శ్రీవారి సేవలో సీఎం కేసీఆర్ సతీమణి..
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆమెకు ఆహ్వానం పలికి.. దగ్గరుండి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.. ఇక, స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు కేసీఆర్ సతీమణి శోభ.. శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించుకున్నారామె.. మరోవైపు.. శ్రీవారి దర్శనం ముగించుకొని శ్రీకాళహస్తికి బయల్దేరి వెళ్లారామె. శ్రీవారి దర్శనం కోసం నిన్న సాయంత్రమే తిరుమలకు చేరుకున్నారు శోభ.. ఆమె వెంట కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు..
బిర్యానీ ఇష్టంగా లాగించారు.. 13 మంది అస్వస్థతకు గురయ్యారు..
బిర్యానీ అంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు.. ఆ బిర్యానీయే 13 మంది యువకులను ఆస్పత్రిలో చేరేలా చేసింది.. విశాఖలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాజువాకలో కల్తీ ఆహారం తిని 13 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. స్థానికంగా ఉన్న మండి క్రూడ్ హోటల్లో బిర్యానీ తిన్న 13 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది.. బాధితులంతా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు పరిధి ములగాఢ గ్రామానికి చెందిన యువకులు.. ఆదివారం రాత్రి భోజనం చేసి ఇంటికి వచ్చిన వారిలో 13 మందికి సోమవారం వేకువ జామున 4 గంటల ప్రాంతం నుంచి వాంతులు వీరేచనలు మొదలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నతర్వాత వారిని తీరిగి ఇంటికి తీసుకెళ్లారు.. అయితే, ఇంటికి వెళ్లిన అనంతరం మరల అదే పరిస్థితి.. దీంతో.. హుటాహుటిన సమీపంలోని సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఇష్టంగా బిర్యానీ తిని 13 మంది యువకులు తీవ్ర అస్వస్థతకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇక నారా లోకేష్ వంతు..! నేడు సీఐడీ ముందుకు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఆయన బెయిల్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడంలేదు.. మరోవైపు స్కిల్ స్కామ్ తో పాటు.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు పేరును పేర్కొంది సీఐడీ.. మరోవైపు ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు లోకేష్.. ఉదయం 10 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ని ఏపీ సీఐడీ ప్రశ్నించనుంది.. ఈ కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొన్న సీఐడీ.. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేసింది. లోకేష్‌ను సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నట్టు హైకోర్ట్‌కు సీఐడీ తెలిపింది.. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన లోకేష్‌ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చింది.. హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని తన నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.
నేడు ఈడీ విచారణకు హీరో నవదీప్… లావాదేవీలపై ఆరా తీయనున్న అధికారులు
డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈడీ అధికారులు 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. నేడు మరోసారి హీరో నవదీప్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా నవదీప్ విచారణకు హాజరుకాలేదు. ఇటీవల గుడిమల్కాపూర్ డ్రగ్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు విచారించారు. నవదీప్‌కు నైజీరియన్ డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటికే బెంగళూరులో పలువురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నవదీప్ మొబైల్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై ఇవాళ ఈడీ అధికారులు ఆరా తీస్తారు. అయితే ఈడీ ఎదుట నవదీప్ హాజరవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నవదీప్ ను ప్రశ్నించే క్రమంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..NTPCలో భారీగా ఉద్యోగాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది.. తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే NTPC ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది.. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఆసక్తి ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ సంబంధిత బ్రాంచ్ నుండి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి.. అభ్యర్థులు గేట్ 2023 పరీక్షకు హాజరు కావాలి. సంబంధిత పోస్ట్‌లో BE/B.Tech 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ ని కలిగి ఉండాలి.. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు 65% మార్కులు పొందిన వారు అర్హులు.. అదే విధంగా SC/ST/PH అభ్యర్థులకు 55% మార్కులను సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో ఉంది..
నన్ను కొట్టనందుకు చాలా థాంక్స్.. బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్! వీడియో వైరల్
సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ మెరుపు షాట్ ఆడాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో డచ్ పేసర్ వాన్ మీకెరెన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్‌లను గిరాటేసింది. బంతి కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్‌లను తాకింది. ఇది చూసిన మీకెరెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బంతి తనకు తాకనందుకు పేసర్ వాన్ మీకెరెన్ సంతోషించాడు. అందుకే బ్యాటర్ డారెల్ మిచెల్‌కు చేతులు జోడించి నమస్కరించాడు. ఇది చూసిన మిచెల్ పేర్లదు అన్నారు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్.. మీకెరెన్ చేసిన పని అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నన్ను కొట్టనందుకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియో చూసిన ఫాన్స్ తృటిలో పెను ప్రమాదం తప్పింది అని కామెంట్స్ చేస్తున్నారు.
అభిమానులకు షాకింగ్ న్యూస్.. హాస్పిటల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్!
భారత అభిమానులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో గిల్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడట. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు మాత్రమే కాదు.. దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడం ప్రస్తుతం అనుమానంగా మారింది. డెండ్యూ ఫీవర్ కారణంగా శుభ్‌మన్ గిల్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గిల్ స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో హాస్పిటల్‌లో ఉన్న గిల్.. బుధవారం న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనంతరం రెండు రోజుల గ్యాప్ తర్వాత (అక్టోబర్ 14) జరిగే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. అయితే పాక్‌తో మ్యాచ్ సమయానికి గిల్ పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు.
లియో మూవీ లో రాంచరణ్.. ప్రూఫ్ దొరికిందిగా..
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.ఆయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో కనిపించాడన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి గతంలో ఓసారి ఈ వార్త వినిపించిన తర్వాత ఫేక్ అని తేలిపోయింది..కానీ తాజాగా రాంచరణ్ పేరు మరోసారి లియో మూవీతో లింకవడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. అందులో ఓ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ లియో మూవీలోని నటీనటుల వివరాలు చెబుతూ.. రామ్ చరణ్ పేరు కూడా రాయడం గమనార్హం. ఈ వెబ్‌సైట్లోని సమాచారం తప్పయ్యే అవకాశం కూడా ఉన్నది.కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం అభిమానులకు పండగనే చెప్పాలి.దళపతి విజయ్, రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు పండుగ లా ఉంటుందనడంలో సందేహం లేదు.