నేడు అంబేద్కర్ విగ్రవిగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభానికి సిద్ధమైంది.. చరిత్రలో నిలిచిపోయేలా ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ ముస్తాబైంది.. ఈ రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గతంలోనే అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభిచాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పనుల్లో జాప్యం కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది.. ఇక, ఇప్పుడు అన్ని పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి.. నేడు ప్రారంభించబోతున్నారు.. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారుతుందని అంచనా వేస్తున్నారు.. దేశంలో ఇదే అతిపెద్ద విగ్రహం కావడం మరో విశేషం. 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. అందులో 81 అడుగుల బేస్ ఉండగా.. దానిపై 125 అడుగుల విగ్రహాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇక, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు చేస్తూ.. కీలక సూచనలు చేశారు.. మొత్తంగా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు.. ఇక, ఈ రోజు అంబేద్కర్ స్మృతివనం ఆవిష్కరించనుండగా.. రేపటి నుంచి అంటే 20వ తేదీ నుంచి సామాన్య ప్రజలకు కూడా స్మృతివనంలోకి ప్రవేశం కల్పిస్తారు. 18.18 ఎకరాల్లో 404.35 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు.. అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా స్మృతివనాన్ని తీర్చిదిద్దారు.. పర్యటకులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు.
నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
నేడు విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ, అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. వాహనాల ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి తెలిపారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 12 గంటల వరకు కొనసాగనున్నాయి.. నగరం వెలుపల నుంచే భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకలు కొనసాగించాలని చెప్పారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం.. విశాఖ నుంచి హైదరాబాద్ కు వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి జి.కొండూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామని డీసీపీ పేర్కొన్నారు. ఇక, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తామని ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. అలాగే, ఈ రోజు విజయవాడలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల రాకపోకలను మళ్లిస్తున్నామని చెప్పారు. సభ కోసం వాహనాలలో వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సభకు పర్మిషన్ ఉన్న వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సభకు సుమారు 1 లక్ష 30 వేల మంది వచ్చే అవకాశం ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా 2,600 బస్సులు, 2000 వేలకు పైగా కార్ల కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి వెల్లడించారు.
జనసేనలోకి వైసీపీ ఎంపీ.. నేడు పవన్ కల్యాణ్‌తో భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల.. మార్పులు, చేర్పులు.. కొందరు నేతల్లో అసంతృప్తికి కారణం అయ్యాయి.. సిట్టింగులకు సీటు రాకపోవడంతో.. కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వంతు వచ్చింది.. ఈ సారి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో.. ఇప్పటికే జనసేన పార్టీతో టచ్‌లోకి వెళ్లగా.. ఈ రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్లనున్న ఎంపీ బాలశౌరి.. జనసేనానితో చర్చలు జరపనున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనలో ఆయన పాత్ర ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి..? అనే అంశాలపై పవన్‌తో చర్చించబోతున్నారు.. అయితే, మచిలీపట్నం లేదా గుంటూరు లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్‌తో జరిగే భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
ఏపీలో నేటి నుంచి కులగణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే..
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి కులగుణన ప్రారంభం కానుంది.. ఇప్పటికే ఏపీలో 6 జిల్లాల పరిధిలోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింది కులగణన విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కులగణన చేపట్టనున్నారు.. దీంతో, ప్రతీ సచివాలయం పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి.. ప్రతీ ఒక్కరి వివరాలను సేకరించనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ కులగణన ప్రక్రియ 10 రోజుల పాటు.. అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, ఈ సమయంలో ఎవరైనా వివరాలు నమోదు చేయకపోతే.. ఆ తర్వాత కూడా అవకాశం కల్పించనున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించాల్సి ఉండగా.. మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనుంది. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేనివారికి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సర్వేవివరాలు నమోదు చేస్తారు.. తలెత్తే సమస్యల సత్వర పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వద్ద సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు. అయితే, మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక, సిద్ధం చేసిన ప్రత్యేక మొబైల్ యాప్‌లో దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా వర్గీకరించి అనుసంధానించారు.
మడకశిరలో నెగ్గిన అసమ్మతి వర్గం మాట..
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిని వ్యతిరేకించిన అసమ్మతి వర్గం మాటే నెగ్గింది. గత కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.. స్థానికేతరులకు టిక్కెట్ సహకరించేదీ లేదని ఖరాఖండిగా చెప్పిన వ్యతిరేకవర్గం సూచన మేరకు నియోజకవర్గం సమన్వయకర్తగా ఈర లక్కప్పను అధిష్టానం నియమించింది.. గతంలో కాంగ్రెస్ మద్దతుతో గుడిబండ సర్పంచ్‌గా గెలుపొందారు. తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మండల నాయకుడిగా ఉన్నాడు. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గీయులు ఏకగ్రీవంగా లక్కప్ప పేరును సూచించినట్లు సమాచారం.. అయితే, సీఐ శుభకుమార్ ను నియమిస్తారనే ప్రచారం సాగుతూ వచ్చినా.. అనుహ్యంగా లక్కప్పను సమన్వయకర్తగా నియమించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదల చేసిన నాల్గో జాబితాలో.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది అధిష్టానం.. శింగనమల నుంచి 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు.. మడకశిర ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి 2019లో తిప్పే స్వామి విజయం సాధించారు.. వీరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పకు బాధ్యతలు అప్పగించింది.. ఎమ్మెల్యే తిప్పేస్వామి వ్యతిరేక వర్గంలో ఈర లక్కప్ప ఉండగా.. ఆయనికి ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వడాన్ని తిప్పేస్వామి వర్గం జీర్ణించుకోలేక పోతుంది. కాగా, వైసీపీ 4వ జాబితాలో.. 8 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఇన్‌ఛార్జిలను మార్చేసింది. ఈ మేరకు నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించిన విషయం విదితే.
అయోధ్యకు సిరిసిల్ల నుంచి బంగారు చీర..!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన తరుణం రానే వచ్చింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది.ప్రాణప్రిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామ నామంలో మునిగి తేలుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమైంది. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది.. అయితే.. దేశవ్యాప్తంగా స్వామివారికి పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఏపీలోని తిరుపతి నుంచి లక్ష లడ్డూలు పంపిస్తుండగా, తెలంగాణకు చెందిన అయోధ్య రాములోరికి బంగారు చీరను కానుకగా పంపుతున్నారు. ఎన్నో అద్భుత కళాఖండాలను తన చేతుల మీదుగా ఆవిష్కరించిన సిరిసిల్ల నేత వెల్ది హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను రాముడికి కానుకగా పంపుతున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు.
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో ఐదుగురు మృతి
మణిపూర్ లో మరోసారి సాయుధ మూకలు రెచ్చిపోయాయి. బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించారు. ఇక, నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి కాల్చినట్లు తెలుస్తుంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి ఈ దుండగులు పారిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, మరో ఘటనలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కంగ్పోక్పీ జిల్లాలో రెండు వైరి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కాల్పులకు దారి తీసినట్లు పోలీసులలు తెలిపారు. కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు కంగ్‌చుప్ గ్రామంపై దాడి చేశారు. దీంతో గ్రామస్థులు సైతం ప్రతిదాడులు చేశారని పేర్కొన్నారు. ఇక, వాలంటీర్ మరణం తర్వాత ఇంఫాల్‌లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఇక, కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం నివాసం, రాజ్ భవన్ వరకు మహిళలు ర్యాలీ తీశారు. అయితే, రాజ్ భవన్ కు 300 మీటర్ల దూరంలో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
మోడీ మరోసారి గెలుస్తారు.. అమెరికన్ల సపోర్ట్ మాత్రం ఆయనకే..
అమెరికా గాయని మేరీ మిల్బెన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2024లో భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని జోస్యం చెప్పింది. భారత విధానాలను కూడా ఆమె ప్రశంసించారు. అయితే, గతేడాది జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ‘జన గణ మన’ జాతీయ గీతాన్ని కూడా ఈమె ఆలపించారు. ఇండియాలో కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.’అమెరికాలో మోడీకి చాలా మంది మద్దతు ఇస్తున్నారు.. భారతదేశానికి అత్యుత్తమ నాయకుడు కాబట్టి ఆయనను మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారని మేరీ మిల్బెన్ పేర్కొనింది. అయితే, ఈ ఎన్నికల సీజన్ లో అమెరికా- భారతదేశంతో పాటు ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన ఎన్నికల సీజన్‌లలో ఒకటిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పౌరులుగా మనపై కూడా పెద్ద బాధ్యత ఉంది అని యూఎస్ సింగర్ మేరీ మిల్బెన్ చెప్పారు. ప్రధాన మంత్రి మోడీకి నా మద్దతు ఇస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి కూడా ఆమె ప్రస్తావించారు.. అలాగే మహిళా నేతలను మంత్రివర్గంలో చేర్చుకున్నందుకు మోడీని ప్రశంసించారు.. ఆయన విధానాలు భారతదేశాన్ని నిజమైన ఆర్థిక వ్యవస్థగా నిలిపాయని సింగర్ మేరీ మిల్బెన్ వెల్లడించారు.
ఈ కంపెనీకి 1225 బస్సుల ఆర్డర్ .. రాకెట్ లా ఎగిసిన షేర్ ధర
వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్‌కు కర్ణాటక ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఏప్రిల్ 2024 నాటికి పూర్తిగా నిర్మించిన 1225 వైకింగ్ బస్సులను డెలివరీ చేయడానికి అశోక్ లేలాండ్‌కు కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.522కోట్లు. ఈ ఆర్డర్ ప్రకారం వైకింగ్ బస్సులు AIS153 ప్రమాణాలను అనుసరిస్తాయి. బస్సుల రూపకల్పనలో ప్రయాణీకుల సౌకర్యం, ప్రయాణీకులు, డ్రైవర్ భద్రతపై దృష్టి పెడుతుంది. అశోక్ లేలాండ్ MD & CEO షేను అగర్వాల్ మాట్లాడుతూ, “కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్‌తో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆర్థికాభివృద్ధిలో స్థానిక చలనశీలత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేయబడిన, నైపుణ్యం కలిగిన ఉత్పత్తులను అభివృద్ధి చేసి అందిస్తాం. రవాణా పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం అశోక్ లేలాండ్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద బస్సుల తయారీదారు. దేశంలోనే అతిపెద్ద బస్సు తయారీదారు.
మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు కూడా ధరలు తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 300 దిగొచ్చి.. రూ. 57,400కి చేరింది… 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ.330 తగ్గి.. రూ. 62,620కి చేరింది.. అదే విధంగా వెండి ధర కేజీ వెండి రూ. 400 తగ్గి.. రూ. 75,500కి చేరింది… ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. బంగారం ధర తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గాయి.. రూ. 400 తగ్గి.. రూ. 75,500కి చేరింది..హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 75,500.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
9 వికెట్లతో హాజిల్‌వుడ్ విజృంభణ.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తైన వెస్టిండీస్!
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇటీవల పాకిస్తాన్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ల్లో 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు ఇన్నింగ్స్‌లలో (9/79) చెలరేగగా.. స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ తొలి ఇన్నింగ్స్‌లో (119) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హాజిల్‌వుడ్ దాటికి ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అయితే కఠినమైన పిచ్‌పై సెంచరీ చేసిన హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 188 పరుగులకే ఆలౌట్ అయింది. జోష్ హాజిల్‌వుడ్ (4/44), ప్యాట్ కమిన్స్ (4/41) దాటికి విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. కిర్క్ మెక్‌కెంజీ (50) టాప్ స్కోరర్. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) చేయడం విశేషం. బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరశపర్చారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ సెంచరీ చేశాడు. షమార్ జోసఫ్ (5/94) ఐదు వికెట్స్ పడగొట్టాడు.
అభిమానులకు శుభవార్త.. ‘సలార్’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరిరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వరుస ఫ్లాఫులతో సతమతమవుతున్న ప్రభాస్.. సలార్‌తో మంచి హిట్ అందుకున్నాడు. ఇక సలార్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. జనవరి 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి సలార్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. విషయం తెలిసిన రెబల్‌స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా సలార్ స్ట్రీమింగ్‌కు వస్తుందని అనుకున్నా.. అంతకన్నా ముందే అభిమానులను నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ చేసింది. సలార్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సలార్ సీక్వెల్ టైటిల్‌ను పార్ట్-1 చివర్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. మొదటి భాగాన్ని ‘సలార్-పార్ట్-1 సీజ్‌ఫైర్’ పేరుతో విడుదల చేయగా.. రెండో భాగానికి ‘సలార్-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు. బాహుబలి తర్వాత సలార్‌తో రెబల్‌స్టార్ భారీ హిట్ అందుకున్నాడు. పార్ట్-1 హిట్ కావడంతో పార్ట్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.