ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్..
ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ప్రతిసారీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ముందు ఈ ఆలయంలో పూజలు చేసేందుకు కేసీఆర్ వస్తుంటారు. ఈసారి బీఆర్‌ఎస్ సమావేశాల పరంపర జరగనుంది. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయం సీఎం కేసీఆర్‌కు, పార్టీకి సెంటిమెంట్. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్, హరీశ్ రావు తదితర పార్టీల నేతలు వెంకన్నను దర్శించుకుని స్వ మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు వేసి పూజలు చేస్తారు. 1985 నుంచి ప్రతి ఎన్నికల ముందు శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఆలయ ప్రవేశం దక్షిణం వైపు ఉంది. ఇలాంటి దక్షిణాభిముఖ దేవాలయాలు చాలా అరుదు. అదొక స్పెషాలిటీ అని కూడా చెప్పొచ్చు. పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్ రావు ఆలయాన్ని రూ. 3 కోట్లకు పైగా వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం, మూలవిరాట్, ప్రహరీ నిర్మాణాలు చేపట్టారు. ఫిబ్రవరి 2022లో ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో మరో రూ.50 లక్షలతో కల్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ విజయం సాధించారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందున 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఈ ఆలయంలో పూజలు చేసి నామినేషన్లు వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించాడు. 2001లో సీఎం కేసీఆర్ టీడీపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఈ ఆలయంలో పూజలు చేసి టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీని ప్రకటించడం మరో విశేషం.
తిరుపతిలో ఐటీ దాడుల కలకలం..
తిరుపతిలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలోనూ ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.. డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సి దివాకర్ రెడ్డి.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం రోడ్డులోని పురంధర కాంప్లెక్స్ లోని డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో ఫైల్ లను పరిశీలిస్తున్న అధికారులు. ఏకకాలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి కార్యాలయం తోపాటు ఇంట్లో, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతీ పత్రాలను పరిశీలిస్తున్నారు..
నేడు చలో జల విహార్ సభ.. హాజరు కానున్న మంత్రి కేటీఆర్
నాంపల్లి కోర్టు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభకు మంత్రి కేటీఆర్ హాజరవుతారని, బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా ‘చలో జలవిహార్’ పేరిట నిర్వహించే సభలో న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాంపల్లి కోర్టులో న్యాయవాదులకు బీఆర్‌ఎస్ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా హాజరుకానున్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. న్యాయవాదుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ జలవిహార్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశం ద్వారా సీనియర్ న్యాయవాదులు, న్యాయ సోదర సోదరీమణులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా గడపనున్నారు. న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు న్యాయవాదులందరూ సహకరించాలని మంత్రి కోరనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మోదీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్-బీటీఎం పిలుస్తారని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి బీజేపీ బీటీఎంపై నిరాధార ఆరోపణలు చేస్తారు. నిజానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల ఏ-టీమ్. తెలంగాణ ప్రజలు ఢిల్లీ నేతలకు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారని, ఇక వారిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈసారి తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఓ ఇటర్వ్యూలో కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
దీపావళి రద్దీ.. ప్రత్యేక రైళ్లు
పండుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతీసారి ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లను నడిపే విషయం విదితమే.. అయితే, దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది దక్షిణ రైల్వే.. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.. ఈ నెల 13, 20, 27 తేదీల్లో 06073 డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ ప్రత్యేక రైలు నడపనుంది.. రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరనున్న ఈ రైలు మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఇక.. ఈ నెల 14, 21, 28 తేదీల్లో 06074 భువనేశ్వర్-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు.. రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకోనుంది.. ఈ రైళ్లు గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు స్టేషన్లలో ఆగుతాయని తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే.. ఇక, చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది రైల్వే శాఖ.. ఈ నెల 11, 18, 25 తేదీల్లో 06071 డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ రైలు నడవనుంది.. ఆ తేదీల్లో చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మూడవ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకోనుంది.. 13, 20, 27 తేదీల్లో 06072 నంబర్ కలిగిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. సంత్రాగచ్చిలో తెల్లవారుజామున 5 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకోనుంది.. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయని తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే.
నేపాల్‌లో అప్పటి భూకంపానికి 9000 మంది మృతి.. 10బిలియన్ డాలర్లకు పైగా నష్టం
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉంది. దీని ప్రభావం ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపించింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చారు. ఒకటిన్నర నిమిషాల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఏప్రిల్ 2015 లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందులో సుమారు 9,000 మంది మరణించారు. 23 వేల మందికి పైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా ఐదు లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2015లో దాదాపు 2 రోజుల పాటు భూమి అడపాదడపా కంపించింది. ఈ భూకంపం అనేక పట్టణాలు, శతాబ్దాల పురాతన దేవాలయాలను పూర్తిగా నాశనం చేసింది. భూకంపం కారణంగా నేపాలీ ఆర్థిక వ్యవస్థ 10 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. కోలుకుని దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు చాలా సమయం పట్టింది.
గాజాలో మరో ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి..15 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు
ఇజ్రాయెల్ నిరంతరం గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. తాజగా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం మొదట ఆసుపత్రి సమీపంలోని అంబులెన్స్ సమీపంలో బాంబు దాడి చేసింది. హమాస్ తమ యోధుల కోసం అంబులెన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అంబులెన్స్‌ను గుర్తించిన తర్వాత దానిపై దాడి చేశారు. ఈ దాడిలో హమాస్ యోధులు మరణించారని ఐడీఎఫ్ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాదులను, ఆయుధాలను అంబులెన్స్‌లో తరలిస్తోందని, అందుకే దానిని గుర్తించి లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఈ ఆరోపణ నిరాధారమని హమాస్ పేర్కొంది. అంబులెన్స్‌లను ఉగ్రవాద యోధులు ఉపయోగిస్తున్నారని హమాస్, అల్-షిఫా ఆసుపత్రి అధికారులు ఖండించారు. అయితే, అంబులెన్స్‌లను హమాస్ యోధులు ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ఆధారాలు అందించలేదు. ఇజ్రాయెల్ సైన్యం మాట్లాడుతూ.. ఇక్కడి పౌరులు తమ భద్రత కోసం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని పదే పదే కోరుతున్నారు. ఇంతకుముందు ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో 500 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. హమాస్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. గాజాలోకి ఇంధన ప్రవేశంపై నిషేధం గురించి మాట్లాడామని ఆయన అన్నారు. అతను గాజాలో కాల్పుల విరమణను సున్నితంగా తిరస్కరించాడు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసే వరకు యుద్ధాన్ని ఆపడానికి తాను అంగీకరించబోనని నెతన్యాహు చెప్పారు. గాజాకు ఇంధనం, డబ్బు పంపడాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుందని ఆ దేశ పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో నెతన్యాహు చెప్పారు.
15 మంది ప్లేయర్స్ మాత్రమేనా.. ప్రపంచకప్‌కు మంచిది కాదు: ప్యాట్ కమిన్స్
వన్డే ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగే టోర్నీ అని, ఒక్కో జట్టుకు 15 మంది ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం సరికాదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ వ్యవధిని దృష్టిలో ఉంచుకుని.. ఒక్కో జట్టు 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లను తీసుకునేలా అనుమతించాలని ఐసీసీని కోరాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రపంచకప్ కోసం ఒక్కో జట్టు 15 మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. ప్రస్తుతం చాలా జట్లు గాయాల బారిన పడి సతమతం అవుతున్నాయి. ముఖ్యంగా న్యూజీలాండ్, ఆస్ట్రేలియా టీమ్స్. ఈ నేపథ్యంలోనే 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలని కమిన్స్ కోరుతున్నాడు. గాయంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్, వ్యక్తిగత కారణాల కారణంగా మిచెల్ మార్ష్ స్వదేశం వెళ్లడంతో వారు జట్టుకు దూరమయ్యారు. ఈ ఇద్దరు జట్టుకు కీలకం అన్న విషయం తెలిసిందే. ‘వన్డే ప్రపంచకప్ దాదాపు రెండు నెలల పాటు సాగుతుంది. న్యూజిలాండ్ జట్టు లాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరు. కివీస్ జట్టు గాయాలతో సతమతం అవుతోంది. అయితే అదృష్టవశాత్తూ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను జట్టుతోనే ఉన్నాడు. కానీ అతడిని తప్పించాల్సి వస్తే.. అలాంటి పరిస్థితి క్రికెట్‌కు లేదా ప్రపంచకప్‌కు మంచిది కాదు. మ్యాచ్ కోసం అవసరమైన ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండాలి’ అని కమిన్స్ అన్నాడు.
ఆ రెండు టీమ్స్ గెలిస్తే.. నాలుగు జట్లు ఔట్! నేడు డబుల్ ధమాకా
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా క్రికెట్ అభిమానులకు నేడు డబుల్ ధమాకా ఉంది. నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం ఉదయం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. మధ్యాహ్నం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సెమీస్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో నేటి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులకు మంచి వినోదాన్ని పంచె అవకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన ఆస్ట్రేలియా.. సెమీస్ బెర్త్ లక్ష్యంగా నేడు బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి విమర్శల పాలైన ఆసీస్.. బలంగా పుంజుకుని వరుసగా నాలుగు విజయాలు అందుకుంది. వరుస విజయాలతో సెమీస్ అవకాశాలను బాగా మెరుగుపరుచుకుంది. ఇంగ్లండ్‌పై గెలిస్తే ఆసీస్ మరో అడుగు ముందుకేస్తుంది. అందుకే గెలుపే లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది. అయితే గాయంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్, వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి.. దాదాపుగా సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లీష్ జట్టు పరువు కోసం పోరాడనుంది. ఎలాగూ సెమీస్ చేరే అవకాశం లేదు కాబట్టి.. ఇంగ్లండ్ తెగించి ఆడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆసీస్‌కు విజయం అంత తేలిక కాకపోవచ్చు.