ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
*రాష్ట్రంలో 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
*నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
*లోకాయుక్త చట్ట సవరణ బిల్లు కు మంత్రివర్గం ఆమోదం
*లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చ
*పార్లమెంట్ లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం
*దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
*కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు నిర్ణయం
*ఈగల్ పేరు తో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం
*కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు పునరుద్ధరించాలని నిర్ణయం
*ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయాలని నిర్ణయం
*అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం
*కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు
*స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం.
*విజయవాడ విశాఖ మెట్రో రైల్ కు 100 శాతం కేంద్ర నిధులతో నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
రేపు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్‌లో జరుగుతున్న ‘భక్తి టీవీ’ కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి దీప ప్రజ్వలన చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా కోటి దీపోత్సవంలో పూరి జగన్నాథుని పూజా కార్యక్రమంతో పాటు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం జరగబోతోంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. ఈ సారి భక్తి టీవీ కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. 14 ఏళ్లుగా ప్రతీ ఏడాది కార్తీక మాసంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారు. ప్రతి రోజూ దేశంలోని వివిధ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి కల్యాణాలు జరపించడంతో పాటు ఒకేసారి వేలాది మంది లక్షల దీపాలను వెలిగించడం ద్వారా కోటి దీపోత్సవం ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోని సుప్రసిద్ధ పీఠాల అధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు కోటి దీపోత్సవ వేడుకలకు హాజరవుతారు. శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రవిశంకర్, చినజీయర్ స్వామి, జగద్గురు కంచికామకోటి పీఠాధిపతి, పూరి పీఠాధిపతి, బాబా రామ్‌దేవ్, గణపతి సచ్చిదానందతో పాటు పలువురు పీఠాధిపతులు గడిచిన 14 ఏళ్లుగా కోటి దీపోత్సవ వేదికపై ప్రజలకు భక్తి సందేశాలిచ్చారు. ఈ ఏడాది కూడా పీఠాల అధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. చలిని కూడా లెక్కచేయకుండా వేల మంది ప్రజలు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. అలాగే సల్మాన్‌ఖాన్, షారూఖ్‌ఖాన్‌తో సహా పలువురు నటులు ఓటు వేశారు. మహారాష్ట్రలో దాదాపు 58.22 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. చివరి రెండు గంటల్లో ఓటర్లు పోటెత్తారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం మాత్రం కొంచెం మందకొడిగా సాగింది. సాయంత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. ఇక జార్ఖండ్‌లో జరిగిన రెండో విడత పోలింగ్‌లో భారీగానే ఓటింగ్ శాతం నమోదైంది. దాదాపు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా వార్తలు అందుతున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో బుధవారం పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడత నవంబర్ 13న 48 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సెకండ్ విడత బుధవారం 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో జార్ఖండ్ ఓటర్లు పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదలకానున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమినే హవా నడుస్తోంది. మహారాష్ట్రలో తిరిగి మహాయుతి కూటమి విజయం సాధిస్తోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగే జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమినే జయకేతనం ఎగురవేయబోతుంది. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌ల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్‌లో సంచలనం..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అంచనా:
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉంటే, మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహయుతి కూటమి( బీజేపీ-ఏక్‌నాథ్ షిండే- అజిత్ పవార్ ఎన్సీపీ) సగటున 182 (175-195) స్థానాలు కైవసం చేసుకుంటుందని, అదే సమయంలో మహా వికాస్ అఘాడీ( కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ ఎన్సీపీ) 97 (85-112), ఇతరులు 9(7-12) స్థానాలు సాధిస్తాయని వెల్లడించింది.
* మహారాష్ట్రలో 113 (102-120) సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
* శివసేన(ఏక్‌నాథ్ షిండే) పార్టీ 52(42-61), ఎన్సీపీ అజిత్ పవార్ 17(14-25) స్థానాలు సాధించే అవకాశం ఉంది.
* కాంగ్రెస్ 35(24-44), శివసేన (యూబీటీ) 27 (21-36), ఎన్సీపీ (శరద్ పవార్) 35 (28-41) స్థానాలు సాధిస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేశాయి.
* మహాయుతి 49.8 శాతం, మహావికాస్ అఘాడీ 40.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
* పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని చూసుకుంటే.. బీజేపీ 31.3%, శివసేన ( ఏక్‌నాథ్ శిండే) 14.5%, ఎన్సీపీ (అజిత్ పవార్) 4% ఓట్లు పొందే అవకాశం ఉంది
* కాంగ్రెస్ 13.7%, శివసేన (యూబీటీ) 13%, ఎన్సీపీ (శరద్ పవార్) 10.1%, ఇతరులు 13.4% ఓట్లు పొందే అవకాశం ఉంది.
* ముఖ్యమంత్రి ప్రాధాన్యతలో ఏక్‌నాథ్ షిండేకు 35.8 శాతం, ఉద్దవ్ ఠాక్రేకు 21.7%, దేవంద్ర ఫడ్నవీస్‌కు 11.7%, రాజ్‌ఠాక్రేకు 2.9%, అజిత్ పవార్‌కు 2.3%, జయంత్ పాటిల్‌కు 2.1%, నానా పటోలేకు 1.3%, ప్రకాశ్ అంబేద్కర్‌కు 1.3% మద్దతు లభించింది
* ఎంఐఎం, వీబీఏ, బీవీఏ, ఎమ్ఎన్ఎస్ వంటి చిన్న పార్టీలు సీట్లు సాధించడంలో వెనకబడినా, గణనీయంగా ఓట్లను చీల్చగలిగాయి.
* రైతులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు మహాయుతి వైపు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు మహా వికాస్ అఘాడీకి మద్దతు నిలిచారు.
* లడ్కీ బహన్ యోజన పథకం మహాయుతికి ప్లస్ అయింది.
* లోక్‌సభ ఎన్నికల్లో విదర్భ, ముంబాయి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు మారడంతో మహాయుతికి అవకాశాలు మెరుగయ్యాయి
* బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం మహాయుతికి తోడ్పడింది.
గయానాలో ప్రధాని మోడీ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ప్రధాని మోడీ గయానాలో పర్యటిస్తున్నారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీకి విమానాశ్రయంలో రాష్ట్రపతి ఇర్ఫాన్ అలీ, ప్రధానమంత్రి మార్క్ ఆంథోనీ ఫిలిప్స్, సీనియర్ మంత్రులు, ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని మోడీ గయానా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీతో మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనంతరం గయానా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అలాగే భారతీయులను కూడా కలిసి ముచ్చటించనున్నారు. మూడు దేశాల పర్యటన కోసం నవంబర్ 16న నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలకు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్లారు. తొలుత నైజీరియాలో మోడీ పర్యటించారు. అనంతరం అక్కడ నుంచి జీ 20 సదస్సుకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఆయా దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై చర్చించారు. ప్రస్తుతం మోడీ గయానాలో పర్యటిస్తున్నారు. బుధ, గురువారాల్లో గయానాలో పర్యటించనున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించటం ఇదే తొలిసారి. పర్యటన అనంతరం భారత్‌కు బయల్దేరి రానున్నారు.
ఉక్రెయిన్‌లో టెన్షన్ వాతావరణం.. యూఎస్ ఎంబసీ మూసివేత
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాపై అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యాకి ఉత్తర కొరియా సైన్యం కలిసింది. మరోవైపు అణు దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఇంకోవైపు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ నిపుణులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. రష్యాపై ప్రయోగించింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..
భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. దీంతో.. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. మొత్తంగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ మూడోసారి గెలుచుకుంది. అంతకుముందు 2023లో రాంచీలో, 2016లో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. భారత మహిళల జట్టు హరేంద్ర సింగ్ హయాంలో (ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విజయంపై.. భారతీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఘోర పరాజయం పాలైన భారత మహిళల హాకీ జట్టు.. ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా అత్యుత్తమ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఆడిన ఏడు గేమ్‌ల్లో గెలుపొందింది. గ్రూప్ దశలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో జపాన్‌ను 2-0తో ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన చైనా.. టోర్నీలో అత్యధిక ర్యాంక్ సాధించిన జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో చైనా తన 5 పూల్ గేమ్‌లలో 4 గెలిచింది. సెమీస్‌లో మలేషియాను 3-1 తేడాతో ఓడించింది.
నెంబర్-1 ఆల్ రౌండర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నెంబర్-1 స్థానంలోకి అడుగుపెట్టాడు. హార్దిక్ మరోసారి టీ20 ఆల్‌రౌండర్‌గా నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీలను వెనక్కినెట్టి నెంబర్ వన్‌కు ఎగబాకాడు. హార్దిక్ ప్రస్తుతం 244 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. లివింగ్‌స్టోన్ 230 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. దీపేంద్ర సింగ్ ఐరీ (230) రెండో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో హార్దిక్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో రెండు వికెట్లు తీశాడు. భారత్ 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.. మరోవైపు.. బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో యువ క్రికెటర్ తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి వచ్చాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజంలను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. తిలక్ ఖాతాలో 806 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో, నాలుగో టీ20లో అతను అజేయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ 280 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. సూర్య 788 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. బాబర్ (742)ఐదవ స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి, నాలుగో మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. మరోవైపు.. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ (మూడు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్), హెన్రిచ్ క్లాసెన్ (ఆరు స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్) ఉన్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ (మూడు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్), వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్ (16 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంక్), ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ (10 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్) వచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ (855) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా (693), నాథన్ ఎల్లిస్ (628) వరుసగా మూడు, 11వ స్థానాల్లో నిలిచారు. ఇటీవలే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేసింది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (656) మూడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అతని ప్రదర్శన ఆధారంగా, అతను తన కెరీర్‌లో కొత్త అత్యధిక రేటింగ్‌ను సాధించాడు. దక్షిణాఫ్రికాపై అర్ష్‌దీప్ ఎనిమిది వికెట్లు తీశాడు. టాప్-10లో భారత్ బౌలర్లు ఇద్దరు ఉన్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ (666) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (701) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత వనిందు హసరంగా (696) ఉన్నాడు.