నేడు కాపు, రేపు శెట్టిబలిజ వనభోజనాలు.. పోలీసుల ఆంక్షలు
నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. నేడు కాపుల వన భోజన కార్యక్రమం ఉండగా.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజనాలు ఉన్నాయి.. అయితే, జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు.. కోనసీమలో సెక్షన్ 30 ఈ నెల చివరి వరకు అమల్లో ఉంటుందని డీఎస్పీ అంబికా ప్రసాద్ ప్రకటించారు.. ఈ సమయంలో డీజేలతో రోడ్లపై ఊరేగింపులకు అనుమతి లేదని.. సైలెన్సర్లు తీసి తిరిగే మోటార్ సైకిళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు నిషేధం విధించినట్టు హెచ్చరించారు. వ్యక్తులను వర్గాలను కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసు అధికారులు.
కొట్టుకుపోయిన గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు..!
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోవడం సంచలనంగా మారింది.. దీంతో రాత్రి నుంచి ప్రాజెక్టు నుంచి దిగువకు వృథాగా నీరు పోతున్నట్టు చెబుతున్నారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది.. అయితే, నీటి ఉధృతికి గేటు కొట్టుకుపోయింది.. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. నీరు వృథాగా కిందికి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 3వ నంబర్ గేటు కొట్టుకుపోవటంతో పూర్తిస్థాయిలో ఇప్పటివరకు మరమ్మతులు పూర్తికాకపోగా.. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో.. మరోగేటుకు అదే పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు.. అయితే, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని అధికార యంత్రాంగం సూచిస్తోంది.. ఇదే సమయంలో.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు.. ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 2వ నంబర్ గేటును ఈ రోజు టీడీపీ నేతల బృందం పరశీలించనుంది.. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్ తదితర నేతలు ఈ రోజు గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వెళ్లనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. టీఎస్‌ఆర్టీసీ కూడా ఈ మేరకు వివరాలను ప్రకటించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. హైదరాబాద్‌లో నడుస్తున్న సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. మహిళలే కాకుండా బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై నిన్న (శుక్రవారం) హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జన్ మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలను వివరించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాల మధ్యాహ్నం 1:30 గంటలకు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు సీఎం తెలిపారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త స్పీకర్ ఎన్నిక నేడు ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉండనున్నారు. అయితే, ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక, దీనిపై బీఏసీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదటి రోజు మాత్రం సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడే ఛాన్స్ ఉంది. తిరిగి సమావేశాలు ఈనెల 13 నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చిస్తారు. ఇక, స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ రిలీజ్ కానుంది. ఈ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలైన అయిన తర్వాత.. సభ్యులు ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.
మహారాష్ట్ర-కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల కుట్రపై నిఘా
దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు గ్లోబల్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కుట్ర చేసిందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ కర్ణాటక, మహారాష్ట్రలోని దాదాపు 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలోని కొన్ని చోట్ల ఈ దాడులు జరుగుతుండగా.. మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీతో పాటు మీరా భయాందర్‌లలో కూడా ఎన్ఐఏ తనిఖీలు జరుగుతున్నాయి. కాగా, ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఆధారిత ఐఎస్ఐఎస్ కార్యకర్తల ప్రమేయంతో పెద్ద కుట్రను బయట పెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఐసిస్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న నిందితుల కోసం విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడులు చేస్తున్న మొత్తం లొకేషన్‌లలో కర్ణాటకలో ఒక చోట, పూణేలో 2, థానే రూరల్‌లో 31, థానే నగరంలో 9, భయందర్‌లో ఒక చోట అధికారులు సోదాలు చేశారు. థానేలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మూడు రోజుల్లో 300 కోట్లు, నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది
జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు, అతనికి సంబంధించిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు వరుసగా మూడో రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం కూడా రాంచీలోని ఆయన నివాసం, ఒడిశాలోని ఆయన నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో ధీరజ్ సాహు దాచిన స్థలాల నుంచి దాదాపు రూ.300 కోట్లు రికవరీ కాగా నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. శనివారం నాటికి కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ దాడిపై ఇప్పటి వరకు ఎంపీ లేదా అతని సంస్థ నుండి ఎటువంటి స్పందన లేదు. కాగా, నగదు రికవరీతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎంలపై బీజేపీ దాడికి దిగింది. మూడో రోజైన శుక్రవారం, రాంచీలోని రేడియం రోడ్డులోని ధీరజ్ సాహు నివాసం సుశీలా నికేతన్ నుంచి ఆదాయపు పన్ను శాఖ బృందం మూడు సూట్‌కేసులను తీసుకెళ్లింది. ఈ బ్యాగ్‌లో నివాసం నుండి స్వాధీనం చేసుకున్న నగలు ఉన్నాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో తొలిసారిగా ఎంపీ ఆవరణలో నగలు రికవరీ చేయడం వెలుగులోకి వచ్చింది.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్..
రేపటి నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ కాలు చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి లుంగి ఎంగిడి తప్పుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రెండేళ్ల తర్వాత బ్యూరాన్ హెండ్రిక్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యూరాన్ హెండ్రిక్స్ చివరిసారిగా 2021లో సౌతాఫ్రికా తరఫున ఆడాడు. హెండ్రిక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక టెస్టు, ఎనిమిది వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడకు కూడా విశ్రాంతినిచ్చింది. దీంతో సఫారీ జట్టు బౌలింగ్ కి గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్, లిజార్డ్ విలియమ్స్ సారథ్యం వహించనున్నారు. ఇక, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొదటి మ్యాచ్ డర్బన్‌లో జరగనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు డిసెంబర్ 12, డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతాయి. మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన తర్వాత రెండు జట్లు డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడు ODI మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి రెండు జట్లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు తలపడతాయి.
డీఆర్‌డీవో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఓలో 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 11 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. జీతం ఒక్కో పోస్టులకు ఒక్కోలా ఉంటుంది.. మంచి పెర్ఫార్మన్స్ ను బట్టి జీతం ఏడాదికి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/ ఈ ఉద్యోగాల గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు… ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ సంస్థ పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. వీటికి సంబందించిన పరీక్షలు కూడా త్వరలోనే నిర్వహించనున్నారు..
సరిగ్గా రెండు వారాల్లో బాక్సాఫీస్ పై దాడి చేయనున్న డైనోసర్…
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి… ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఫస్ట్ లుక్ తో స్టార్ట్ అయిన సలార్ ప్రమోషన్స్… టీజర్ తో పీక్స్ కి వెళ్లిపోయింది. రీసెంట్ గా సలార్ ట్రైలర్ బయటకి వచ్చి పెను తుఫాన్ సృష్టించింది. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యగల సత్తా ఉన్న సలార్ మూవీ.. సరిగ్గా మరో వంద ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 2 వీక్స్ ఫర్ సలార్… రెండు వారాల్లో సలార్ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో సలార్‌ను ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డిసెంబర్ 15 నుంచి బుకింగ్స్ కూడా ఓపెన్ అవనున్నాయి కాబట్టి సలార్ మేనియా మరింత పెరగనుంది. అలాగే త్వరలో సలార్ నుంచి సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తే సలార్ సినిమాని బాక్సాఫీస్ దగ్గర ఆపడం కష్టమే. వన్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగితే… సలార్ బాక్సాఫీస్ ఊచకోత నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యరెంటీ. ఏదేమైనా మరో రెండు వారాల్లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సలార్ అనే భారీ తుఫాన్ రాబోతోందని చెప్పొచ్చు.