కౌంటింగ్ ఎఫెక్ట్.. కడప జిల్లాలో రౌడీ షీటర్స్‌పై ప్రత్యేక నిఘా
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు 652 మందిని నేటి సాయంత్రం నుంచి అదుపులోకి తీసుకోనున్నట్టు పోలీసులు వెల్లడించారు.. జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ చర్యలకు పూనుకున్నారు. మిగిలిన ట్రబుల్ మాంగర్స్ ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు.
కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. అనంతపురంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
అనంతపురంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేపథ్యంలో ఈ రోజు, రేపు జేఎన్టీయు పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. థామస్ మన్రో సర్కిల్ నుండి జేఎన్టీయూ రోడ్డుకు ఎడమ వైపున ఉన్న ఫెర్రర్ నగర్ 9 క్రాస్ లో నివసిస్తున్నవారు… శారద నగర్ 6 క్రాస్ లు, LIC కాలనీ 4 వ క్రాస్ లు, K మల్లప్ప కాలనీ 2 క్రాస్ లు, విద్యానగర్ 2 క్రాస్ లలో నివసిస్తున్న ప్రజలు మరియు సుశీల్ రెడ్డి కాలనీవాసులు వారి వాహనాల రాకపోకలు జేఎన్‌టియు రోడ్డు వైపుకు అనుమతి లేనందున ప్రత్యామ్నాయ మార్గమైన అనంతపురము-కదిరి రోడ్డు మీదుగా టౌన్ లోకి వెళ్లాలని సూచించారు. థామస్ మన్రో సర్కిల్ నుండి హిందూ శ్మశాన వాటిక దాటిన తరువాత జేఎన్‌టియు వరకు రోడ్డుకు కుడి వైపున ఉన్న SBI కాలనీలోని 3 క్రాస్ ల వారు జేఎన్‌టియు రోడ్డు వైపుకు అనుమతి లేనందున వారి రాకపోకలు ప్రత్యామ్నాయ మార్గమైన హౌసింగ్ బోర్డు నుండి RTO ఆఫీసుకు వెళ్ళు రోడ్డు మీదుగా టౌన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. హౌసింగ్ బోర్డు 80 ఫీట్ రోడ్, పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా వారి రాకపోకలు హోసింగ్ బోర్డు 80 ఫీట్ రోడ్ సర్కిల్ చెక్ పోస్ట్ వైపు వచ్చేందుకు అనుమతి లేనందున వారు ప్రత్యామ్నాయ మార్గాలైన విద్యుత్ నగర్, అశోక్ నగర్ మీదుగా టౌన్ లోకి రాకపోకలు కొనసాగించాలన్నారు.
కృష్ణా జిల్లాలో కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు.. తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..
కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ వెల్లడించారు.. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం.. ప్రతి నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,39,460 ఓటర్లు ఉండగా.. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి, 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 12,93,948 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. ఇక, ప్రతి టేబుల్ కు ఒక అదనపు ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక కౌంటింగ్ అబ్జర్వర్ లను నియమించామన్నారు. రౌండ్ల వారి ఫలితాల ప్రకటన ఉంటుందని.. మచిలీపట్నం అసెంబ్లీ స్థానం ఫలితాలు 15 రౌండ్లు.. పెడన అసెంబ్లీ స్థానానికి 16 రౌండ్లు, గుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలకు 17 రౌండ్లు, అవనిగడ్డ అసెంబ్లీ ఫలితం 20 రౌండ్లు, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలకు 22 రౌండ్లు ఉంటాయని వెల్లడించారు డీకే బాలాజీ.. అయితే, తొలి ఫలితం పెడన, తదుపరి మచిలీపట్నం ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి మొత్తం 21,579 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.. 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 21,728 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి.. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు పామర్రు 2 టేబుల్స్ , పెడన 3 టేబుల్స్ , గన్నవరం 5 టేబుల్స్, గుడివాడ, పెనమలూరు 6 టేబుల్స్ చొప్పున, మచిలీపట్నం, అవనిగడ్డ 8 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు వర్షాలు..
నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి గాలుల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాకముందే వరుణుడి రాక మొదలైంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్, రామాంతపూర్, బోడుపాల్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, చింతల్, సూరారం, బోయినగర్, బోయిన్‌పల్లి డ్రైనేజీలు పలుచోట్ల పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమికి అల్లాడిపోయిన జనం చల్లటి వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేసముద్రంలో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భూపాలపల్లి నియోజకవర్గమంతా తుపాను బీభత్సానికి జనం ఉలిక్కిపడ్డారు. రోజంతా ఎండతో అల్లాడుతున్న ములుగు జిల్లా వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఏటూరునాగారం, గోవిందరావుపేట, ములుగు, వాజేడు మండలాల్లో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండు వద్ద గల అమర వీరుల స్థూపముకు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్ సిరిసిల్లలో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 11 గంటలకు జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా, బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నెల రోజుల పాటు జరుపుకునేవారన్నారు. తెలంగాణ అవతారం, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ 60 లక్షల మంది పార్టీ కార్యకర్తల తరపున కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశలు పూర్తయిన తర్వాత ఒక వైపు దేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఈరోజు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. కాగా, కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీ ల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏడో విడత పోలింగ్ ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతోనే ఎన్నికల కోడ్ ముగిసింది. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. కొత్త రేట్లు జూన్ 3, 2024 నుండి వర్తిస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ సీనియర్ అధికారి తెలిపారు. టోల్ ఫీజులను సవరించడం వార్షిక కసరత్తులో భాగమని, ఇది టోకు ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణంలో మార్పులతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. టోల్ రేట్లలో 3 నుండి 5 శాతం పెరుగుదల జూన్ 3, 2024 నుండి సోమవారం నుండి అమలులోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో యూజర్ ఫీజు (టోల్) రేట్ల సవరణ వాయిదా వేశారని, అయితే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసినందున, ఈ రేట్లు జూన్ 3 నుండి అమల్లోకి వస్తాయని అధికారి తెలిపారు.
దొంగతనానికి వెళ్లి నిద్రలోకి జారుకున్న దొంగ.. కట్ చేస్తే!
ఇళ్లకు కన్నాలేసే దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటారు. రాత్రి పూట అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరికీ డౌట్ రాకుండా దోచుకుని వెళ్లిపోతుంటారు. రాత్రి దొంగతనం చేసే దొంగ నిద్రకు కక్కుర్తి పడితే అడ్డంగా దొరికిపోక తప్పదు. నిద్రలోకి జారకుని ఇంట్లో వాళ్లకు దొరికాడంటే ఆ దొంగ పని అంతే ఇంక. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందిరానగర్ సెక్టార్ 20లోని డాక్టర్ సునీల్ పాండే ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున దొంగ తాళం పగులగొట్టి పాత్రలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి గోనె సంచిలో ఉంచాడు. అనంతరం ఏసీ, ఫ్యాన్ ఆన్ చేసి అక్కడే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, డాక్టర్లు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో జరిగింది. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వికాస్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన దొంగను ముసద్దిపూర్ నివాసి కపిల్ కశ్యప్ గా గుర్తించారు. అవకాశం లభించిన వెంటనే కపిల్ తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బస్తాల్లో ప్యాక్ చేశాడు. ఆ వస్తువులను బస్తాల్లో ఉంచి అక్కడే సిగరెట్ తాగి నిద్రపోయాడు. ఉదయం ఇరుగుపొరుగు వారు తాళం పగులగొట్టి ఉండడం చూసి ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కి చెప్పాడు.పోలీసులు, వైద్యులతో పాటు కొందరు ఇరుగుపొరుగు వారు కూడా ఇంటి లోపలికి చేరుకున్నారు. అక్కడ కపిల్ నిద్రిస్తున్నట్లు గుర్తించారు. అతడిని మేల్కొలిపి అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి ఐపిసి సెక్షన్ 379 ఎ కింద దొంగతనం కేసు నమోదు చేశారు.తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఘాజీపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) వికాస్ రాయ్ తెలిపారు. కపిల్‌పై ఆరు దొంగతనం కేసులు నమోదైనట్లు ఏసీపీ వికాస్ కుమార్ జైస్వాల్ తెలిపారు. దొంగతనం కేసులో కొన్ని నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.
జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, సోమవారం ఉదయం 6:31 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు రిక్టర్ స్కేలుపై ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు కూడా నోటో నగరంలో కనిపించాయి. అదే సమయంలో, నానో, అనామిజు నగరాలతో పాటు నీగాటా ప్రిఫెక్చర్‌లోని కొన్ని ప్రాంతాలలో 4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు.
కేకేఆర్‌కు గుడ్ బై.. టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్!
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెబుతున్నాడా?.. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపిక ఖాయం అయినట్లేనా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దమే అంటూ గంభీర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతానని, జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదని గౌతీ పేర్కొన్నారు. శనివారం అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌతమ్ గంభీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ స్థానంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘నేను భారత జట్టుకు కోచ్‌గా ఉండాలనుకుంటున్నాను. జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే’ అని గంభీర్ చెప్పారు. గౌతీ మాటలను బట్టి చూస్తే.. టీమిండియా కోచ్‌గా రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్ వైరల్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చేసింది.గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.అలాగే గేమ్ ఛేంజర్ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసేందుకు సిద్ధం అవుతన్నాడు. ఇదిలా ఉంటే ఈ నెలలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలు కానుంది.తాజాగా రాజమండ్రిలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. జూన్ 7 లేదా 9న ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం. దాదాపు వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తుంది. సినిమాలలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం.అయితే ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు కూతురు ఇటీవల తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే గాని రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేలా లేదని తెలుస్తుంది.
బాలయ్య కు విలన్ గా ఫిక్స్ అయిన ఆ బాలీవుడ్ స్టార్..?
నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా “NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాలో నటించనున్నట్లు సమాచారం.వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాలో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి.ఇదిలా ఉంటే త్వరలోనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాలో బాలయ్యకు ధీటైన విలన్ వేట మొదలు పెట్టిన బోయపాటి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలోనే ఏఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.