నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకే 34 శాతం.. సీఎం కీలక వ్యాఖ్యలు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా లబ్ధి జరిగేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరికొంత కసరత్తు తరువాత…సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని….దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని సీఎం తెలిపారు. దీనిపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్లేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారన్నారు. వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై సీఎం సమీక్షలో చర్చించారు. న్యాయపరంగా తిరిగి 34 శాతం రిజర్వేషన్లు పొందడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కోర్టు తీర్పులు పరిశీలించి…..న్యాయ పరంగా ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు.
పింఛన్ల తొలగింపుపై సీఎం కీలక వ్యాఖ్యలు..
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమీక్షలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా చర్చించారు.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు.. అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టనున్నారు.. అర్హులకు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.. ఇదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. అనర్హులను తొలగించేందుకు పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కొందరు పింఛన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై అర్హులైనవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంగా.. మూడు రోజుల పాటు.. అంటే గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు.. ఇక, అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.. అయితే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16వ తేదీన అల్పపీడనం ఏర్పడిన విషయం విదితమే కాగా.. తర్వాత వాయుగుండంగా బలపడి, తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. కానీ, రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చింది. ఆ తర్వాత మరో రెండు రోజులకు వాయుగుండంగా మారిపోయింది.. అయితే, అల్పపీడనం ఏపీపై మరో మూడు రోజులు ఉంటుందని వాతావరణశాఖ పేర్కొన్న విషయం విదితమే కాగా.. ముఖ్యంగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు. వైయస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
శరవేగంగా పనులు. జూన్ 2026కే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి..
శరవేగంగా పనులు జరుగుతున్నాయి.. జూన్ 2026కే భోగాపురం ఎయిర్‌పోర్ట పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని తిరుమల కాలేజ్ లో కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 35 వేల మంది ఉన్న తిరుమల కాలేజ్ లో 627 మంది ఐఐటీ, నీట్, బిట్స్ లో పట్టాలు పొందడం అభినందనీయం అన్నారు.. సాధారణ కుటుంబాల నుండి తిరుమలకు వచ్చి సీట్లు సంపాదిస్తున్నారని తెలిపారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువతపై, విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.. విద్యాశాఖ మంత్రిగా యువకుడిగా నారా లోకేష్ చాలెంజ్‌గా తీసుకున్నారన్నారు.. అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగువారు వివిధ హోదాల్లో రాణిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఇక, కొత్తగా ఎయిర్‌పోర్ట ఏర్పాటు విషయంలో.. కాకినాడ ఇతర ప్రాంతాల్లో అనువుగా ఉన్న ప్రాంతాన్ని చూస్తున్నట్టు వెల్లడించారు రామ్మోహన్‌నాయుడు.. భోగాపురం అద్భుతమైన ప్రాజెక్టుగా పేర్కొన్న ఆయన.. శరవేగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నాం అన్నారు.. జూన్ 2026 కే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయని పూర్తి చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు.. విశాఖ ఎయిర్‌పోర్ట నుంచి అన్ని విభాగాల తరలింపు కూడా వేగవంతం చేస్తు్న్నామని వెల్లడించారు కేద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు..
ప్రకాశం జిల్లాను వదలని భూప్రకంపనలు.. వరుగా 3 సార్లు కంపించిన భూమి
భూప్రకంపనలు ప్రకాశం జిల్లాను వీడడం లేదు.. వరుసగా మూడు రోజుల నుంచి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.. తాజాగా, ముండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. రాత్రి 8:15 నిమిషాలకు.. 8:16 నిమిషాలకు.. 8:19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. అయితే, పెద్ద శబ్దంతో భూమికంపించటంతో ఆందోళనకు గురైన స్థానికులు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. అయితే, గత మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. వరుసగా మూడు రోజులు భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.
బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.. మంత్రి మండిపాటు
బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా బడ్జెట్‌లో 35 శాతం ప్రకటించి ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయమనేదంటూ బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. రైతుబంధు పథకంలో 2019-20 సంవత్సరంలో రెండు పంటకాలాలలో మీరు పూర్తిగా డబ్బులు చెల్లించని మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. 2023 యాసంగి రైతుబంధు 7600 కోట్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అంటూ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతుబంధు పేరు చెప్పి అన్ని పథకాలకు వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి మరెన్నో పథకాలను అటకెక్కించారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్ర కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్, నిధులు కూడా దాదాపు రూ.3005 కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోబానికి కారణమైన వారే.. ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్తున్నారని ఆక్షేపించారు. పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా చెల్లించక చేతులెత్తేస్తే, ఈ ప్రభుత్వం గత బకాయిలు చెల్లించి, వాటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న ఈ ప్రభుత్వానికా మీరు నిలదీయమని చెప్పేదంటూ ప్రశ్నలు గుప్పించారు. మీరు చేసిన రుణమాఫీ 2014, 2018పై రైతుల వద్దకు వెళ్ళి అడగగలరా?.. అసలు ఆ పథకాలు రుణమాఫీ అని పెట్టడం కంటే వడ్డీ మాఫీ అంటే బాగుండేదేమో అంటూ ఎద్దేవా చేశారు. 2018 రుణమాఫీలో 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.
డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
లోన్ యాప్ మోసాలు ప్రస్తుతం తగ్గాయని తెలంగాణ సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. లోన్ యాప్‌లు తక్కువ సంఖ్యలో యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. పోలీస్ అధికారులు అంటూ ఎవరు కాల్ చేసినా కాల్ కట్ చేయాలన్నారు. అనుమానం వస్తే మాకు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో కింగ్ పిన్‌లను అరెస్ట్ చేసేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్ అందుబాటులో ఉన్నారన్నారు. ప్రతి సైబర్ వారియర్స్‌కు ప్రభుత్వం ఎక్స్‌క్లూజివ్ మొబైల్‌ను సమకూర్చిందని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ప్రభుత్వ సహకారం చాలా బాగుందని సీఐడీ డీజీ షికా గోయల్ స్పష్టం చేశారు.
ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌గా రామసుబ్రమణియన్ నియామకం
జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది. అప్పటి నుంచి చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. మిశ్రా పదవీ విరమణ తర్వాత తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ నియమితులయ్యారు. తాజాగా పూర్తి ఛైర్మన్‌గా రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ పదవికి మాజీ ప్రధాన న్యాయమూర్తులు లేదా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జిలను నియమిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో చైర్‌పర్సన్‌గా ఉంటారు. గతంలో మాజీ సీజేఐలు హెచ్‌ఎల్ దత్తు కేజీ బాలకృష్ణన్ కూడా హెచ్‌ఆర్సీ పదవిలో ఉన్నారు. తనను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ పదవికి పరిశీలిస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శుక్రవారం ఖండించారు. డిసెంబర్ 18న తదుపరి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యసభ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలుగా సమావేశానికి హాజరయ్యారు.
“ఒకే దేశం ఒకే ఎన్నిక”పై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదల..
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీలో మొత్తం 39 మంది సభ్యులను చేర్చారు. లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం లభించింది. వాస్తవానికి జేపీసీలో 31 మందిని నియమించనున్నట్లు కేంద్రం తొలుత వెల్లడించింది. కానీ, కీలకమైన ఈ బిల్లులపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్న దృష్ట్యా 39 మందిని నియమించాలని నిర్ణయించింది. జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురుకి అవకాశం కల్పించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ (2), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(2), డీఎంకే(2), వైఎస్సార్‌సీపీ(1) శివసేన(1), టీడీపీ(1), జేడీ–యూ(1), ఆర్‌ఎల్డీ(1), ఎల్‌జేఎస్పీ–ఆర్‌వీ(1), జేఎస్పీ(1), శివసేన–ఉద్ధవ్(1), ఎన్సీపీ–శరద్ పవార్(1), సీపీఎం(1), ఆమ్ ఆద్మీ పార్టీ(1)కి సైతం స్థానం కల్పించారు. అధికార ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీని నామినేట్ అయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చివరి వారానికి సంబంధించిన మొదటి రోజు నాటికి లోక్‌సభకు సమరి్పంచాల్సి ఉంటుంది.
జీత భత్యాల కోసం ఎమ్మెల్యేల ఎదురు చూపులు..
ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత.. జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కలిసి 48చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకొన్న భాజపా.. 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలకు పైగా గడిచింది. కాగా.. ఇంత వరకు ఎమ్మెల్యేలకు నెల జీతం కూడా రాలేదు. ఈ అంశాన్ని ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ దృష్టికి తీసుకెళ్లారు. వేతనాల జాప్యం దృష్ట్యా, ఎమ్మెల్యేల జీతాల చట్టపరమైన నిబంధనలకు సంబంధించి వివరణ కోరుతూ స్పీకర్ రాథర్ అధికారికంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై వెంటనే స్పందించి.. వివరాలు అందజేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల జీత భత్యాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టే అధికారం శాసనసభకు ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని సెక్షన్ 31 ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎమ్మెల్యేల జీతంపై స్వంత చట్టాన్ని రూపొందించే వరకు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఎమ్మెల్యేల జీతాలను నిర్ణయిస్తారు. జీతాలు, అలవెన్సుల్లో మార్పులు చేసేహక్కు అసెంబ్లీకి ఉంది.
700 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక.. పదిరోజుల్లో రెండోది
రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. బోరుబావి 700 అడుగుల లోతు ఉంది. మొదట్లో దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న బాలిక ఒక్కసారిగా జారి కిందకు వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భూపేంద్ర చౌదరి కుమార్తె చేతనా చౌదరి ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కాలు జారి తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా.. బోరుబావి దగ్గర జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. కాగా.. బోరు బావిలో పడ్డ చిన్నారికి బోర్‌వెల్‌లోని పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అయితే.. బోరు బావిలో రాళ్లు ఉండటంతో బాలిక 150 అడుగుల లోతులో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. చిన్నారిని బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బోర్‌వెల్‌లో కెమెరాలు, మైక్‌లు అమర్చి.. బాలిక కదలికను పర్యవేక్షిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
భారతీయ సినిమా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మరణించారు. శ్యామ్ బెనెగల్ 23 డిసెంబర్ 2024న తుది శ్వాస విడిచారు. శ్యామ్ బెనెగల్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:00 గంటలకు శ్యామ్ బెనగల్ ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. శ్యామ్ బెనగల్ మరణవార్తతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అందుతున్న సమాచారం సమాచారం ప్రకారం, ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మంగళవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయన 50 సంవత్సరాలకు పైగా పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేశారు. శ్యామ్ సుందర్ బెనెగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సినిమా ప్రపంచంలోకి రాకముందు ఎకనామిక్స్ చదివిన తర్వాత ఆయన ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రపంచంలో, ఆయన సినిమా ఆర్ట్ కి పితామహుడిగా కూడా పరిగణించబడతారు. హిందీ చిత్ర పరిశ్రమ వైపు మళ్లడానికి ముందు, ఆయన అనేక యాడ్ ఏజెన్సీలలో పనిచేశాడు. ‘అంకుర్’ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్యామ్. ఆ మొదటి సినిమా 43 అవార్డులను గెలుచుకుంది. దీని తర్వాత ‘మంథన్’, ‘కలిగ్’, ‘నిశాంత్’, ‘ఆరోహణ్’, ‘జునూన్’ వంటి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను రూపొందించాడు.
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను రేపు పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.
మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ
మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. వినయ్ అనే వ్యక్తిపై కూడా మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు. ప్రధానంగా విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలో సంచలన అంశాలు
మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు. మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలోని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మంచు విష్ణుతో పాటు.. తన అనుచరుల నుంచి నాకు, నా భార్యకు, నా పిల్లలకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. నా కుటుంబంపై కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం, ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని.. దీన్ని బయట పెట్టినందుకు తనపై కుట్రలు పన్నారని మనోజ్ ఫిర్యాదులో తెలిపాడు. తనను చంపుతానని బెదిరించారని.. తల్లిదండ్రులు లేని తన భార్యను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నాడు. “నన్ను, నా భార్య, నా పిల్లల పై దాడికి ప్రయత్నించారు.. అప్పుడే నేను 100కి కాల్ చేసాను. కిరణ్, విజయ్ రెడ్డి మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నాపై దాడి చేసిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ దొంగిలించారు. నాపై దాడి జరిగిన సాక్ష్యాలు లేకుండా చేసారు.. దాడి జరిగినప్పటికీ, నా కుటుంబ సభ్యులపై నేను ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. నా భార్యను గొడవల్లోకి లాగారు.. మా నాన్న చేసిన చర్యలతో నేను తీవ్రంగా బాధపడ్డాను. నా ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపి వేయమని నేను రాసినట్టు ఫేక్ లెటర్ విద్యుత్ శాఖకి పంపారు. నా ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా మానసికంగా హింసిస్తున్నారు. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.” అని మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.