కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు ఇవే..
దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నులపండుగా సాగుతోంది.. కోటిదీపోత్సవం వేదకిగా ఎనిమిదో రోజు నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం. కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం ఇలా ఇల కైలాసంలో అన్ని కార్యక్రమాలు వైభవంగా సాగాయి.. ఇక, కోటిదీపోత్సవం వేదికగా ఇవాళ తొమ్మిదో రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
* శ్రీ వేంకటేశ్వరస్వామికి మహాభిషేకం
* భక్తులే ఆచరించి తరించేలా అన్నవరం ఆలయ అర్చకులచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం
* అన్నవరం శ్రీసత్యదేవుని కల్యాణం
* స్వామి, అమ్మవార్లకు గరుడ సేవ
* కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం
* కేరళకాసరగోడ్ యడనీరు మఠం శ్రీసచ్చిదానంద భారతిస్వామి అనుగ్రభాషణం
* బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనామృతం
* అద్వితీయ భక్తినీరాజనాలు
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు రాష్ట్రపతి.. నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది.. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సత్యసాయి డీమ్డ్ వర్సిటీ.. అయితే, ఆ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి గవర్నరు అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలు అందించనున్నారు. సత్యసాయి జిల్లా పర్యటన కోసం రాష్ట్రపతి మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకోనున్నారు.. ఇక, 3.05 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు స్నాతకోత్సవంలో విద్యార్థులకు డాక్టరేట్లు, బంగారు పతకాలు అందజేయనున్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఇక, రాష్ట్రపతి, గవర్నర్ పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేశారు అధికారలు.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నేడు రాష్ట్రంలో పలువురు బీజేపీ జాతీయ నేతల ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రచారానికి మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇందులో భాగాంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పలువురు బీజేపీ జాతీయ నేతల ప్రచారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దర్శించుకోనున్నారు. ఇక, 6 గంటలకు చార్మినార్ బెలా క్రాస్ రోడ్ లో బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే, 7 గంటలకు ముషీరాబాద్ చౌరస్తాలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడనున్నారు. దీంతో పాటు బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య సైతం పలు చోట్ల ప్రచారం చేసేందుకు తెలంగాణకు వచ్చారు. మరో వైపు ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ పఠాన్ చెరువు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండగా.. కేంద్ర మంత్రి అర్జున్ ముండా వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ లో ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నారు. అలాగే, వరంగల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఇక, జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారం లో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పాల్గొనున్నారు. మరో వైపు మల్కాజ్ గిరి లో ఇంటింటి ప్రచారంలో తమిళ్ నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొననున్నారు.
అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న పోలీసులు.. ఉత్తమ్ ఆరోపణ
సూర్యాపేట జిల్లాలోరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న కొందరిని కిడ్నాప్ చేశారని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఎన్నికలను నిర్వహించేందుకు ఓ సంస్థకు బాధ్యతలకు అప్పగించామని.. ఆ సంస్థ ప్రతినిధులు విధి నిర్వహణలో ఉండగా వారిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిన్న ( మంగళవారం ) కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు పై పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటికే హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్ సర్కార్ పై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇప్పుడు చేసిన తప్పులకు అప్పుడు శిక్ష పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కపై (శిరీష) నిన్న దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. బర్రెలక్కకు సపోర్టుగా ప్రచారంలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి బర్రెలక్క పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఓట్లు చీలుతాయనే భయంతోనే తనపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని బర్రెలక్క ( శిరీష ) వ్యాఖ్యానించింది. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. కాగా, బర్రెలక్కపై దాడిని ఖండిస్తూ పలువురు ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు. బర్రెలక్కకు భద్రతను కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ సీజన్‌లో 38 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని కోట్ల వ్యాపారమో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..!
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి.. ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి మ్యారేజీలు మరింత ఊపందుకోనున్నాయి.. రేపటి నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దేశీయంగా పెద్ద సంఖ్యలు పెళ్లిళ్లు జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు.. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో 38 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగబోతున్నాయట.. పెళ్లిళ్లు అంటే మామూలు విషయమేమీ కాదు.. ‘ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు’ అనే సామెత కూడా ఉంది.. అంటే.. ఈ రెండింటికీ జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఇక, వారి ఆర్థికస్తోమతకు తగ్గట్టు ఈ రెండు కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న వస్తు, సేవలకు సంబంధించిన వాణిజ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ అంచనాకు వచ్చినట్లు కాయిట్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ పేర్కొన్నారు.
50 మంది బందీలకు బదులుగా 150 మంది పాలస్తీనా ఖైదీలు.. కుదిరిన డీల్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాల దృష్టి సారించాయి. ఈ యుద్ధం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావొస్తుంది. దాడుల్లో చాలా మంది ఇళ్లు ధ్వంసం కాగా చాలా మంది మరణించారు. ఇంతలో ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. బందీలుగా ఉన్న పౌరుల విడుదల కోసం హమాస్‌తో ఒప్పందంపై ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ అంగీకరించిందని తెలుస్తోంది. దీని ప్రకారం హమాస్ నాలుగు నుండి ఐదు రోజుల కాల్పుల విరమణకు బదులుగా బందీలను విడుదల చేయవచ్చు. హమాస్ రేపటి నుండి దశలవారీగా 50 బందీలను విడుదల చేయడం ప్రారంభించవచ్చు. ఈ బందీల్లో 20 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను కూడా విడిపించాల్సి ఉంటుంది. బందీల విడుదల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బందీల విడుదలపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా నుంచి అరబ్ దేశాల వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒప్పందానికి 45 రోజుల తరువాత ఈ ప్రయత్నం విజయవంతం అయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, బందీల విడుదల కోసం యుద్ధ కేబినెట్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఐసీసీ కీలక నిర్ణయం.. ఆలస్యం అయితే 5 పరుగుల పెనాల్టీ!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయోగాత్మకంగా ‘స్టాప్ క్లాక్’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను ఆరంభించడంలో ఫీల్డింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ స్టాప్ క్లాక్ పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో మాత్రమే అమలు చేయబడుతుంది. 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ స్టాప్ క్లాక్‌ను ఉపయోగించాలని ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. ‘పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా స్టాప్ క్లాక్‌ను ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆరు నెలల పాటు ట్రయల్ ప్రాతిపదికన ఇది పరీక్షించబడుతుంది. ఓవర్ల మధ్య సమయం వృథా కాకుండా చూడాలన్నదే మా ఉద్దేశం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య డిసెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో స్టాప్ క్లాక్‌ను మొదటిసారి ఉపయోగించనున్నారు.
చప్పుడు చెయ్యట్లేదు ఏంటి? మళ్లీ వాయిదానా?
చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయం ప్రతి ఒక్కరిలో ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి హైటెక్నీకల్ డైరెక్టర్, విక్రమ్ లాంటి హీరో, స్టైలిష్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ… ఇన్ని ఉన్నా కూడా ధృవ నక్షత్రం సినిమా కష్టాలు మాత్రం తీరట్లేదు. ఏడేళ్ల పాటు ఈ సినిమాలు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు కానీ సినిమా మాత్రం రిలీజ్ కావట్లేదు అనేది వాస్తవం. 2017 ఆగస్ట్ లో ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అప్పటి నుంచి వాయిదా పడుతూనే వస్తుందీ సినిమా. 2017 నుంచి 2018 ఏప్రిల్ కి వాయిదా పడిన ధృవ నక్షత్రం… ఆ తర్వాత 2018 దీపావళికి వాయిదా వేస్తున్నట్లు స్వయంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రకటించాడు. అప్పుడైనా ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించారు కానీ అవ్వలేదు. 2018 దీపావళికి కూడా మిస్ చేస్తూ 2019 నవంబర్ 15కి వాయిదా పడింది. ఈసారి కూడా షరామామూలే 2019, 2020, 2021, 2022లు డేట్స్ చెప్పడం వాయిదా పడడమే ఆనవాయితీగా మారింది. ధృవ నక్షత్రం సినిమాపైన ఉన్న హైప్ తగ్గడానికి కారణం ఇలా ఇన్నిసార్లు వాయిదాలు వేయడమే. కేవలం 2023లోనే మే, జులై, అక్టోబర్, నవంబర్ 10… ఇలా నాలుగు డేట్స్ మిస్ చేసిన ధృవ నక్షత్రం సినిమా ఇప్పుడు నవంబర్ 24న రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇక ఈసారి ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ అయిపోవడం పక్కా అనుకుంటున్న సమయంలో సడన్ గా ప్రమోషన్స్ సైలెంట్ అయిపోయాయి, పోస్టర్స్ కూడా బయటకి రావట్లేదు. దీంతో 48 గంటల్లో రిలీజ్ పెట్టుకోని మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు ఏంటి? ఈసారి కూడా ధృవ నక్షత్రం సినిమా వాయిదా పడుతుందా అనే ఆందోళనలో ఉన్నారు విక్రమ్ ఫ్యాన్స్… ఇన్నిసార్లు వాయిదా వేసే బదులు ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేసిన బాగుండు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈసారి అయినా మిస్ చేయకుండా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నక్షత్రం సినిమాని రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.
గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యేదెప్పుడో శంకరా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటీషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చరణ్ ఓల్డ్ లుక్స్ షూటింగ్ లొకేషన్స్ నుంచి లీక్ అయ్యి మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాయి. షూటింగ్ అయితే గత ఏడాదిన్నరగా జరుపుకుంటూనే ఉంది కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలోనే క్లారిటీ మాత్రం లేకుండా పోయింది. ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావట్లేదు, షూటింగ్ అప్డేట్స్ తెలియట్లేదు, రిలీజ్ చేస్తామన్న సాంగ్ ని వాయిదా వేశారు… ఇలా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకూ ఒక్క సాలిడ్ స్టఫ్ కూడా రిలీజ్ కాలేదు. ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే… ఆ ఒక్కటి అడక్కు అనే రేంజులో సమాధానాలు వినిపిస్తున్నాయి. 2024 సమ్మర్ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం… గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే కాస్త బ్రేక్ తీసుకోని… చరణ్ ఆర్సీ 16 స్టార్ట్ చేయనున్నాడట. బుచ్చిబాబు వచ్చే సమ్మర్ లోపు RC 16 రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈసారైనా గేమ్ చేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయి… ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.