రేపు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం దేనిపై అంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. రేపు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి తిరులమ బయల్దేరి వెళ్లిన యాన.. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్నారు.. ఇక, రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి. సాయంత్రం 4.41 గంటలకు తన చాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిగా సచివాయంలోని మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు.. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టబోతున్నారు.. ఇక, సామాజిక పింఛన్ రూ. 4000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఫైల్ పై మూడో సంతకం చేస్తారు.. స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై కూడా సంతకాలు చేస్తారని తెలుస్తోంది.. మరోవైపు.. 24 మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు.. కాసేపట్లో ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఓ ప్రకటన వెలవడే అవకాశం ఉందంటున్నారు.
కూటమి విజయం చిన్నది కాదు.. ఇది ఒక హెచ్చరిక..!
కూటమి విజయం అనేది చిన్న విజయం కాదు.. చాలా పెద్ద విజయం.. ఈ విజయం ఒక హెచ్చరిక లాంటిది అని మనం భావించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతి పాలన తీరుతో ప్రజలు ఒక గుణపాఠం తెలియచేశారు.. అధికారం వచ్చాక ప్రజా సంక్షేమన్ని పట్టించకపోతే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియచేశారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన చేయకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహారిస్తే మాత్రం ప్రజలు సహించరని.. నిశ్శబ్ద ఓటుతో జవాబు ఇచ్చారని పేర్కొన్నారు.. కూటమితో పార్టీలు కలుస్తాయని తెలిసినప్పుడు కొందరు ఆశావాహులు సైతం నిర్ణయాన్ని గౌరవించి కూటమి కోసం సమన్వయంతో పని చేశారని గుర్తుచేశారు పురంధేశ్వరి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తిరిగి తీసుకురావడం కూటమి ప్రభుత్వం మీద ఉన్న బాధ్యతగా పేర్కొన్న ఆమె.. గత ప్రభుత్వం రాజధాని, పోలవరం నిర్మాణాలని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి వీధి దీపాలతో శోభయానుమానంగా మారింది.. పార్టీ విధి విధానాలను ప్రతి కార్యకర్త ఒక బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి నినాదంతో రాష్ట్రం అభివృద్ధి దిశలో ఉంటుంది అన్నారు. ఎన్డీఏ కూటమికి అనూహ్యమైన విజయానికి ప్రతి కార్యకర్త కస్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక, పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిధిగా బీజేపీ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ హాజరయ్యారు.. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వరరావు, విష్ణు కుమార్ రాజు, పార్ధసారధి తదితర నేతలు.. మరోవైపు.. ఈ సమావేశంలో బీజేపీ తరపున గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను సత్కరించారు బీజేపీ ఏపీ పదాధికారులు, జిల్లాల ఇంఛార్జ్‌లు..
మంత్రులతో తొలి భేటీ.. కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఆ తర్వాత తొలిసార మంత్రులతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. మంత్రులతో సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు.. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు. మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. మరోవైపు.. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొనగా.. రేపటిలోగా శాఖలను కేటాయిస్తాను అని స్పష్టం చేశారు చంద్రబాబు.. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, మంత్రుల సమావేశం తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల బయల్దేరి వెళ్లారు ఏపీ సీఎం.. రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం ఫ్యామిలీ.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు..
నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.. థాంక్స్ బాలా అన్నయ్య..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఓ వైపు భర్త సీఎంగా.. మరోవైపు కుమారుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే.. స్వయంగా వీక్షిస్తూ.. ఆనందంలో మునిగిపోయారు నారా భువనేశ్వరి.. ఇక, అక్కడ ఎంట్రీ ఇచ్చిన నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి సంతోషాన్ని రెట్టింపు చేశారు.. అయితే, ఆ క్షణాన్ని.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నారా భువనేశ్వరి.. ప్రమాణస్వీకారం వేదికపైకి పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ కలిసి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజిపై కూర్చున్న తర్వాత బాలకృష్ణ వచ్చి చెల్లిని ఆప్యాయంగా పలకరించి, ప్రేమతో చెల్లె నుదిటిపై ముద్దు పెట్టారు.. భువనేశ్వరి కూడా ఆప్యాయంగా అన్నయ్యకు నమస్కరించారు.. ఇక, ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.. ఆ వీడియోను షేర్ చేస్తూ.. అటు నారా, ఇటు నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా ఆ వీడియోపై స్పందించారు.. ఎక్స్ (ట్విట్టర్)లో ఆ వీడియోను షేర్ చేసిన నారా భువనేశ్వరి.. ”ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో… నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.. థాంక్స్ బాలా అన్నయ్య” అంటూ కామెంట్ చేశారు.. ఇక, ఈ వీడియోపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.. నిస్వార్థమైన ప్రేమ అని ఒకరు.. అన్నా చెల్లలి బాండ్ అని మరికొందరు.. మాకు రెండు కళ్లు సరిపోవలేదు ఈ వీడియో చూస్తుంటే అంటూ ఇంకా కొందరు.. మరుపురాని మరిచిపోలేని సన్నివేశం ఇది అంటూ.. మరో నెటిజన్ కామెంట్ చేశారు.. మొత్తంగా మరోసారి ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.
జీవో 317 పై కేబినేట్ సబ్ కమిటీ భేటీ
జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్తలకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ దరఖాస్తులకు అవకాశం కల్పించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 12 వేల 11 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను రీ – వెరిఫికేషన్ కు అవకాశం కల్పించడం జరిగింది. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ ను వారి సెల్ ఫోన్ కు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. అవాక్కైన ప్రయాణికులు
ఈ మధ్య రీల్స్ కోసం యువత పెడదోవ పడుతోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైలు, ఎయిర్‌పోర్టులు.. ఇలా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టడం లేదు. పబ్లిక్ ఉన్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్‌లు చేసి ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత అవుతోంది. ఆ మధ్య ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల మధ్యలో డ్యాన్స్ చేసి.. ప్యాసింజర్స్ ఆగ్రహానికి గురైంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న కామన్‌సెన్స్ లేకుండా ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ చేసింది. కొంత మంది అలానే చూడగా.. మరికొందరు అభ్యంతరపడ్డారు. ఇది ఏ ఎయిర్‌పోర్టో తెలియాల్సి ఉంది. విమానాశ్రయంలో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హ్యాపీ న్యూఇయర్ సినిమాలోని లవ్లీ పాటకు నృత్యం చేసింది. అయితే ఈ డ్యాన్స్‌పై మండిపడుతున్నారు. నాన్సెన్స్ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడున్నారో తెలియకుండా డ్యాన్స్‌లు చేయడం దారుణం అని మండిపడుతున్నారు. మరికొందరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు.
ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు
నీట్ ఫలితాల వివాదం రోజు రోజుకూ ముదిరిపోతోంది. తాజాగా దేశవ్యాప్తంగా నీట్‌పై నెలకొన్న ఉత్కంఠ ప్రభావం సోషల్ మీడియాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్య గత కొన్ని రోజులుగా ఓ విద్యార్థిని 12వ మార్కు షీట్ వైరల్ అవుతోంది. ఈ విద్యార్థి నీట్‌లో 705 మార్కులు సాధించినట్లు మార్కుషీట్ లో పేర్కొన్నారు. కానీ అతను 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థి నీట్ లాంటి కఠినమైన పరీక్షలో ఇంత మంచి మార్కులు ఎలా సాధిస్తాడని సోషల్ మీడియాలో అందరూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ మార్క్‌షీట్‌పై ఇప్పుడు NTA క్లారిటీ వచ్చింది. అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులు కాకపోతే అడ్మిషన్ తీసుకునే అర్హత లేదని ఎన్టీఏ తెలిపింది. అర్హత షరతు ఏమిటంటే అభ్యర్థి 12వ పాస్ మార్కు షీట్ కలిగి ఉండాలి. ఈ రోజు ఎన్టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో వైద్య విద్యార్థుల అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. దీనిలో గ్రేస్ మార్కులు, OMR షీట్, నీట్ పరీక్ష, ఫలితాలు మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయబడ్డాయి. ఇది కాకుండా, ఆంచల్ పాల్ అనే విద్యార్థి మార్కుల తగ్గింపు వైరల్ వీడియోపై కూడా NTA తన స్టాండ్ ఇచ్చింది. దీనిపై ఎన్టీఏ మాట్లాడుతూ.. ఆంచల్ పాల్ తన మార్కులు తగ్గాయని పేర్కొంటున్న వీడియోపై వివరణ ఇచ్చింది. దీని కోసం, మార్కులు / స్కోర్ కార్డ్ / సమాధానానికి సంబంధించిన వ్యత్యాసాలకు సంబంధించి OMR జవాబు పత్రం మార్కులలో ఎటువంటి మార్పు చేయలేమని తెలిపింది. ఈ సంఖ్యలను యంత్రం ద్వారా వర్గీకరిస్తారని స్పష్టం చేసింది.
రాయ్‌బరేలీ, వయనాడ్‌పై కీలక వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు రాహుల్ చెప్పుకొచ్చారు. దీనికి ఆయన రెండు స్థానాల నుంచి గెలవడమే ప్రధాన కారణం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా రెండు చోట్ల నుంచి భారీ విజయంతో గెలుపొందారు. రాయ్‌బరేలీలో దాదాపు 3 లక్షల మెజార్టీ వస్తే.. వయనాడ్‌లో ఏకంగా 3 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. ఇప్పుడు రాహుల్‌కి ఈ రెండు సమస్యగా మారాయి. కష్టకాలంలో వయనాడ్ ఆదరించింది. పైగా భారీ మెజార్టీని అందించారు. దీంతో ఏ స్థానాన్ని వదులుకోవాలో రాహుల్ తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా ఈ విషయంపై రాహుల్ స్పందించారు. తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకొన్నా రెండు నియోజకవర్గాలు సంతోషంగా అంగీకరిస్తాయన్నారు. బుధవారం కేరళలోని మల్లప్పురంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నానని.. ఏమైనా కానీ.. వయనాడ్ లేదా రాయ్‌బరేలీలో ఒక దానికే తాను ఎంపీగా ఉండాలన్నారు. తన నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తీరును తప్పుపట్టారు. దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా అని ఎద్దేవా చేశారు. తాను మాత్రం మానవమాత్రుడినేనని తెలిపారు. తనకు పేదలు, దేశమే దైవమని చెప్పారు. తాను ఏం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోడీ తన వైఖరిని మార్చుకోవాల్సిందేనన్నారు. ఈ మేరకు ప్రజలు ఆయనకు స్పష్టమైన సందేశం పంపారని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా? గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను తెలియజేస్తాయి. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నియమిస్తారనే నిబంధన ఉంది. అయితే ఈ రెండు పేరాల్లో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన లేదు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రితో సమానంగా డిప్యూటీ సీఎం పదవిని పరిగణిస్తారు. క్యాబినెట్ మంత్రికి లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎంకు కూడా లభిస్తాయి. డిప్యూటీ సీఎం నియామకంపై ఈ ఏడాది ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిజానికి డిప్యూటీ సీఎంల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ప్రజా రాజకీయ పార్టీ అనే సంస్థ దాఖలు చేసింది. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ఇండియా-అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. టీమిండియా సూపర్-8లోకి ఎంటర్ కానుంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో అమెరికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ మోనాంక్ పటేల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో ఆరోన్ జోన్స్ కెప్టెన్సీ చేపట్టాడు. మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలువాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన పలువురు ఆటగాళ్లు ఉన్నారు. అమెరికా బౌలర్లు సౌరభ్ నేత్రవాల్కర్, హర్మీత్ సింగ్ పలువురు భారత ఆటగాళ్లతో కలిసి ఆడారు.
నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్.. ఎవరికి అనుకూలం
టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. భారత జట్టు గత ఆదివారం పాకిస్థాన్ ను ఓడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా అనుకుంటుంది. అయితే.. మరోసారి అందరి దృష్టి ఈ మైదానంలోని పిచ్‌పైనే ఉంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అమెరికా జట్టును చిన్న అంచనా వేయకూడదు. అమెరికా జట్టు పాకిస్థాన్ లాంటి పెద్ద జట్టును ఓడించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఏదైనా దెబ్బ కొడుతుందేమోనన్న భయం టీమిండియా ఆటగాళ్ల మనసులో ఎక్కడో ఉండక తప్పదు. కాసేపట్లో నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం పిచ్‌పై మొదటి నుంచి చర్చ జరుగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్ ఇక్కడ ఉపయోగించబడింది. ప్రారంభంలో మ్యాచ్‌లు ఆడినప్పుడు.. అపరిమిత బౌన్స్ కారణంగా ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమేణా పిచ్ మెరుగుపడింది. అయితే ఈ పిచ్ ఇప్పటికీ బౌలర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు ఇక్కడ చక్కటి సహకారం లభిస్తున్నందున భారత్-అమెరికా మ్యాచ్‌లోనూ బౌలర్ల ఆధిపత్యం కనిపించనుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఈ పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నాడు. అతని బౌలింగ్ మాయాజాలంతో పాకిస్తాన్ నుండి విజయాన్ని లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అమెరికాతో జరిగే మ్యాచ్‌లో మరోసారి బుమ్రాపై దృష్టి సారించింది. అమెరికా జట్టును తేలికగా తీసుకోలేము.. ఎందుకంటే ఈ జట్టులో భారత్, పాకిస్థాన్‌లకు చెందిన కొందరు ఆటగాళ్లు ఉన్నందున అక్కడ అవకాశం రాకపోగా అమెరికా తరఫున ఆడుతున్నారు.