ఒకవేళ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి..
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి గ్రామగ్రామన అభివృద్ధి చేసింది.. రైతులు కందుతున్న భరోసాలు, పిల్లలకు అందుతున్న క్వాలిటీ ఎడ్యుకేషన్, అవ్వ తాతలకు అందుతున్న పెన్షన్లు కొనసాగించడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అయితే, గతంలో ఎప్పుడు జరగనీ విధంగా ఈ 58 నెలల కాలంలో.. మీ బిడ్డ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడో మీకు చెప్తాను అని వైఎస్ జగన్ చెప్పారు. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే ఈ 58 నెలలు కాలంలో మీకు జరిగిన మంచిని కొనసాగించాలని మీరు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి.. చంద్రబాబుకి ఓటు వేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లే అని ఆయన చెప్పారు. సింగపూర్ ను మించిన అభివృద్ధి చేస్తాను అని చంద్రబాబు చెప్పారు.. కానీ ఎక్కడ చేశారు అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.
మళ్ళీ మన జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది..
వైసీపీ పార్టీలో ఇపుడున్న విధానం సక్సెస్ ఫుల్ మోడల్.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు జోస్యం చెప్పారు. వాలంటీర్లను రిజైన్ చేయమనoడి.. వారితో పని చేయించండి అని పేర్కొన్నారు. నామినేషన్ రోజు ప్రతి వాలంటీర్ 25 మందిని తీసుకురమ్మనoడి.. ఎందుకంటే వాలంటీర్ మన పార్టీ కార్యకర్తే అని చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థి పై టీడీపీ వారే విమర్శిస్తున్నారు.. దానిని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి అని ఆయన చెప్పారు. నాకు ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇసారే ఎక్కువ మర్యాద వచ్చింది.. దానికి కారణం సోషల్ మీడియా.. కష్టపడి పని చేస్తే నెల రోజులలో అద్భుతాలు సృష్టించవచ్చు.. పార్టీకి పెద్ద నెట్ వర్క్ ఉంది అని మంత్రి ధర్మన ప్రసాద్ రావు వెల్లడించారు. అయితే, వ్యూహాం సిద్దం చేసుకొని క్షేత్ర స్దాయిలో లీడర్స్ ముందుకు వెళ్లాలి అని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. ఎన్నికలలో మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.. క్రింద నుంచి పని చేసుకొని వచ్చాను.. నేను ప్రజా జీవితంలో నూటికి నూరు పాల్లు సంతృప్తిగా ఉన్నవాడిన్నారు. పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారో వారే సక్సెస్ అవుతారు.. బయటకు వెళ్లిన వారిని బస్సు చార్జీలు పెట్టి అయినా తెప్పించండి అని ఆయన చెప్పారు.
శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ‘మేమంతా సిద్ధం ‘ అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా సందర్శిస్తూ అక్కడ ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రసంగిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 13 శనివారం నాడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్ రాత్రి బస నుంచి బయలుదేరుతారు. ఇక అక్కడి నుండి కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు CK కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్. ఆ కార్యక్రమం తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. భోజనం అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇలా శనివారం మ్మొత్తం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసుతుంది.
ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సమీక్షలో సీఎం సీరియస్..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు సచివాలయంలో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఉద్దశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి, బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బంది పై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని సీఎం అప్రమత్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.
ఈ నెల 19న కిషన్ రెడ్డి నామినేషన్.. హాజరుకానున్న కేంద్రమంత్రి
సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొననున్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో యాదవ సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన నాటి నుంచే.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గం మొత్తాన్ని ఓ దఫా చుట్టేశారు. కేంద్రంలో పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇళ్లుళ్లు తిరుగుతున్నారు. అదే సమయంలో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, కాంగ్రెస్ హామీలను వివరిస్తూ ప్రజల ముందుకెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మోడీ వేవ్ తెలంగాణలో పార్టీకి గణనీయ స్థానాలు సాధించిపెడుతుందని కమలం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రామనవమి రోజు అపూర్వఘట్టం.. బాలరాముడి నుదుట సూర్య కిరణాలు..
శ్రీరామనవమి వేడుకలకు భవ్య రామమందిరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అయోధ్య సిద్ధమవుతోంది. అయోధ్యతో పాటు 800 మఠాలు, దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్తాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రామనమవి రోజున అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిషృతం కాబోతోంది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలరాముడికి సూర్య తిలకం ఏర్పాట్లపై ఈ రోజు మధ్యాహ్నం రిహార్సల్స్‌ని ఆలయ కమిటీ పూర్తి చేసింది. రిహార్సల్ సమయంలో సూర్య కిరణాలు రాముడి నుదుటిని తాకాయి. రాముడి వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అయోధ్యకు తరలివచ్చే నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది.
48 గంటల్లో ఇజ్రాయిల్‌పై దాడి చేయబోతున్న ఇరాన్..
సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్ ఫోర్స్‌కి చెందిన టాప్ కమాండర్, మరో ఆరుగురు కీలక అధికారులు మరణించడం ఇరాన్ కోపానికి కారణమైంది. తాము ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రంజాన్ తర్వాత ఇరాన్ ఎప్పుడైనా ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్‌పై దాడి చేసే అవకాశం ఉందని, దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ కూడా పూర్తిగా సంసిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయిల్‌పై దాడి చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన ప్రణాళికను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముందు ఉంచామని, ఆయన సలహాదరుడు చెప్పారు.
ఆ ఆలోచనే లేదు.. అప్పటివరకు నేను క్రికెట్ ఆడుతాను.. రోహిత్ శర్మ..!
తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన చేయట్లేదు అంటూ రోహిత్ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇకపోతే తన వరల్డ్ కప్ నెరవేరకుండా రిటైర్ అయ్యే ప్రసక్తే లేదంటూ ఖరాకండిగా రోహిత్ శర్మ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం 37 ఏళ్ల రోహిత్ శర్మ.. ఇక రిటైర్మెంట్ దగ్గర పడిందని., ఇక ఎక్కువ రోజులు క్రికెట్ ఆడటం కష్టమే అన్న భిన్నభిప్రాయాల మధ్య ఇంటర్వ్యూలో భాగంగా ఆయన స్పందించాడు. ఇందులో భాగంగానే అతడు వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాల్సిందే అని స్పష్టం చేశాడు. ఇకపోతే ధోని సారధిలో 2007 లో వరల్డ్ కప్ గెలిచిన టీంలో రోహిత్ శర్మ టీమిండియాలో ఒక సభ్యుడు. అయితే ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. అయితే ఆ తర్వాత టీమిండియా ఏ మెగా టోర్నీ గెలవలేదు. ఇకపోతే ఈ నేపథ్యంలో గత ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వెళ్లినా దురదృష్టం కొద్దీ ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి ప్రపంచకప్ ను చేజిక్కించుకుంది. దాంతో రోహిత్ శర్మ వరల్డ్ కప్ కలగానే మిగిలిపోయింది. అయితే, 2027 లో జరిగే సౌతాఫ్రికా వేదికగా తాను ఆడుతానన్నట్లుగా రోహిత్ తెలిపాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోలో పాల్గొన్న రోహిత్ శర్మ ఈ విధంగా స్పందించాడు. తాను ఇప్పుడే రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించడం లేదని.. కాకపోతే జీవితం మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో తెలియదంటూ ఇప్పటికి నేను బాగానే ఆడుతున్నాను. మరికొన్ని ఏళ్ల పాటు కూడా తాను ఇలాగే ఆడతానంటూ తెలిపాడు.
హను-మాన్ తరువాత తేజ సజ్జా సినిమా ఇదే.. రేపే అధికారిక ప్రకటన!
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ… ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చూడాలని ఉంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యంగ్ ఏజ్ లో కనిపించి షాకిచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో తేజ సజ్జా హీరోగా పరిచయం అయ్యారు. ఇష్క్, అద్భుతం వంటి సినిమాలు చేసి పర్వాలేదనిపించుకున్నారు. ఇక ఈ ఏడాది తనకు మొదటి సినిమా హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి హనుమాన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు తేజ సజ్జా. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు రూ.350 కోట్లు కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత తేజ సజ్జా నెక్ట్స్ ప్రాజెక్ట్ అంతా జై హనుమాన్ అనుకున్నారు. కానీ ఆ సినిమాలో తేజ క్యారెక్టర్ జస్ట్ కొద్దిసేపు ఉంటుందని దర్శకుడు ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక తేజ సజ్జా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తేజ తన తరువాతి సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో చేయబోతున్నట్లు సమాచారం.