గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. వడ్డీ లేకుండా రుణం.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ
ఏదైనా అవసరం కోసం ఎవరిని డబ్బులు అడగాలి.. ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే ఆలోచన కొందరిని వెనక్కి నెడుతుంది.. ఇక, చిరు వ్యాపారస్తుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. ఎక్కువ వడ్డీతో తక్కువ కాలంలో చెల్లించాలనే షరతులతో కొందరు డబ్బులు ఇస్తుండడం.. అలా డబ్బులు తీసుకుని చిరు వ్యాపారులు ఇబ్బందులు పడిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. అయితే, ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు.. ఆ అధిక వడ్డీల బారిన పడకుండా ఉండేందుకు జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం చొప్పున మొత్తం 3,95,000 మంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూర్చనున్నారు. లబ్దిదారులకు రూ.417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు మంజూరు చేయనున్నారు. మరో 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కల్పించనున్నారు.. మొత్తంగా ఈరోజు రూ. 431.58 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, సీఎం వైఎస్ జగన్.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు.. నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూత అందిస్తోన్న విషయం విదితమే.. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం ఇస్తున్న విషయం విదితమే.
ముద్రగడతో జనసేన నేతల భేటీ.. నేడు కాపు ఉద్యమ నేత ఇంటికి టీడీపీ నేతలు..!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాథం పొలిటికల్ రీ ఎంట్రీపై అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి.. ఆయన త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం.. ఈ సారి పోటీ కూడా చేస్తారని.. లేదా ఆయన కుటుంబంలో ఎవరికైనా టికెట్ దక్కే అవకాశం ఉందనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, అనూహ్యంగా ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారట బొలిశెట్టి.. అయితే, పవన్ కల్యాణ్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ చెప్పినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టికి ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. రెండు, మూడు రోజుల్లో ముద్రగడను పవన్‌కల్యాణ్ కలుస్తారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు.. నేడు ముద్రగడను కలవబోతున్నారట టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. టీడీపీ-జనసేన కూటమిలోకి ఆయన్ని ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా మరోసారి ముద్రగడ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.
జనసేనలోకి ముద్రగడ..? ఇంటికి వెళ్లి ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్..!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తాజా పరిణామం ఇది.. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతవారం పవన్ కల్యాణ్ రాసిన లేఖలు ఆయన వద్ద ప్రస్తావించారు.. కాపులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పద్మనాభం తన అభిప్రాయం వ్యక్తం చేశారట.. అంతేకాదు పవన్ కల్యాణ్ వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తానని ముద్రగడ అన్నారు.. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ.. టీడీపీ-జనసేన కూటమితో కలిసి పని చేయాలని ఆయన్ని కోరనున్నారు.. అయితే, ఇప్పటివరకు ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరతారనే చర్చ జరుగుతూ వచ్చింది.. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అనుకూల వాతావరణం లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు.. సీట్లు ప్రకటించినప్పుడు కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదని అనుచరులతో చెబుతున్నారట.. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కల్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో.. ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయం అనే టాక్ నడుస్తుంది. రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్.. ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, మొదటినుంచి టీడీపీ అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే పద్మనాభం ఆ కూటమిలో కలుస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది.. దానికి తగ్గట్లుగానే ముందుగానే జ్యోతుల నెహ్రూ వెళ్లి కలిసి పని చేద్దామని.. ముద్రగడను ఆహ్వానిస్తారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి తన రాజకీయ భవిష్యత్‌పై ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
పండక్కి ఊరెళ్తున్నారా?.. పోలీసుల సూచనలు ఇవే..!
మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండటంతో సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు రోజుల పండుగను మరింత సంతోషంగా జరుపుకునేందుకు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు గ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరం సగం ఖాళీగా మారనుంది. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు జరిగే అవకాశాలున్నాయి. అయితే పండుగ పట్టణాలకు వెళ్లే వారికి సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పండుగ సమయంలో ఇళ్లకు తాళాలు వేసి గ్రామాలకు వెళ్తుంటారు. అదే సమయంలో, దొంగలు తమ తెలివిని పని చెప్తుంటారు. ఇళ్లు తాళాలు వేసి ఉంటే చాలు.. తమకు అందిన కాడిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పండక్కి గ్రామాల్లో నివాసముంటున్న ఇంటి యజమానులు, ప్రజలు తస్మాత్ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఊరెళ్లి అజాగ్రత్తగా ఉండరాదని, ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే వాటిని తీసుకెళ్లాలని లేదా బ్యాంకుల్లో నగదు, బంగారం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మీ టూ వీలర్‌లను మీ కాంపౌండ్‌లలో లాక్ చేసి, వీలైతే చక్రాలకు చైన్‌లను ఉంచడం మంచిది. ఈ విషయాన్ని పక్కింటి వారికి చెప్పాలని లేదా పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మీ ఇంటి ముందు చెత్త, పాల ప్యాకెట్లు, వార్తాపత్రికలు, కొంతమంది నేరస్థులు వాటిని గమనించి నేరాలకు జరగవచ్చు వారికి ముందుగానే మీరు ఉండమని సమాచారం ఇవ్వండి. తలుపులు లాక్ చేయబడినందున అపరిచితులకు కనిపించకుండా, లాక్ చేయబడిన తలుపులను కర్టెన్లతో కప్పండి. బయటికి వెళ్లేటప్పుడు ఇంట్లో కొన్ని, బయట కొన్ని లైట్లు ఉంచడం మంచిది. మీరు లేనప్పుడు మీ ఇంటిని చూసుకోమని మీ విశ్వసనీయ పక్కింటి వారికి తెలియజేయడం మంచిదన్నారు.
కడియం ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చండి..!
తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ప్రయాణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైన రాజకీయ పార్టీగా మారి… పదేళ్లపాటు తెలంగాణను పాలించింది. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాలకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పార్టీకి దూరమైందని… గత అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడిందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ మొదలైంది. వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంచారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని కడియం అన్నారు. టీఆర్‌ఎస్‌తో ప్రజలకు అనుబంధం ఉండేదని, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్, అటాచ్‌మెంట్ పోయిందన్నారు. కాబట్టి ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌లోకి మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీఆర్‌ను కడియం కోరారు.
పాలీక్యాబ్‌పై దాడులు.. రూ.1000కోట్ల నగదు విక్రయాలు, అభ్యంతరకర పత్రాలు లభ్యం
వైర్ అండ్ కేబుల్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ దాడికి సంబంధించి ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్, డామన్, హలోల్, ఢిల్లీలోని ఫ్లాగ్‌షిప్ గ్రూప్‌కు చెందిన మొత్తం 50 స్థానాలపై 22 డిసెంబర్ 2023న దాడులు చేసినట్లు డిపార్ట్‌మెంట్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పన్ను శాఖ రూ. 1000 కోట్ల విలువైన నగదు విక్రయాలను గుర్తించింది. ఖాతాలలో ఎటువంటి ఖాతా నమోదు కాలేదు. ముడిసరుకు కొనుగోలు కోసం ఫ్లాగ్‌షిప్ కంపెనీ తరపున ఒక డిస్ట్రిబ్యూటర్ రూ.400 కోట్ల నగదు చెల్లించినట్లు ఆధారాలు లభించాయని, దానిని డిపార్ట్‌మెంట్ జప్తు చేసినట్లు పన్ను శాఖ తెలిపింది. ఈ దాడిలో జప్తు చేసిన పత్రాలు, డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరపూరిత సాక్ష్యాలను కనుగొన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. కొంతమంది అధీకృత పంపిణీదారులతో కలిసి గ్రూప్ పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని ఈ సాక్ష్యం ద్వారా స్పష్టమైంది. సమూహ కంపెనీ లెక్కలు చూపని నగదు అమ్మకాలు, నగదు చెల్లింపులు, అసలైన రవాణా, సబ్ కాంట్రాక్టుల ద్వారా జరిపిన లెక్కలు చూపని కొనుగోళ్లు, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని దాచిపెట్టడం వంటి ఖర్చులను భరిస్తోందని ప్రాథమిక విశ్లేషణ వెల్లడించింది.
ఎస్‌బీఐ బ్యాంకులోకి ఎద్దు.. వీడియో వైరల్!
ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎద్దు బ్యాంకులోకి రాగానే లోపల ఉన్న వారందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్యాంకు లోపల ఎద్దు కనిపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన అందరూ లైకుల వర్షం కురిపిస్తూ.. ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఉన్నావ్‌లోని కొత్వాలి బడా కుడాలి వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లోకి బుధవారం మధ్యాహ్నం ఓ ఎద్దు ప్రవేశించింది. షాహ్‌గంజ్ ఎస్‌బీఐ బ్యాంకు తలుపులు తెరిచి ఉండగా.. చలికి తట్టుకోలేని ఓ ఎద్దు లోపలికి వచ్చింది. ఎద్దును చూసిన బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. బ్యాంకులోకి వచ్చిన ఎద్దు కాసేపు నిలబడింది. అది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. కాసేపటికి సెక్యూరిటీ గార్డు వచ్చి ఎద్దును బ్యాంకు నుంచి తరిమికొట్టాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను కుమార్ మనీష్ (Kumar Manish) అనే ఎక్స్ ఖాతా దారుడు పోస్ట్ చేశాడు.
పండగ రోజే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ఆరంభం.. ఈ మొబైల్‌లపై భారీ డిస్కౌంట్స్!
సంక్రాంతి పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. భారీ ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ 2024ను తాజాగా అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమై.. జనవరి 17 వరకు కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటలు ముందుగానే ఈ సేల్ మొదలుకానుంది. అంటే జనవరి 13న ఉదయం 12 గంటలకు డీల్‌లను ప్రైమ్ మెంబర్స్ యాక్సెస్ చేయవచ్చు. ప్రైమ్ మెంబర్‌ల కోసం ప్రత్యేకంగా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్, ల్యాప్ టాప్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపు.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ వాచ్‌లపై 75% తగ్గింపు.. స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు మరియు ఎయిర్ కండిషనర్స్ వంటి గృహోపకరణాలపై 65% తగ్గింపు పొందవచ్చు. ఇక సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ తెలిపింది.
నేడు భారత్, అఫ్గానిస్థాన్ తొలి టీ20.. కోహ్లీ స్థానంలో తిలక్!
దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. 2024 జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన భారత్.. ఆ కప్పు కంటే ముందు పొట్టి ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌తో చివరి సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చెలయాలని భారత్ చూస్తోంది. గురువారం జరిగే తొలి టీ20లో గెలిచి శుభారంభం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, జట్టు కూర్పులో తేడాలతో ఈ మ్యాచ్‌లో భారత్ కొత్తగా కనిపించనుంది. మరోవైపు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండా అఫ్గాన్ బరిలోకి దిగుతోంది. గాయాలతో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరమయ్యారు. ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు దక్కలేదు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్ శర్మ తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సత్తాచాటిన రింకు సింగ్ నాలుగో స్థానంలో ఆడుతాడు. వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య పోటీ ఉన్నా.. గత రెండు సిరీస్‌ల్లో రాణించిన జితేశ్‌కే అవకాశం దక్కొచ్చు. హార్దిక్ స్థానాన్ని శివమ్ దూబె భర్తీ చేయనున్నాడు. పేసర్లుగా అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. ఓ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. మరో స్థానం కోసం రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రేసులో ఉన్నారు. ఓ పేసర్ వద్దనుకుంటే.. సంజూ తుది జట్టులోకి వస్తాడు.
పింక్ డ్రెస్‌లో పరువాల విందు.. స్టన్నింగ్ స్టిల్స్ తో రచ్చ..
అరియనా.. ఈ పేరుకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ పేజ్ కూడా ఉందనడంలో సందేహం లేదు.. యూట్యూబ్ యాంకర్ గా పాపులర్ అయిన అరియనా ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తన యాట్టిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. తాజాగా బ్లాస్టింగ్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక అరియనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటో షూట్ లు చేస్తుంది.. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.. ఈ మధ్య బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. అయినా తగ్గేదేలే అంటుంది ఈ హాట్ గర్ల్.. కామెంట్ చేసిన వారికి బుద్ది చెప్తుంది..
బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకమీదట షో లేనట్టేనా?
తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ అంటే చాలా మంది జనాలు ఇష్టంగా చూసేవారు.. ఒకరిపై అభిమానాన్ని పెంచుకుంటూ వాళ్లు గెలవాలని కోరుకొనేవారు.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ క్రమంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు హల్చల్ చేశాయి. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రసారం అవుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి.. గతంలో ఎన్నడు లేని విధంగా బిగ్ బాస్ 7 లో కామన్ మ్యాన్ విన్నర్ గా నిలవడంతో జనాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ నేపథ్యంలో ఓటీటీ వెర్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని, కొందరు సెలెబ్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. బర్రెలక్క, భోలే షావలి, నయని పావనితో పాటు మరికొందరు పార్టిసిపేట్ చేస్తున్నట్లు ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.. ఫిబ్రవరి నుండి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానుందన్నారు. అయితే అనూహ్యంగా షో రద్దు అయ్యిందట. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ వేయడానికి నిర్ణయించిన ప్రదేశం కూడా వేరే ఛానల్ మరో షోకి బుక్ చేసుకుందట… దానికోసమే ఆ షో సెట్ ను పీకేసి వాళ్ల సెట్ ను వేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల బిగ్ బాస్ ఇక ఉండదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..