటకలో ఓటమిని చవిచూశారు. ఈ ఓటమితో భారతీయ జనతా పార్టీ అది పరిపాలించిన ఏకైక దక్షిణాది రాష్ట్రాన్ని కోల్పోయినట్టు అయ్యింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సిహ్గావ్ నియోజకవర్గం నుండి 35000 ఓట్లకు పైగా మరియు 54.95 శాతం ఓట్లతో విజయం సాధించారు. తీర్థహళ్లి నుంచి అరగ జ్ఞానేంద్ర, గడగ్ నుంచి సీసీ పాటిల్, ఓవ్రాద్ నుంచి ప్రభు చౌహాన్, యశ్వంత్‌పూర్ నుంచి ఎస్టీ సోమశేఖర్, కేఆర్ పురం నుంచి బైరతి బసవరాజ్, మహాలక్ష్మి లేఅవుట్ నుంచి గోపాలయ్య, నిప్పాణి నుంచి శశికళ జొల్లె, సునీల్‌కుమార్‌లు తమ తమ స్థానాల్లో గెలుపొందారు. కర్కల, రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్న, ఎల్లాపూర్ నుంచి శివరామ్ హెబ్బార్. కాగా, గృహ నిర్మాణ శాఖ మంత్రి వి సోమన్న వరుణ, చామరాజనగర్ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన మంత్రుల్లో బళ్లారి నుంచి బీఎస్ శ్రీరాములు, చిక్కనాయకనహళ్లి నుంచి మధుస్వామి, ముధోల్ నుంచి గోవింద కరజోల్, చిక్కబళ్లాపూర్ నుంచి ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి కే సుధాకర్, హొస్కోటే నుంచి ఎంటీబీ నాగరాజ్, హిరేకెరూరు నుంచి బీసీ పాటిల్, బీళగి నుంచి మురుగేశ్ నిరాణి, కేసీ నారాయణగౌడ్. పీట్, తిపూర్ నుంచి బీసీ నగేష్, నవలగుంద నుంచి శంకర్ పాటిల్ ఓడిపోయారు..
చాలెంజ్ అంటే ఇదే.. భారీ మెజార్టీతో విక్టరీ కొట్టిన 92 ఏళ్ల కురువృద్ధుడు
సర్వే ఫలితాలను, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ.. ఎవ్వరూ ఊహించని రీతిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ ఏజ్‌లో నీకు టికెట్ ఎందుకు..? పోటీ నుంచి తప్పుకో అని ఎగతాలి చేసినవారికి సవాల్ చేసి మారీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 92 ఏళ్ల వ్యక్తి.. ఎవ్వరి ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని అందుకున్నారు.. అయనే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్.శివశంకరప్ప. ఆయనకు ఈ ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలే వచ్చాయి.. 92 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఎందుకు? ఎలా ఇస్తారు? ఆయనకు ఎవరైనా ఓటు వేస్తారా? ఆయన గెలిచి ఏం చేస్తారు? అని ఇంటా బయట నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. కానీ, మరోసారి విక్టరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు శివశంకరప్ప.. నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది.. భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ ఎన్నికల ప్రచారంలో చాలెంజ్ చేసిన శివశంకరప్ప.. ఆ చాలెంజ్‌ను నిలబెట్టుకున్నారు.. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకుని విమర్శించిన వారి నోళ్లను మూయించారు. ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు శివశంకరప్ప.. ఆయన దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. ఈసారి శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్‌కు 56,410 ఓట్లు వచ్చాయి. 27,888 ఓట్ల మెజార్టీతో ఆయన విజయాన్ని అందుకున్నారు..
యంగ్ హీరోకి తప్పని ఓటమి.. అమ్మ త్యాగం చేసినా..!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.. కాంగ్రెస్ వేవ్‌లో ఏకంగా 11 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ ఎన్నికల బరిలో దిగిన యంగ్ హీరోకి ఓటమి తప్పలేదు.. కాంగ్రెస్ దెబ్బకు పరాజయంపాలైన వారిలో కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ అలియాస్ నిఖిల్ కుమారస్వామి కూడా ఒకరు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్.. 10 వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూశారు.. ఈఎన్నికల్లో కుమారస్వామి గెలిచినా.. తన కుమారుడికి మాత్రం విజయం దక్కలేదు.. రామనగర నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నిఖిల్ గౌడపై.. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.. ఇక్బాల్ హుస్సేన్ కు 87,285 ఓట్లు రాగా, హీరో నిఖిల్ గౌడకు 76,439 ఓట్లు వచ్చాయి.. దీంతో.. 10,846 ఓట్లతో ఓడిపోయారు నిఖిల్ గౌడ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి గౌతం గౌడకు కేవలం 10,870 ఓట్లు వచ్చాయి. అయితే, రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కుమారస్వామి భార్యను పోటీలో పెట్టాలనుకున్నారు.. చివరి నిమిషంలో ఆమె ఈ స్థానాన్ని తన కుమారుడు నిఖిల్ గౌడ కోసం త్యాగం చేశారు. కానీ, కుమారుడు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు.. అయితే, నిఖిల్‌కు ఇది రెండో ఓటమి.. ఎందుకంటే.. గతంలో మాండ్యా పార్లమెంటు స్థానానికి జరిగన బై పోల్‌లో నటి సుమలత చేతిలో తొలిసారి ఓడిపోయారు నిఖిల్ గౌడ. కాగా, ఈ సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మేం కింగ్ మేకర్లం కాదు.. కింగ్‌లము అంటూ చెప్పుకొచ్చిన కుమారస్వామి.. పార్టీ జేడీఎస్‌కు గట్టి షాక్ తగిలింది.. గతంలో తన తల్లి అనితా కుమారస్వామి ప్రతినిథ్యం వహించిన స్థానంలోనూ విజయాన్ని అందుకోలేకపోయారు నిఖిల్ గౌడ..
యువతులతో నగ్న పూజలు.. బంధించి అత్యాచారం..!
ఓవైపు టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్నా.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. ఇలా చేస్తే.. ఏదో జరిగిపోతుంది అంటూ నమ్మబలికి అందినకాడికి దండుకునే కంత్రీగాళ్లు ఓవైపు.. అదే అదునుగా చేసుకుని ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లు మరోవైపు చెలరేగుతూనే ఉన్నాయి.. పూజలతో అద్భుతాలు జరుగుతాయి.. భారీగా డబ్బు వస్తుందంటూ ఓ తాంత్రికుడు యువతులకు ఎరవేసి.. వారితో నగ్నంగా పూజలు చేయించి.. ఆ సమయంలో వారిపై అత్యాచారం కూడా చేసిన ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది.. క్షుద్ర పూజలు నేపథ్యంలో ముగ్గురు యువతులపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పూజల ద్వారా అద్భుతాలు జరుగుతాయని, భారీగా డబ్బు వస్తుందని ముగ్గురు యువతులతో నగ్న పూజలు చేయించాడు ఓ నకిలీ పూజారి.. ఈ ఘటనలో ఓ నకిలీ పూజారితో పాటు పొన్నెకల్లుకు చెందిన ఓ మహిళ కీలక సూత్రధారిగా భావిస్తున్నారు పోలీసులు.. పూజల పేరుతో నమ్మబలికి వారిని ట్రాప్ చేయడమే కాదు.. యువతులను బంధించి గుంటూరు, విజయవాడ, ఒంగోలులోని లాడ్జిల్లో నగ్నంగా పూజలు చేసినట్లు సమాచారం.. ఇక, పూజలు చేస్తున్న సమయంలోనే యువతులపై అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.. ఆ యువతులంతా కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.. పూజలన్నీ నకిలీవని తేలడంతో దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు యువతులు.. దీంతో, రంగంలోకి దిగి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు నల్లపాడు పోలీసులు.
3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఈ మండలాలకు వార్నింగ్..
అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో రాబోవు మూడు రోజుల పాటు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. రేపు 136 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ఎల్లుండి 153 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 132 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ఇప్పటికే ఎండ తీవ్రత నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండల అధికారులకు సూచనలు చేశాం.. క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు వెళ్లాయి.. ఇతర సమాచారం కోసం విపత్తుల సంస్థలో టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించవచ్చు.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తాగాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
సందట్లో సడేమియా.. కర్ణాటకలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు..
దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారు. కాంగ్రెస్ గత మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా విజయం సాధించింది. ప్రజలంతా ఈ హడావుడిలో ఉండగా.. కర్ణాటకలో మాత్రం విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ప్రతీ యూనిట్ కు 70 పైసల చొప్పున పెంచింది. ఈ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. దశాబ్ధకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఛార్జీలు పెరిగాయి. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్‌సి) మే 12న 70 పైసల సుంకం పెంపునకు ఆమోదం తెలిపింది. 70 పైసలలో 57 పైసలు స్థిర ఛార్జీల ద్వారా రికవరీ చేయబడతాయి, మిగిలిన 13 పైసలు ఇంధన ఛార్జీలుగా రికవరీ చేయబడతాయి. రూ. 4,457.12 ఆదాయ వ్యత్యాసాన్ని తగ్గించడానికి కమీషన్ వినియోగదారుల సుంకాన్ని అన్ని విభాగాల్లో యూనిట్ కు సగటున 70 పైసలు పెంచడానికి ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 8.31 శాతం పెరుగినట్లైనట్లు కేఈఆర్సీ తెలిపింది. విద్యుత్ సరఫరా సంస్థలు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.8,951.20 కోట్ల రెవెన్యూ లోటును తగ్గించేందుకు యూనిట్‌కు రూ.1.39 పెంచాలని డిమాండ్ చేశాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం 13 శాతం పెరగడం, బొగ్గు- రవాణా ఖర్చులు పెరగడం, ఉద్యోగుల వేతనాలు-భత్యాలను 20 శాతం సవరించడం వల్ల, వడ్డీ మరియు ఫైనాన్స్ ఛార్జీలలో 30 శాతం పెరుగుదల, 15 శాతం తరుగుదల కారణంగా ఈ సవరణ అవసరమని పేర్కొంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 136 స్థానాలను, బీజేపీ 64, జేడీయూ 20 స్థానాలను కైవసం చేసుకుంది.
గత రికార్డులను తుడిచిపెట్టిన కాంగ్రెస్.. 1989 తర్వాత భారీగా ఓట్లు, సీట్లు..
కర్ణాటక విజయంతో కాంగ్రెస్ విజయంతో గత రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కన్నడ ఓటర్లు ఎంతో కసిగా ఓటేసినట్లు అర్థం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కర్ణాటక నలువైపులా కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. దీంతో గతంలో ఉన్న అన్ని ఎన్నికల రికార్డులను తుడిచిపెటేసి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 1989 తర్వాత అంటే 34 ఏళ్ల తరువాత ఇలాంటి విజయం కాంగ్రెస్ కు దక్కింది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, డీకే శివకుమార్ చాణక్యం, సిద్దరామయ్య ఆకర్షణ బీజేపీ పార్టీ హేమాహేమీలను మట్టికరిపించాయి. చివరిసారిగా 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 43.76 శాతం ఓట్ షేర్ తో ఏకంగా 178 స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా గత ఎన్నికల రికార్డును 2023 ఎన్నికల్లో తిరగరాసింది. ప్రస్తుతం 43 శాతం ఓట్ షేర్ తో 136 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రముఖ రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఈ గణాంకాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కర్ణాటకలో ఏ పార్టీ కైనా ఇదే అతిపెద్ద విజయమని అన్నారు. 1994లో జేడీఎస్ 33.54 ఓట్ల శాతంతో మొత్తం 115 సీట్లు గెలుచుకుంది. 1999లో కాంగ్రెస్ 40.84 శాతం ఓట్లతో 132 సీట్లు గెలుచుకుంది. ఆ తరువాత 2004లో బీజేపీ 28.33 శాతం ఓట్లతో 79 సీట్లలో విజయం సాధించింది. 2008లో బీజేపీ 36.86 శాతం ఓట్లతో 110 సీట్లు గెలచుకుంది. 2013లో కాంగ్రెస్ మళ్లీ 36.6 శాతం ఓట్లతో 122 స్థానాలను గెలుచుకుంది. 2018లో 36.3 శాతం ఓట్లతో బీజేపీ 104 స్థానాలను గెలుచుకుంటే.. 2023లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లతో 136 స్థానాల్లో గెలుపొందింది.
మదర్స్ డేకి వెరైటీ గిఫ్ట్ అడిగిన పంజాబీ మదర్
మదర్స్ డే రోజు మన అమ్మగారికి శుభాకాంక్షలు చెప్పడం.. కానుకలు కొనివ్వడం ఇవన్నీ కామనే.. అయితే ఓ పంజాబీ మదర్ మాత్రం తనకు బిడ్డల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని ఆశిస్తోందో చెప్పిన తీరు ఫన్నీగా అనిపించినా అందర్నీ చాలా ఆలోచింపచేస్తోంది. తన పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏదీ ఆశించరు. నిజంగా వారు కోరుకునేది ఏదైనా ఉందంటే బిడ్డలు మంచి దారిలో నడవడం.. జీవితంలో సెటిల్ అవ్వడం మాత్రమే. మదర్స్ డే అనగానే చాలామంది తమ తల్లులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. అయితే పంజాబీ మదర్ సోనియా ఖత్రీ ఏం కోరుకుంటోందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోనియా ఖత్రీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తనకు ఎలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ అక్కర్లేదని.. దయ చేసి నాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చే పనులు చేయ్యాలంటూ తన పిల్లలకు రిక్వెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకు నిద్ర లేవండి.. మధ్యాహ్నం 12 గంటలకు కాదు.. అలాగే ఇంట్లో వండిన ఆహారం తినండి.. బయట ఫుడ్ ఆర్డర్ చేయవద్దని ఆమె కోరింది. రోజంతా సోషల్ మీడియాను ఉపయోగించవద్దని నవ్వుతూనే తన అభిప్రాయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో చెప్పింది.
తల్లులకు ఏ వ్యాయామం ఉత్తమం?
మే 14 నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ రోజున, పిల్లలు తమ తల్లులకు శుభాకాంక్షలతో పాటు బహుమతులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తల్లి తన బాధ్యతలన్నింటినీ తెలివిగా నిర్వహిస్తుంది. తల్లి తన జీవితమంతా పిల్లల ఆరోగ్యం, సంరక్షణ, విద్య కోసం అంకితం చేస్తుంది. ఈ పనుల మధ్య ఆమె తన ఆరోగ్యం గురించి మరచిపోతుంది. చాలా సంవత్సరాలు తన పిల్లలతో ఆరోగ్యంగా ఉండటానికి తల్లి తనను తాను చూసుకోవడం మర్చిపోకూడదు. వయసు మీద పడ్డాక శరీరంలో మార్పులు చోటు చేసుకొని చేతి నొప్పి, హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు, బరువు పెరుగుట, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పొట్ట చుట్టు, కొవ్వు గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, హార్మోన్ అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది. పొట్ట తగ్గడం, ఫిట్‌గా ఉండడం అన్ని వయసుల మహిళలకు తప్పనిసరి. మదర్స్ డే సందర్భంగా తల్లి తన బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేస్తున్నాం. ఈ వ్యాయామం చేయడానికి మీరు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు మంచం మీద పడుకుని ఈ మూడు వ్యాయామాలు చేయవచ్చు. ఈ వ్యాయామాలు కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. కొవ్వును వేగంగా కరిగించడానికి పని చేస్తాయి.
లైగర్ ఎగ్జిబిటర్ల ధర్నాపై చార్మీ రియాక్షన్.. ఏం చెప్పిందంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ వంటి సెన్సేషనల్ కాంబోలో రూపొందిన ‘లైగర్’ సినిమా.. భారీ వసూళ్లతో రికార్డుల పర్వం సృష్టిస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా అది బోల్తా కొట్టేసింది. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం.. అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కారణంగా డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబిటర్లు చాలా నష్టాలు చవిచూశారు. ఆ సమయంలో ఈ సినిమాపై ఎన్నో విమర్శలు రావడంతో పాటు, మరెన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానూ నిలిచింది. కొన్ని రోజుల పాటు ఈ సినిమా చర్చలే అంతటా నడిచాయి. క్రమంగా ఈ లైగర్ వివాదం సద్దుమణుగుతూ వచ్చింది. అయితే.. ఇప్పుడు నైజాం ఏరియాకు చెందిన ఎగ్జిబిటర్లు, ఈ సినిమా వల్ల ఎంతో నష్టపోయామంటూ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట నిరవధిక దీక్షకు పూనుకున్ననారు. నష్టాలను భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధర్నాపై నటి, లైగర్ నిర్మాత చార్మీ కౌర్ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఎగ్జిబిటర్లకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపినట్లు తెలిసింది. అయితే.. పూరీ జగన్నాథ్ ఈ వ్యవహారంపై ఇంకా స్పందించాల్సి ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఈ వివాదంపై ఎలా రియాక్ట్ అవుతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.