ఏడోరోజుకు చేరిన కోటి దీపోత్సవం.. తొలి కార్తిక సోమవారం నాడు విశేష కార్యక్రమాలు ఇవే|
భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది.. ఆరో రోజులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో కోటిదీపోత్సవంలో పాల్గొన్నారు.. దీంతో.. కోటిదీపోత్సవం వేదికగా భక్తులతో కిటకిటలాడింది.. ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసంగా మారిపోయింది. శివనామస్మరణతో పరిసర ప్రాంతాల్లో మార్మోగాయి.. కోటి దీపోత్సవం -2023లో 6వ రోజు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం కన్నులపండుగా సాగింది..
ఇక, తొలి కార్తిక సోమవారం నాడు కోటిదీపోత్సవం వేదికగా విశేష కార్యక్రమాలు జరగనున్నాయి..
* భక్తులచే నర్మదా బాణలింగానికి కోటిభస్మార్చన
* కోటిదీపోత్సవం వేదికగా తొలిసారిగా అగ్నిలింగక్షేత్రం తిరువణ్ణామలై శ్రీఅరుణాచలేశ్వరస్వామి కల్యాణం
* ఆది దంపతులకు నందివాహన సేవ
* కంచికామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం
* శివగంగ మఠాధిపతి శ్రీపురుషోత్తమ భారతి మహాస్వామి ఆశీర్వచనం
* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృతం
* కోటిదీపాల వెలుగులు
* సప్తహారతుల కాంతులు
* లింగోద్భవ వైభవం
* మహాదేవునికి భక్తిపూర్వక నిరాజనం
కార్తిక మాసం మొదటి సోమవారం.. గోదావరి నదికి భక్తుల తాకిడి
కార్తిక మాసం అంటేనే ఎంతో ప్రత్యేకత.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తిక మాసంలో స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది స్కంద పురాణం చెబుతుంది.. ‘న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.” అని పేర్కొన్నారు.. అంటే కార్తికమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. అని అర్థం.. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చు అని వారి విశ్వాసమం.. ఇక, కార్తికమాసంలో తొలి సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని చెబుతారు.. ఈ సందర్భంగా గోదావరి నది భక్తులతో కిటకిటలాడుతోంది.. కార్తిక మాసంలో మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాదిగా తరలివచ్చి భక్తులు గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిసాయి. భక్తులు స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లను మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు.
నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం కేసీఆర్.. శివారెడ్డిపల్లిలో భారీ బహిరంగ సభ
సీఎం కేసీఆర్ ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్-వరంగల్ హైవేలోని మేడికొండ క్రాస్ రోడ్డు వద్ద శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సభా వేదిక వద్దకు రానున్నారు. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష మందికి పైగా ప్రజలు రానున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నాయకులు బహిరంగ సభ వేదికను పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మానకొండుర్ నియోజకవర్గం తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు.
నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటన.. రోడ్ షో పాల్గొననున్న టీపీసీసీ
ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతిరోజు కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న ఈ ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈరోజు కూడా రేవంత్ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నరసపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్, 3 గంటలకు పరకాల, సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్, రాత్రి 8 గంటలకు నాంపల్లిలో జరిగే రోడ్ షోలు, సభల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్. కాగా ఇవాళ భారీ బహిరంగ సభా స్థలిని కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని నేతలకు సూచించారు. సభను విజయవంతం చేయాలని అన్నారు. నేతలంగా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
తెలంగాణ ఎన్నికలు.. భారీగా చేతులు మారుతున్న హవాలా మనీ..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో హవాలా మనీ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. వేల కోట్లు చేతులుమారుతున్నాయి.. ఎక్కడికక్కడ తనిఖీల్లో కోట్లాది రూపాయలు పట్టుపడుతున్నాయి.. ఇప్పటికే వందల కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. తాజాగా, హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద పట్టుబడిన 7.4 కోట్ల రూపాయల నగదు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మంకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పా జంక్షన్ వద్ద పట్టుబడిన నగదును.. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఓ విద్యాసంస్థల ఛైర్మన్‌కు చెందిన ఫాంహౌస్ నుంచి తరలించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఫామ్‌హౌస్‌తో పాటు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక పత్రాలతో పాటు లాకర్ కీలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నేత కోసం ఈ నగదును తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు.
రాష్ట్రానికి యూపీ సీఎం, కేంద్రమంత్రి.. ఈనెల 24, 25, 26లో ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 30న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహిస్తున్నాయి. తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణలో పర్యటన ఖరారైంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. హుజూరాబాద్, మహేశ్వరం సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు అస్సాం సీఎం, గోవా సీఎంలు కూడా వచ్చే వారం తెలంగాణకు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారాన్ని కూడా మోడీతోనే ముగించాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం వచ్చేవారం మళ్లీ మోడీ తెలంగాణకు వస్తారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఇవాళ మరోసారి ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో జరిగే రోడ్ షోలో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. మరో బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో గడ్కరీ ప్రసంగించనున్నారు. మరో బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి తరపున పడ్నవీస్ రోడ్ షోలో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పీయూష్ గోయల్ ఈ నెల 21న తెలంగాణకు వస్తున్నారు. రెండు సభల్లో కూడా పాల్గొంటాడు.
ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి.. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన AQI కారణంగా.. ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు సెలవు ప్రకటించింది. ఇప్పుడు గాలి నాణ్యత మెరుగుపడిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం నేటి నుండి తెరవాలని నిర్ణయించింది. నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకుంటాయి. ఇందులో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులు ఫిజికల్ మోడ్‌లో నిర్వహిస్తారు. అయితే, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను మూసివేయాలని నిర్ణయించాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని, అందుకే చిన్న పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది.
చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు.. ఇస్రో కీలక ప్రాజెక్టు
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగింది. చంద్రయాన్-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది. ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను పంపనున్నారు. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగుతుంది. చంద్రయాన్-3 మిషన్ జీవిత కాలం ఒక లునార్ డే కాగా, చంద్రయాన్-4..ఏడు లునార్ డేలు పనిచేస్తుంది. లూపెక్స్, చంద్రయాన్ 4 ప్రాజెక్టుల ద్వారా 350 కిలోల ల్యాండర్‌ను చంద్రుడి చీకటివైపు ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్‌ను దించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు లాంచ్ వెహికల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. చంద్రయాన్-4 ప్రయోగానికి నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రయోగం.. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన మిగిలిన మూన్ మిషన్‌ల కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చంద్రయాన్ 4 ప్రయోగంపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఎవరు చూసిన తగ్గేదెలా.. రైల్వే స్టేషన్‌లో మహిళ డ్యాన్స్..
టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరి లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఉన్న ప్రతిభను నలుగురిలో నిరూపించుకోవాలి అనుకోవడం కూడా తప్పు కాదు. ప్రస్తుతం సాంకేతికత పెరగడం.. సోషల్ మీడియా అందుబాటు లోకి రావడంతో మారుమూల ప్రాంతాలలో మట్టిలో మాణిక్యంలా ఉన్న ప్రతిభావంతులు ఎందరో వెలుగు లోకి వచ్చారు. అయితే అలా పేరు ప్రఖ్యాతులు పొందాలని చాల మంది ప్రయత్నిస్తున్నారు. అలా వాళ్ళు చేసే ప్రయత్నాలలో మనం ఎక్కడున్నం.. చుట్టూ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోయి నెటిజన్స్ విమర్శలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలానే ఓ మహిళ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా డాన్స్ చేసింది. వివరాల లోకి వెళ్తే.. సహేలీ రుద్ర అనే మహిళ క్రాప్ టాప్, డిస్ట్రెస్‌డ్ జీన్స్ ధరించి రైల్వే స్టేషన్ కి వచ్చింది. కాగా ఆ సమయలో రైల్వే స్టేషన్ చాల రద్దీగా ఉంది. ఆ రద్దీని కూడా లెక్కచేయకుండా డాన్స్ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆమెను చూస్తున్న వాళ్ళ చూపులను అసలు పట్టించుకోకుండా తాను డాన్స్ చేసింది. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రాకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ప్రసంశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు కామెంట్స్ లో విమర్శల జల్లు కురిపిస్తున్నారు.
ఒప్పో నుంచి మరో స్మార్ట్ వచ్చేస్తోంది.. సూపర్ ఫీచర్స్..
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో వేరియంట్స్‌లో రెండు ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెస్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.. ఈ ఫోన్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. సెల్ఫీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఎస్ఎల్ఆర్ పొర్ట్రైట్ లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ 47 ఎంఎం ఫోకల్ లెంత్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.. 4700 ఎమ్‌ఏహెచ్ సూపర్ వూక్ ఛార్జింగ్‌ను అందిచంనున్నారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్ను అందించనున్నారు. అంతేకాదు ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇవ్వనున్నారని సమాచారం..
వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందే రూ.2.2 లక్షల కోట్లు సంపాదించిన డిస్నీ
ప్రపంచంలో క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఆడే ఆట ఫుట్‌బాల్. క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు వస్తుంది. స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే సంపాదన విషయానికి వస్తే మాత్రం క్రికెట్ దానిని మించి సంపాదించి పెడుతుంది. దీనికి తాజా ఉదాహరణ భారత్‌లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్. ఫైనల్ మ్యాచ్ ఇంకా ఆడాల్సి ఉంది. ఈ వరల్డ్ కప్ ప్రసారకర్త అయిన డిస్నీ హాట్‌స్టర్ మాతృ సంస్థ షేర్లు వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఫైనల్ మ్యాచ్ ఆడే వరకు దాదాపు 19 శాతం మేర పెరిగాయి. కంపెనీ వాల్యుయేషన్‌లో రూ.2.2 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. 11 నెలల క్రితం నవంబర్-డిసెంబర్ 2022లో FIFA ప్రపంచ కప్ ను డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం చేసింది. ఫైనల్ మ్యాచ్ లో రికార్డ్ వ్యూయర్ షిప్ లభించింది. ఆ తర్వాత కూడా ప్రపంచకప్ సందర్భంగా కంపెనీ షేర్లు క్షీణించాయి. కంపెనీ వాల్యుయేషన్ కూడా క్షీణించింది. క్రికెట్ ప్రపంచ కప్ డిస్నీకి ఆయువుపట్టు అని నిరూపించబడింది. కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 11 నెలల క్రితం జరిగిన నష్టాన్ని భారత్‌లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా భర్తీ చేసింది. ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్‌లో విపరీతమైన పెరుగుదల ఉంది. అక్టోబర్ 4న, కంపెనీ మార్కెట్ క్యాప్ 141.267 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇది 167.681 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26.414డాలర్లకు పెరిగింది. దీన్ని రూపాయిలోకి మార్చుకుంటే కంపెనీ సంపద రూ.2.2 లక్షల కోట్లు పెరిగింది.
ట్విస్ట్ మాములుగా లేదుగా.. వచ్చేవారం ఇద్దరు అవుట్?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఊహించిన విధంగానే ఈ వారం ఎలిమినేషన్ ను ఎత్తేశారు.. ప్రీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వారం నామినేషన్‌లో అర్జున్, శోభాశెట్టి, అమర్, యావర్, రతిక, అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఇందులో అంతా సేవ్ అయ్యారు. చివరికి అశ్విని, గౌతమ్ మిగిలారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అనేది నిర్ణయించే సమయం వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్ లో ఇద్దరు సేఫ్ అని ప్రకటించగా ఊపిరి పీల్చుకున్నారు.. ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడానికి కారణం ఏంటో చెప్పారు హోస్ట్ నాగార్జున. యావర్ ఫ్రీ ఎవిక్షన్ పాస్‌ని వెనక్కి ఇవ్వడం కారణంగా ఎలిమినేషన్ ని బిగ్ బాస్ ఎత్తేశాడని తెలిపింది. మరోసారి ప్రీ ఎవిక్షన్ పాస్‌ని పొందే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తున్నారని తెలిపింది. అయితే యావర్ ఎవిక్షన్ పాస్‌ని వెనక్కి ఇవ్వడానికి, ఎలిమినేషన్‌ని ఎత్తేయడానికి సంబంధం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా లాజిక్ లెస్ అని, ఎవరినో కాపాడటం కోసం ఇదంతా చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా పెద్ద బాంబ్ పెల్చాడు నాగార్జున..వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వెల్లడించారు. ఈ సీజన్ షో ఉల్లా పుల్టా అనేది చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్టు చెప్పారు. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు నాగ్.
మరో సారి ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న గోపీచంద్..?
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో తన 31 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన భీమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ తర్వాత మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గోపీచంద్ పోలీస్ ఆ ఫీసర్‌గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్న లుక్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది. బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న భీమా సినిమా లో గోపీచంద్ పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తన 32 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే… ప్రస్తుతం గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం.. కాగా ఈ సినిమా కోసం గోపీచంద్ పాత సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.. రణం, లక్ష్యం మరియు యజ్ఞం టైటిల్స్ లాగే చివరలో ‘M’ వచ్చేలా తాజాగా చిత్రానికి పేరును కూడా ఫైనల్ చేశారని తెలుస్తుంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే గోపీచంద్ సెంటిమెంట్‌తో వస్తోన్న తాజా టైటిల్‌తో మరో హిట్టు కొట్టడం గ్యారంటీ అంటున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. అలాగే చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొండెపూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.