కోడి పందాలు.. జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్
సంక్రాంతి వచ్చేస్తోంది.. పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, గుండాట.. ఇలా అనేక రకాల ఆటలు ఆడుతుంటారు.. ఇక, కోడి పందాలు కోట్లలో జరుగుతాయి.. కొందరు సర్వం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్ మాధవీలత హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగడానికి వీలులేదని స్పష్టం చేసిన ఆమె.. ఒకవేళ పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. పండుగ దినాల్లో కోడి పందాల నిరోధానికి 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు. కోడిపందాలతో పాటు ఇతర నిషిద్ధ ఆటలను ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. కోడి పందాల నిషేధ ఉత్తర్వులు అమలకు గ్రామ కమీటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కలెక్టర్ మాధవీలత.. కోడిపందాల నిషేధంపై గ్రామాలలో టామ్ టామ్ వేయించడం, మైక్ ప్రచారం చేయించడం, కరపత్రాలు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. గత సంవత్సరం కోళ్ల పందాల నిర్వహణకు, బరుల ఏర్పాటుకు స్థలాలు ఇచ్చిన భూయజమానులను గుర్తించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నారు అధికారులు.. నిబంధనలను అతిక్రమించి పందాలు జరిగితే గ్రామ, మండల కమిటీలను బాధ్యులుగా చేస్తామని సీరియర్‌గా హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత.
నేడు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ.. 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ ప్రారంభం కానుంది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్యులు సమావేశం కానున్నారు.. అయితే, ఈ కీలక భేటీకి 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం అందింది.. ముఖ్యంగా త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పొత్తులపై ఓ నిర్ణయానికి రానున్నారట రాష్ట్ర నేతలు.. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉందని చెబుతూ వస్తున్న నేతలు.. జనసేన-టీడీపీ జట్టు కట్టడంతో.. అసలు టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై ఓ నిర్ణయానికి రానుందట.. అయితే, ఈ భేటీలో రాష్ట్ర నేతలను అభిప్రాయాలు తరుణ్ చుగ్ తీసుకోనున్నారట.. ఇప్పటికే జరిగిన పదాధికారుల సమావేశంలో నేతల అభిప్రాయాలను, వివరాలను తరుణ్ చుగ్ కు వివరించనున్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. ఈ రోజు జరిగే సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొననుండడంతో.. నేరుగా ఆయనే తమ అభిప్రాయాలను చెప్పనున్నారు నేతలు.. ఇక, పొత్తులపై ఏపీ నేతల అభిప్రాయాలపై బీజేపీ హైకమాండ్‌కు ఓ నివేదిక సమర్పించనున్నారు తరుణ్ చుగ్. ఆ తర్వాత ఏపీలో పొత్తులపై ఓ నిర్ణయానికి రానుంది బీజేపీ అధిష్టానం.
భూ కబ్జా కేసులపై ఫోకస్ పెట్టిన సీపీ.. పీడీ యాక్ట్, అవసరమైతే నగర బహిష్కరణ..!
విశాఖలో భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.. రాజకీయ నేతలు, అధికారులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారే విమర్శలు వినిపిస్తు్న్నాయి.. అయితే భూ కబ్జా కేసులపై ఫోకస్ పెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్.. రాజకీయ నాయకుల పేర్లు ఉపయోగించి వివాదాస్పద భూముల కబ్జాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. డయల్ యువర్ సీపీ, స్పందన కార్యక్రమాలకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వీటిపై దృష్టిసారించారు సీపీ రవిశంకర్.. కబ్జాదారులకు సహకరించిన వారిని కూడా భూ కబ్జాదారుగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు.. వారిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు.. అంతేకాదు, అవసరమైతే నగర బహిష్కరణ విధిస్తామన్నారు. భూకబ్జాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, న్యాయవాదులు, విశ్రాంత ఎమ్మార్వోలు, వీఆర్‌వోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీస్ కమిషనర్ రవి శంకర్.. ఇప్పటికే భూకబ్జాలకు పాల్పడుతున్న వారిని, నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్న ముఠాలను గుర్తించామని వెల్లడించారు. వీరిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, మూడు రాజధానులపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉంది.. మరోవైపు.. రాజకీయ నేతలు.. భారీ ఎత్తున భూములు కబ్జా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి, విశాఖ పోలీస్ కమిషన్ రవి శంకర్.. ఏ మేరకు భూ కబ్జాలకు చెక్ పెడతారు? అనేది వేచిచూడాల్సిన విషయం.
ప్రజాపాలన అభయహస్తం డేటా ఎంట్రీపై సీఎస్ కీలక ఆదేశాలు..!
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – అభయశాస్తంలో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో గ్రామ, వార్డు సభలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్‌లను అభినందించారు. 6వ తేదీతో ప్రజావాణి ముగిసిన వెంటనే వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు. ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షక అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలి. డేటా ఎంట్రీ కోసం 4, 5 తేదీల్లో శిక్షణ ఉంటుంది. బీమా దరఖాస్తుల డేటా ఎంట్రీని 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పూర్తి చేయాలి. డేటా ఎంట్రీలో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి. డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని… అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు.
ఆడ, మగ కానీ పక్షి.. ఎక్కడుందో తెలుసా..?
సగం ఆడ-సగం మగ లక్షణాలున్న అరుదైన పక్షిని మీరు చూశారా? దీన్ని న్యూజిలాండ్ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ మాట్లాడుతూ.. కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ పక్షి సగం ఆకుపచ్చ, సగం నీలం రంగులతో ఉంది. ఇలాంటివి గత వందేళ్లలో రెండోసారి కనిపించిన అత్యంత అరుదైన పక్షిగా పరిశోధకులు తెలిపారు. అయితే, ఈ పక్షికి ఆడ, మగ రెండు పునరుత్పత్తి అంగాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమని శాస్త్రవేత్త వెల్లడించారు. ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేదని చెప్పారు. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు.
గ్యాంగ్‌స్టర్ మాజీ ప్రియురాలు దివ్య పహుజా మర్డర్.. సీసీటీవీలో హంతకులు..
దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు. గండోలికి సంబంధించి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఈమె ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. గతేడాది జూన్ నెలలో బెయిల్ మంజూరైంది. మంగళవారం గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైంది. పహుజా కనిపించడం లేదని ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ లోని సెక్టార్ 14 పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. 27 ఏళ్ల దివ్య పహుజా జనవరి 1న తన స్నేహితుడు అభిజిత్ సింగ్‌తో కలిసి బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబం సభ్యులు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ హోటల్ సమీపంలో ట్రేస్ అయ్యాయి. ఈ హోటల్ అభిజిత్ సింగ్‌దిగా అధికారులు చెబుతున్నారు. పోలీసులు హోటల్ సీసీటీవీని పరిశీలించగా.. కారిడార్‌లో దివ్య మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ కేసులో అభిజిత్ సింగ్, అతని సన్నిహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సింగ్ అతని సన్నిహితులకు రూ. 10 లక్షలు ఇచ్చి డెడ్ బాడీని పడేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.
టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దది..ప్రారంభానికి సిద్ధమైన అతిపెద్ద క్రూయిజ్ షిప్..
మెగా క్రూయిజ్ షిప్, ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. రాయల్ కరేబియన్స్ షిప్స్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఈ నెల 27న తన ప్రారంభ యాత్రను మొదలుపెట్టనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరు తెచ్చుకుంది. అంతకుముందు రాయల్ కరేబియన్ ‘వండర్ ఆఫ్ ది సీస్’ అతిపెద్ద నౌకగా ఉండగా.. ఇప్పుడు ఆ ఖ్యాతిని ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ దక్కించుకుంది. పరిమాణం పరంగా చూస్తే టైటానిక్ ఓడ కన్నా ఇది 5 రెట్లు పెద్దది. దీని మొత్తం బరువు 2,50,800 గిగాటన్. 2 బిలియన్ డాలర్లతో ఈ నౌకను నిర్మించారు. రాయల్ కరేబియన్ క్రూయిల్ లైనర్లలో ఐకాన్ ఆఫ్ ది సీస్, ఈ లైనప్‌లో స్టార్ ఆఫ్ ది సీస్, ఒడిస్సీ ఆఫ్ ది సీస్, వండర్ ఆఫ్ ది సీస్ అనే నాలుగు పెద్ద క్రూయిజ్ షిప్‌లు ఉన్నాయి. ఈ ఓడ 18 ప్యాసింజర్ డెక్‌లను కలిగి ఉంది. 5,160 మంది ప్రయాణికులతో పాటు 2,350 మంది సిబ్బందిని సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ ఓడలో అతిపెద్ద స్విమ్మంగ్ పూల్‌తో సహా 7 పూల్స్‌ని కలిగి ఉంది. భారీ ఓడకు శక్తినిచ్చేందుకు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్‌ని ఉపయోగించుకుంటుంది. రివర్స్ ఆస్మాసిస్/డీశాలినేషన్ ప్లాంట్ ద్వారా ఆన్‌బోర్డ్‌లో మంచినీటి అవసరాలను 90 శాతం తీరుస్తుంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్ ఖాతాలో చెత్త రికార్డు!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్ అయింది. కాగిసో రబాడ (3/38), లుంగి ఎంగిడి (3/30), నాంద్రే బర్గర్ (3/42) విజృంభించడంతో భారత్ 153 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో విరాట్ (46; 59 బంతుల్లో 6×4, 1×6) టాప్ స్కోరర్. రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36) పర్వాలేదనిపించారు. అయితే ఈ ఇన్నింగ్స్ ద్వారా భారత్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులు ఏమీ చేయకుండా.. చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153/4గా ఉన్న భారత్ స్కోర్.. 11 బంతుల అనంతరం 153/10గా మారింది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు రెండంకెల స్కోర్ అందుకోగా.. లోకేష్ రాహుల్ 8 పరుగులు చేశాడు. జైస్వాల్, అయ్యర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్, ముకేష్‌లు డకౌట్స్ అయ్యారు. అంతకుముందు భారత పేసర్లు మొహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్ల ధాటికి సఫారీల ఇన్నింగ్స్ లంచ్ విరామం లోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత ఇన్నింగ్స్‌లా కాకుండా ప్రొటీస్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేశారు.
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఐరా ఖాన్.. జాగింగ్ దుస్తుల్లోనే పెళ్లి చేసుకున్న నూపూర్!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. ఐరా, నూపుర్‌ల వివాహం బుధవారం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు మధ్య ఐరా, నూపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. హీరో అమీర్ ఖాన్, సినీ నిర్మాత రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్ (27) అన్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ కూతురు వివాహం సంప్రదాయా పెళ్లికి భిన్నంగా జరిగింది. వరుడు గుర్రంపై ఆచారంగా గ్రాండ్ గా బరాత్ తో వివాహ మండపానికి రావాల్సింది. కానీ నూపూర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నాడు. గతేడాదిసెప్టెంబర్‌లో ఈ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇటీవల ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. 37 ఏళ్ల నూపుర్ శిఖరే వివాహ వేడుక వద్దకు భిన్నంగా వచ్చాడు. ఆచారం ప్రకారం నూపుర్ గుర్రంపై వివాహ మండపానికి రావాల్సి ఉండగా.. దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. అంతేకాదు జాగింగ్ దుస్తుల్లోనే ఐరా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వివాహంలో అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు సందడి చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.