*నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. నేటి(బుధవారం) నుంచి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు మొదటి అప్లికేషన్‌ను మాణిక్కం ఠాకూర్ ఇవ్వనున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో చేరిన వారికి కూడా అప్లికేషన్లు ఇవ్వనున్నారు. ఏపీ కాంగ్రెస్ సభ్యత్వమే అభ్యర్ధి మొదటి అర్హతగా ప్రకటించారు. పూర్తి అర్హతల పరిశీలన అనంతరం అభ్యర్ధులను నిర్ణయిస్తామని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఏపీ కాంగ్రెస్ మాజీలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని మాజీలకు ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చింది. ఇప్పటికే మాజీలతో పాటు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను నేరుగా కలిసి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు రెండు జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు.
*బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్
బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు ముదురుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులు ఉమా వర్గీయులు చేసిన పనే అని రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఉమా టార్గెట్‌గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. రాధా వర్గమే ఇది చేసినట్టుగా ఉమా వర్గం భావిస్తోంది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. “పదవి కోసం పార్టీని బెదిరించాలా..?.. చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..?.. దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా?.. కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా..?.. పదవి రాకపోతే కాపుల గొంతుకోసారని పార్టీకి ,కులానికి మధ్య విరోధం పెంచాలా..?.. ఈసారి టికెట్ రాదని అధికార పార్టీతో చర్చలు జరపాలా, అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా?” అంటూ చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. రాధాపై ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే పదిహేడు పాయింట్లతో ఉమాపై పోస్టులు చేయడం గమనార్హం. రాధా, ఉమా వర్గాల మధ్య కోల్డ్ వార్‌తో రాజకీయం హీటెక్కింది.
*నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ
ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. అయితే, ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు పోర్టల్‌లో ఆర్డీవో, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సిన వెసులు బాట్లు, న్యాయ సంబంధ సమస్యలు, చేయాల్సిన మార్పులు- చేర్పులతో పాటు నిజామాబాద్ జిల్లాలో భూ భారతి వివరాలతో రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యాయనం చేయాలని ధరణి కమిటీ చూస్తుంది. ఇక, ధరణి కమిటీ నిన్న (మంగళవారం) సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఇప్పటి వరకు వివరాలను సభ్యులు మంత్రికి తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల్లోగా ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధరణి కమిటీ నిర్ణయించిన విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించినట్టు సమాచారం.
*బాలినేని సంచలనం.. ఇవే నా చివరి ఎన్నికలు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఇవే నా చివరి ఎన్నికలు.. నేను చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారు అని వెల్లడించారు. నేను పట్టాల కోసం వెళ్లి కూర్చుంటే పార్టీ మారుతున్నానని రకరకాల వార్తలు వచ్చాయి.. మీ అందరి దయతో తిరిగి ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను అని స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నేను కలసి పోటీ చేస్తానని చాలాసార్లు చెప్పా.. ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. దేవుడి దయ వల్ల అది సాధ్యపడుతుందని భావిస్తున్నాను అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరటానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు బాలినేని. ఒంగోలులో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పాను అని గుర్తుచేసుకున్నారు బాలినేని.. చాలామంది అలా ఎందుకు చెప్పారని వారించినా.. ఒంగోలు ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేర్చకుంటే రాజకీయాలు మానుకుంటానని చెప్పా.. అది సాధించానని ఆనందం వ్యక్తం చేశారు. పేదల స్ధలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్ కు ధన్యావాదాలు తెలిపిన ఆయన.. 25 వేలమందికి పట్టాలు ఇవ్వటమే కాదు.. ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేస్తాను అన్నారు. మౌళిక సదుపాయాల కల్పన పూర్తిచేసి వచ్చే నెల 10వ తేదీలోపు సీఎం జగన్ చే ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీలు వచ్చినా.. ఒంగోలులో టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ భగవంతుడి దయ.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దయ వల్ల ఇళ్ల స్ధలాలకు డబ్బులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.
*సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా!
దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తయింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సోమవారం అట్టహాసంగా సాగింది. ఈ అద్భుత క్షణాలను కళ్లారా వీక్షించేందుకు.. దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడాకారులతో పాటు రామ భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు వెళ్లారు. ఇక మంగళవారం (జనవరి 23) నుంచి సాధారణ భక్తులకు కూడా రామ్‌లల్లా దర్శనం ఇవ్వనున్నాడు. దాంతో రామ మందిరం దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. రామ్‌లల్లా దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం నుంచి 17 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దక్షిణమధ్య రైల్వే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులు ఉన్నాయి. జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. ఇక ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ రైలులో టిక్కెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ఉదయం 10.40 గంటలకు బయలుదేరి అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.
*నేటి నుంచే జేఈఈ మెయిన్స్ పరీక్షలు
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు.. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తుండగా.. జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్ష రాస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షకు గతేడాది కన్నా.. ఈసారి రికార్డు స్థాయిలో ఈసారి దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్, బీఆర్క్ మొదటి విడత 2024 పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే విద్యార్థి పరీక్ష రాసే చోటు తెలుస్తుంది.\
*సోమాలియాపై అమెరికా వైమానిక దాడి.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
సోమాలియాపై నిన్న (మంగళవారం) అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు అల్-ఖైదా-సంబంధిత అల్-షబాబ్ మిలిటెంట్లు మరణించారు. పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని యూఎస్ ఆర్మీ తెలిపింది. సోమాలియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు దాడులు నిర్వహించినట్లు అమెరికా- ఆఫ్రికా కమాండ్ ఒక ప్రకటనలో తెలిపారు. కిస్మాయోకు ఈశాన్య దిశగా 35 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. అయితే, ఈ దాడిలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.. ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.. ఆల్-షబాబ్ ప్రపంచంలోనే అల్ ఖైదా యొక్క అతిపెద్ద, అత్యంత క్రియాశీల నెట్‌వర్క్ అని అమెరిక- ఆఫ్రికా కమాండ్ ప్రకటనలో పేర్కొంది. అల్ షబాబ్ అమెరికన్ బలగాలపై దాడి చేయడంతో పాటు వాషింగ్టన్ యొక్క భద్రతా ప్రయోజనాలను బెదిరించడం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇక, సోమాలియా ప్రభుత్వంపై తీవ్రవాద సంస్థలు 16 ఏళ్లుగా తిరుగుబాటును కొనసాగిస్తున్నాయి. అలాగే, పొరుగు దేశమైన కెన్యాలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. కెన్యా దళాలు సోమాలియాలో AU యొక్క శాంతి పరిరక్షక దళంలో భాగం, అల్-షబాబ్ కెన్యా సైనిక ఉనికికి దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. అయితే, 2020లో అల్-షబాబ్ మిలిటెంట్లు కెన్యా తీరంలోఅమెరికా టెర్రరిజం నిరోధక దళాలు ఉపయోగించే ప్రధాన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులను చంపేశారు.
*భారత్ తో వివాదం.. మాల్దీవులకు చైనా నిఘా నౌక..
భారతదేశంతో మాల్దీవుల వివాదం వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి ఆ దేశం దిశగా ప్రయాణం కొనసాగిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చైనీస్ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మైరెన్ ట్రాకర్ యాప్ పేర్కొనింది. ఈ షిప్ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019, 2020లలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియెన్ సైమన్ తెలిపాడు. అయితే, మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై భారత నేవీ నజర్ పెట్టింది. ఈ నౌక విషయం తమకు తెలుసు.. దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని భారత్ నౌవీ అధికారులు పేర్కొన్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌తో వివాదాలకు దారి తీస్తున్నాడు. భారత్‌పైనా, ప్రధాని మోడీ పైనా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత కామెంట్స్ వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసింది. ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన ముయిజ్జు.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డెడ్‌లైన్ పెట్టారు. తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెళ్తుండటంతో తీవ్ర పరిణామం చోటు చేసుకొన్నది. గతంలో కూడా ఇదే తరహాలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
*స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారికి నిన్న మొన్నటివరకూ ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ.. వరుసగా మూడో రోజు ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జనవరి 24) 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 57,800 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలానే 24 క్యారెట్ల (999 ప్యూర్ గోల్డ్) బంగారం తులానికి రూ. 63,050 వద్ద స్థిరంగా ఉంది. ఈరోజు ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.57,950లు ఉండగా.. 24 క్యారెట్ల మేమిలి బంగారం తులానికి రూ. 63,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.57,800 వద్ద ట్రేడింగ్ అవుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 63,050గా కొనసాగుతోంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గి.. రూ. 75,000గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 500 మేర తగ్గి రూ. 75,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రేటు రూ. 500 తగ్గి.. రూ. 76,500కు దిగివచ్చింది. ఈ బంగారం, వెండి ధరలు ఎలాంటి పన్నులు లేకుండా సూచించినవి.