ఇవాళ వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎవరికి ఏ అవార్డు అంటే..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పేరుతో అవార్డులు అందజేస్తున్న విషయం విదితమే.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి.. వారికి అవార్డులు అందిస్తూ వస్తున్నారు.. ఇక, వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు-2023ని అందజేయనున్నారు.. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరగనుంది.. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఇక, వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, 4 ఎచీవ్‌మెంట్ అవార్డులు.. వ్యవసాయం, కళలు, సాంప్రదాయాలు, తెలుగు భాష– సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ రంగాల్లో ప్రతిభావంతులకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డులు అందజేయనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొంటారు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించనున్నారు ఏపీ సీఎం.. మరోవైపు ఏపీ రాష్ట్ర అవతరన దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు పాల్గొంటారు. ఇక, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జరుగనున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు.
రాజమండ్రి టు విజయవాడ.. 14 గంటల పాటు సాగిన చంద్రబాబు ప్రయాణం..
రాజమండ్రి టు విజయవాడ.. సాధారణంగా కారులో వెళ్తే 3 గంటల్లోపే చేరుకోవచ్చు.. అదే వీఐపీ.. జడ్+ సెక్యూరిటీ ఉన్నవాళ్లు అయితే.. అటు ఇటుగా రెండు – రెండున్నర గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంటుంది.. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే కాగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. మంగళవారం రోజు సాయంత్రం 4.15 గంటల సమయంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.. అంతే కాదు.. ఆయనకు దారి పొడవునా నీరాజనాలు పట్టారు.. టపాసులు కాల్చారు.. పూల వర్షం కురిపించారు.. హారతలు పట్టారు.. అలా 14 గంటల పాటు ఆయన ప్రయాణం కొనసాగింది..
నేటి నుంచి కేసీఆర్ రాజశ్యామల యాగం.. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మూడు రోజులు
సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడు సమావేశాల చొప్పున… సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ… ముందుకు సాగుతున్నారు. ఎక్కడా తగ్గకుండా ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇక నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామలయాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు రాష్ట్రపతులు పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 200 మంది వైదికులు ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం చుడతారు. రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది. సీఎం కేసీఆర్ తన సతీమణితో కలిసి మంగళవారం రాత్రి ఎర్రవల్లి చేరుకున్నారు. మరో 29 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రాజశ్యామల యాగం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో రెండో రోజు రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ మధ్యాహ్నం 2.30 కి కల్వకుర్తి లో సభ పాల్గొంటారు. అనంతరం రాహుల్ సాయంత్రం 4.30 కి జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. అక్కడ నుంచి సాయంత్రం 6.15కిషాద్ నగర్ రైల్వే స్టేషన్ నుండి పాదయాత్ర .. చౌరస్తా లో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్లు ఉండటం వల్ల 2వ తేదీన తెలంగాణలో జరిగాల్సిన రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి నామినేషన్ల తర్వాత రాహుల్ గాంధీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సామాన్యులకు భారీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు…ఎంతంటే?
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు కొన్నిటి ధరలు తగ్గడమో లేక పెరగడమో జరుగుతుంది.. గత నెలతో పోలిస్తే.. ఈ నెల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. .చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్లను భారీగా పెంచేశాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.101.50 పెంచాయి. ఇది సామాన్యులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల యొక్క ఈ కొత్త రేట్లు ఈ రోజు నుండి అంటే నవంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త రేటు అమలు తర్వాత, రాజధాని ఢిల్లీలో ఇప్పుడు LPG యొక్క వాణిజ్య సిలిండర్ 1833 రూపాయలకు చేరుకుంది.. ఇక దేశ వ్యాప్తంగా సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పులు కనిపించలేదు.. మిగిలిన నగరాల్లో సిలిండర్ ధరలను చూస్తే.. ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.903, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 14 కిలోల సిలిండర్ ధర రూ.929. మహారాష్ట్రలోని ముంబైలో గృహోపకరణాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.902.5. చెన్నైలో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ.918.5కు లభిస్తున్నాయి..
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఓ విజయం సాధించింది. మంగళవారం కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాక్ 6 పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. టేబుల్‌లో అఫ్గాన్‌ను వెనక్కి నెట్టి.. ఓ స్థానంను మెరుగుపరుచుకుని సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. లీగ్ దశలో పాకిస్థాన్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లతో పాక్ తలపడాల్సి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే చాలా కష్టం. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై పాక్ ఆధారపడాల్సి ఉంటుంది. ఎనిమిదేసి పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్ ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు. అప్పుడు ఈ మూడు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ వర్షిణి.. ఫోటోలు వైరల్..
యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.. సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది.. నిధానంగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా వర్షిణి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.. శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం ఉదయాన్నే ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం బయట దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతుంది వర్షిణి. ఆమె ఎల్లో డ్రెస్ ధరించింది. మేకప్ లేకుండా కనిపించడం విశేషం. ఒరిజినల్ అందంతో కట్టిపడేస్తుందీ హాట్ యాంకర్.. మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉంది.. ఈ ఫోటోలను చూసిన వారంతా కూడా చాలా బాగున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..