నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం.. టార్గెట్ అదే..
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక, ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు.. మరోవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు.. ఆ 8 మందిపై స్పీకర్ అనర్హత వేటు
8 మంది రెబల్ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ రెబల్, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లపై ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్.. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన స్పీకర్.. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు.. ఇక, వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణను ముగించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి వైసీపీ, టీడీపీ.. వైసీపీ పిటిషన్ లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ, ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. టీడీపీ పిటిషన్‌లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఉన్నారు.. మొత్తంగా పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకేసారి అనర్హత వేటు వేశారు. కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్, కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం.. పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు.. వారిని నుంచి వివరాలు తీసుకున్నారు.. మరికొన్ని సందర్భాల్లో విచారణ దూరంగా ఉన్నారు రెబల్ ఎమ్మెల్యేలు.. ఈ తరుణంలో విచారణ ముగిసినట్టేనని ప్రకటించిని స్పీకర్.. ఆ తర్వాత న్యాయనిపుణుల సలహా తీసుకుని.. ఒకేసారి 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్టు వెల్లడించారు.. స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.
నేడు ఏపీలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరులో పలు కార్యక్రమాలు పాల్గొననున్నారు రాజ్‌నాథ్.. మొదట విశాఖ చేరుకోనున్న ఆయన.. భారత్ రైజింగ్ పేరుతో జరగనున్న మేధావులతో సమావేశంలో పాల్గొంటారు.. ఈ సమావేశానికి సుమారు 600 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది బీజేపీ.. ఇక, విశాఖ తర్వాత విజయవాడలో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు రాజ్‌నాథ్.. ఆ తర్వాత ఏలూరు వెళ్లనున్న రాజ్‌నాథ్ సింగ్.. బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు. అయితే, ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.. అయితే, రాజ్‌నాథ్ సింగ్ పర్యటనతో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.
ఇక, రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది..
* ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్
* విశాఖ, విజయవాడ, ఏలూరులో పర్యటించనున్న రాజనాథ్ సింగ్
* విశాఖలో VUDA చిల్డ్రన్స్ థియేటర్ లో 12 గంటలకు మేధావుల సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రి.
* మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడ చేరుకోనున్న రాజనాథ్
* విజయవాడలో ఒక హోటల్లో బీజేపీ ఏపీ లోక్‌సభ స్ధానాల కోర్ కమిటీతో సమావేశం
* సాయంత్రం 5:10 కి ఏలూరు ఇండోర్ స్టేడియానికి చేరుకోనున్న రాజనాథ్ సింగ్
* ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్న రాజనాథ్
* సాయంత్రం 7:10 కి ఏలూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్‌నాథ్..
* 7.10 తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్న రాజ్‌నాథ్ సింగ్.
నేడు చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. రెండు పథకాల అమలుకు శ్రీకారం..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక, గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ లబ్దిని 5 లక్షల నుంచి 10లక్షల రూపాయలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా, ఆ పథకం ఇంకా పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసినట్లైతుంది. ఇక, తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డు దారులు ఉన్నారు. అందువల్ల 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతాయి. దీంతో వారికి వచ్చే నెల నుంచి జీరో విద్యుత్ బిల్లులు రానున్నాయి. అయితే, ఫిబ్రవరిలో వాడిన కరెంటుకి మాత్రం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది. మార్చిలో వాడిన కరెంటుకి సంబంధించి, జీరో బిల్లు ఏప్రిల్‌లో రానుంది.
నేడే రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. ఏకగ్రీవమైన సభ్యులు వీరే..!
ఇవాళ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 12 రాష్ట్రాల నుంచి 41 సీట్లు ఖాళీ కావడంతో అంతే సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. అలాంటి పరిస్థితుల్లో 12 రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో మిగిలిన మూడు రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగబోతుంది. ఈ 15 రాజ్యసభ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు ఉండగా.. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హత సాధించారు. ఇక, ఏకగ్రీవం అయిన 41 మంది రాజ్యసభ ఎంపీల్లో సోనియా గాంధీ, జేపీ నడ్డాతో పాటు ఇటీవలె కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్ ఏకగ్రీవం అయ్యారు. ఇక, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, టీఎంసీ నుంచి నుంచి నలుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు, బీజేడీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూ పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 15 స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 15 స్థానాలు ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
పాకిస్థాన్ కు నీటిని ఆపేసిన భారత్..
పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ తాజా పరిణామంతో రావి జలాలన్నీ మన దేశానికే ఉపయోగపడబోతున్నాయి. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్- పాక్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. దాని ప్రకారం- సింధూ ఉపనది అయిన రావి జలాలపై పూర్తి హక్కులు భారత్ కు లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని గతంలో ఇండియా నిర్ణయించింది. అందులో భాగంగానే 1979లో పంజాబ్- జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యామ్, కింది వైపు షాపుర్ కండీ బ్యారేజ్‌ను నిర్మించాలని ఈ రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం 2001లోనే పూర్తి కాగా, షాపుర్ కండీ పనులు అనేక ఆటంకాలతో ఆగిపోయాయి. దీంతో పాక్‌కు నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. అయితే, 2008లో షాపుర్ కండీ బ్యారేజీని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. 2013లో నిర్మాణ పనులు ఆరంభించారు. కానీ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ల మధ్య విభేదాలతో ఏడాదికే మళ్లీ పనులు నిలిచిపోయాయి.
నైలు నదిలో మునిగిన బోటు.. 19 మంది కూలీలు మృతి
ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలు నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోవడంతో 19 మంది కూలీలు మరణించారు. గ్రేటర్ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్ ఎల్ కాంటేర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో 19 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా దినసరి కూలిలుగా అక్కడి అధికారులు గుర్తించారు. ఈ కూలీలంతా ఓ నిర్మాణ సైట్‌లో పనికి వెళ్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పడవ ప్రమాదానికి కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల ఈజిప్టియన్ పౌండ్లు, గాయపడ్డ ఐదుగురికి 20 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇక, అప్పర్ ఈజిప్ట్‌లోని నైలు నది డెల్టాలో ప్రజలు ఎక్కువగా తమ రోజువారి పనుల కోసం ఫెర్రీ బోట్లలోనే ప్రయాణాలు చేస్తుంటారు. నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో రోడ్డు, రైలు, బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతునే ఉంటాయి. గతంలో జరిగిన బోటు ప్రమాదాల్లోనూ నైలు నదిలో మునిగిపోయి చాలా మంది చనిపోయారని అనేక గణాంకాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్.. ముంబైకే ఆడనున్న రోహిత్ శర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం సమయంలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీలో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. దాంతో రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు హిట్‌మ్యాన్‌ను ట్రేడింగ్ చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కూడా చూపాయి. అయితే రోహిత్‌ను వదులుకోవడానికి ముంబై ఫ్రాంచైజీ ఇష్టపడలేదు. తాజాగా ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్ అయ్యింది. గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలం తర్వాత ఓపెన్ అయిన ట్రేడ్ విండో.. ఐపీఎల్ షెడ్యూల్ రావడంతో క్లోజ్ అయింది. దీంతో 17వ సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫునే బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ప్రాంచైజీ రోహిత్‌ను వదిలేస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలోకి హిట్‌మ్యాన్ రావడం దాదాపు ఖాయం అయినట్టే. 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమించబడ్డాడు. అదే ఏడాది ముంబైకి అతడు మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2015, 2017, 2019, 2020లో ముంబైకి హిట్‌మ్యాన్ టైటిల్స్ అందించాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై 87 మ్యాచ్‌లు గెలిచి, 67 మ్యాచ్‌లలో ఓడిపోయింది. రోహిత్ గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. ఈ సరి కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగనున్న అతడు రెచ్చిపోయే అవకాశం ఉంది.
హెల్ప్ మీ బ్రదర్.. సత్య నాదెళ్లకు మెసేజ్ చేసిన ఎలోన్ మస్క్
టెస్లా యజమాని ఎలోన్ మస్క్ స్వయంగా కొత్త విండోస్ ల్యాప్‌టాప్ పీసీని కొనుగోలు చేశాడు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పంపి తన సమస్యలను చెప్పుకున్నారు. మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇందులో చాలా మంది వినియోగదారులు తమ సమస్యను పరిష్కరించడానికి సూచనలు ఇచ్చారు. టెక్నికల్ సపోర్ట్ కోసం సత్య నాదెళ్లకు కాల్ చేయండి అని ఒకరు వ్యాఖ్యానించారు. మస్క్ అతను ఇప్పటికే అతనికి మెసేజ్ చేశానని సమాధానంగా రాశాడు. వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో బేసిక్ ఫంక్షనాలిటీ కోసం కూడా మైక్రోసాఫ్ట్ ఖాతాను సృష్టించాల్సిన అవసరాన్ని మస్క్ విమర్శించారు. గోప్యత కోసం గందరగోళంగా ఉందని మస్క్ అన్నారు. మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌లో రాశారు అంటే నా కంప్యూటర్‌లో అతని AIకి నేను యాక్సెస్ ఇస్తాను. ముందుగా సైన్ ఇన్ చేయడానికి ‘స్కిప్’ చేయడానికి లేదా ‘మైక్రోసాఫ్ట్ ఖాతా’ని సృష్టించడానికి ఒక ఎంపిక ఉందని మస్క్ చెప్పారు. ఈ సమస్య గురించి, ఎలోన్ మస్క్ సత్య నాదెళ్లకు నేరుగా సందేశం పంపారు. అతని ల్యాప్‌టాప్, కంప్యూటర్‌కు సంబంధించిన సమస్యలను చెప్పారు. అయితే, వరుస ట్వీట్ల తర్వాత, మస్క్ మైక్రోసాఫ్ట్ ఖాతాను సృష్టించకుండానే తన Windows ల్యాప్‌టాప్ PCకి ప్రాప్యతను తెరవగలనని వెల్లడించాడు. ఒక వినియోగదారు దీనిని సూచించారు, దీనిని మస్క్ ప్రయత్నించారు.. ఫలితాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎట్టకేలకు ఇది విజయవంతమైంది, ధన్యవాదాలు. నా ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ లేకుండా స్వయంచాలకంగా స్థానిక Wi-Fiకి కనెక్ట్ చేయబడింది. దీని తర్వాత, నేను ఎంపికను తీసివేయి ఎంపికపై క్లిక్ చేసి, లాగిన్‌ను దాటవేసాను.’ అంటూ రాసుకొచ్చారు.
మొదటిసారి ఆ హీరోతో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి?
టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇంతవరకు రొమాంటిక్ సాంగ్స్ చెయ్యని ఈ అమ్మడు ఇప్పుడు మొదటి సారి రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించే నటి సాయిపల్లవి. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా అమరన్.. కమలహాసన్ తన రాజకమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న అమరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో నటుడు శివకార్తికేయన్ సైనికుడిగా నటిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. ఒక రొమాంటిక్ సాంగ్ ను శివకార్తికేయన్, సాయి పల్లవిపై చిత్రీకరించనున్నట్లు తెలిసింది. రొమాంటిక్ సాంగ్స్‌లలో సాయిపల్లవి ఇప్పటి వరకు కనిపించింది లేదు.. ఇదే మొదటి సారి.. ఈ సినిమాను అనుకున్న సమయానికే ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..
ఆ థియేటర్ ను AMBగా మార్చేస్తున్న మహేష్ బాబు..
ఒకప్పుడు సినిమాలను చూడటానికి సింగిల్ థియేటర్స్ వెళ్ళేవాళ్లు.. కానీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. అక్కడ జనాలు ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం జనాలు తగ్గించేశారు.. టికెట్ ధర ఎక్కువైన కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు.. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్, సంధ్య.. థియేటర్స్ ప్రతి శుక్రవారం బ్యానర్లు, పూల దండలు, హీరోల కటౌట్స్ తో నిండిపోతాయి. అభిమానులు అంతా అక్కడే తమ హీరోల సినిమాలని మొదటి రోజు చూడాలని ఆరాటపడతారు.. అలాంటి ఆ ఏరియాలో చాలా కాలంగా మూతబడిన ఓ థియేటర్ ను మహేష్ బాబు మల్టీప్లెక్స్గా మార్చబోతున్నారని సమాచారం… సుదర్శన్ 35mm థియేటర్ వద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతుంది. అయితే గతంలో సుదర్శన్ 70mm కూడా ఉండేదట.. 2010లోనే మూసేసారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకొని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని తెలుస్తుంది.. దీనిపై క్లారిటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది..