తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. జీవో ప్రకారం.. ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు వందశాతం పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే.. ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతాయని చెప్పారు. ఈ క్రమంలో.. ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతనే కొత్త విధానాలను రూపొందించామన్నారు. నగరపాలక సంస్థలు మునిసిపాలిటీలు… నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులను సత్వరమే కట్టాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తామన్నారు. అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అందరూ సహకరించి పన్నులను చెల్లించాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
జార్ఖండ్ ఖనిజ సంపదపై బీజేపీ కన్నేసింది.. ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం
బీజేపీకి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదు.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్‌లల్లో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలోని అపార ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ సంపదను, వనరులను కాపాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని.. ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని భట్టి విక్రమార్క చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం.. జనాభా నిష్పత్తి ప్రకారం వనరులు, సంపద పంచేందుకు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించామని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్లో తీర్మానం చేశామని.. ఆ తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవంగా కుల గణనకు బిల్లు పాస్ చేయించామని.. ప్రస్తుతం తెలంగాణలో శరవేగంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. ఇక్కడి సంపద ఈ ప్రాంత వాసులకే పంచుతామని.. అందుకు ఇక్కడ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేపడతామని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సంపద ఎవరి వద్ద ఉంది, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి వంటి అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేతగా.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నానని తెలిపారు. జార్ఖండ్ తరహాలోనే తెలంగాణ ప్రజలు మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకు కావాలని సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని వివరించారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ‘మూసీ నిద్ర’ కార్యక్రమం చేశారు..
బీజేపీ చేపట్టిన ‘మూసీ నిద్ర’ కార్యక్రమంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని అన్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటికైనా ఆ ప్రాంత వాసుల సమస్య తెలిసిరావొచ్చు.. కలుషితమైన నీరు, గాలి మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు.. రాష్ట్రంలో పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారని ఆరోపించారు. మంచి నీరు, మంచి ఇల్లు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది.. ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.. డీపీఆర్ రానివ్వండి శాస్త్రీయంగా గోడలే కట్టాలో.. ఇంకేమైనా చేయాలో సలహాలు ఇవ్వండని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారు.. అమాయకులను బలి చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అధికారులను విదేశాల్లో దాచారని మంత్రి కొండా సురేఖా అన్నారు. బీఆర్ఎస్ ది తుగ్లక్ పాలన.. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని దుయ్యబట్టారు. కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే పురుగులు పడి చస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ముస్లిం సంస్థల ‘‘ఓట్ జిహాద్’’.. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన బీజేపీ..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి బహిరంగంగా మద్దతు ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్రంలోని 269 స్థానాల్లో ఎంవీఏకు ఓటు వేయాలని, బీజేపీయేతర పార్టీలకు ఓటేయాలని నోమానీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు, ఇలాంటి ప్రకటనలు ప్రజాస్వామ్య సూత్రాలకు ముప్పు అని భాటియా పేర్కొన్నారు. అంతకుముందు జార్ఖండ్‌లోని జమియత్ ఉలేమా ఇ హింద్ కూడా ఇలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి ఓటు వేయాలని ముస్లింలను కోరారు. ఇలా పలు ముస్లిం సంస్థలు, నాయకులు ఒకే పార్టీకి ఓటేయాలని కోరడాన్ని బీజేపీ ‘‘ఓట్ జిహాద్’’గా పిలుస్తోంది. “దీన్నే ఓటు జిహాద్” అని భాటియా అన్నారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే మరియు శరద్ పవార్‌లు “బుజ్జగింపు రాజకీయాలు” చేస్తున్నాయని, ప్రజాస్వామ్య సమగ్రత కంటే “అధికార వ్యామోహం”కు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా కూటమి విధానంతో అక్రమ వలసలను ప్రోత్సహించడం, వారికి మద్దతు ఇవ్వడం వంటి ఉన్నాయని అన్నారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెప్పారు. మతపరమైన ప్రాతిపదికన చేసిన అప్పీళ్లపై విచారణ జరిపి, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మరియు సుప్రీం కోర్టును కోరింది, ఇటువంటి పద్ధతులు అవినీతి ఎన్నికల ప్రవర్తనగా పరిగణించబడుతున్నాయని పేర్కొంది.
మణిపూర్‌పై అమిత్ షా అత్యున్నత సమీక్ష..
ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవల కుకీ మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్న పిల్లల్ని చంపడంతో మరోసారి ఉద్రిక్తతులు పెరిగాయి. మైయిటీ వర్గం సీఎం బిరెన్ సింగ్‌తో పాటు మంత్రులు, ఎమ్మె్ల్యేల ఇళ్లపై దాడులు చేసింది. 24 గంటల్లో హత్యలు పాల్పడిన మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని సీఎంకి అల్టిమేటం విధించింది. నవంబర్ 11 న, బోరోబెక్రా ప్రాంతంలోని ఒక పోలీసు స్టేషన్‌పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది, అయితే దాడిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి, ఫలితంగా 11 మంది ఉగ్రవాదులు మరణించారు. తిరోగమనం చేస్తున్న సమయంలో, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్ సమీపంలోని సహాయక శిబిరం నుండి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మరియు ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశారు. అస్సాం సరిహద్దుల్లోని జరిబామ్ బారాక్ నది ఒడ్డున వీరి మృతదేహాలు లభించడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘పుష్ప-2 ‘ ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ నేడు బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్నారు. వీరితో పాటు మరికొందరు చిత్రబృంద సభ్యుల రాకతో ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ట్రైలర్ ను విడుదల చేసారు. ఇకపోతే తాజాగా పుష్ప 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. అంటూ జగపతి బాబు వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్.. పుష్ప.. పేరు చిన్నది.. కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దది.. పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. సాగుతున్న సంభాషణలు హై వోల్టేజ్ డైలాగ్ లు ఉన్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. అంటూ హీరోయిన్ వాయిస్ తో డైలాగ్స్.., పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.? ఇంటర్నేషనల్ అంటూ చివరి వరకు చాలా వైవిధ్యంగా ట్రైలర్ కట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి.