రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
రెండో రోజు తన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకోనున్న ఆయన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు.. సుమారు మూడు గంటల పాటు సీఎం ప్రార్థనలో పాల్గొనబోతున్నారు.. ఇక, మధ్యాహ్నం 12.30 గంటలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకుంటారు సీఎం జగన్.. మండల, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తారు.. సాయంత్రం 3 గంటలకు తిరిగి ఇడుపులపాయ చేరుకుంటారు.. ఇడుపులపాయలోని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం.. గంటన్నర పాటు ఈ భేటీ జరగనుండా.. ఆ తర్వాత్రి ఈ రోజు రాత్రికి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీఎం వైఎస్ జగన్ వరుసగా మూడు రోజులో జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. 25వ తేదీన అనగా రేపు ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు.. ఆ తర్వాత మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.
చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు.. ఘర్షణ, పరస్పరం దాడులు
నంద్యాల జిల్లా అవుకులో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.. చల్లా కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ విభేదాలు కొనసాగుతూ రాగా.. ఈ సారి, ఘర్షణ, పరస్పరం దాడి వరకు వెళ్లింది వ్యవహారం.. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇంటి దగ్గర కారు పార్కింగ్ విషయంలో, పిల్లల విషయంలో ఈ సారి ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట చల్లా కుటుంబ సభ్యులు.. ఈ ఘర్షణతో గాయాలు కూడా అయ్యాయి.. దీంతో.. బనగానపల్లి ఆసుపత్రిలో చల్లా శ్రీలక్ష్మి, అవుకు ఆసుపత్రిలో చల్లా శ్రీదేవి చేరారు.. ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ వీధికెక్కుతూ వస్తున్నారు చల్లా కుటుంబ సభ్యులు.. కాగా, దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో ఆయన మృతి తర్వాత విభేదాలు నెలకొన్నాయి. అవి కాస్తా చల్లా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫొటో ఫ్రేమ్ కోసం మొదలైన గొడవ పెద్ద గాలివానలా మారిందని.. ఆ తర్వాత ఆస్తి, రాజకీయ వారసత్వం ఇలా కొత్త విషయాలు తెరపైకి వచ్చాయనే చర్చలు జరిగాయి. అత్తా కోడల మధ్య గొడవలోకి ఆడపడుచు ఎంట్రీ అవ్వడంతో కథ మరో మలుపు తిరిగిందని చెబుతారు. అయితే, చల్లా రామకృష్ణారెడ్డి రాయలసీమ సీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. కానీ, చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరిలో అనారోగ్యంతో కన్నుమూశారు.. ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే ఆయన మృతిచెందడంతో ఆయన తర్వాత ఎమ్మెల్సీ పదవిని చల్లా రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కూడా 2022 నవంబర్‌లో మరణించారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి.. చల్లా కుటుంబం రెండుగా చీలిపోయింది.. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో తరచూ ఏదో వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు పరస్పరం దాడి వరకు వెళ్లింది.
నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నేడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడనున్నారు. ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులు, గ్రామ సభలు.. మొదలైన వాటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంగా పదవీ భాద్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమంను సీఎం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో నేడు సీఎం ప్రకటించనున్నారు. అంతేకాకుండా ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు.
మూలుగ బొక్క కోసం లొల్లి.. పెళ్లి సంబంధం రద్దు! అచ్చం బలగం సినిమా మాదిరే
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబసభ్యులు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఇక్కడివరకు అంతా సాఫీగానే సాగింది. ఇక నవంబరు మొదటి వారంలో వివాహ నిశ్చితార్ధం సందర్భంగా.. ఆడపెళ్లి వారి ఇంట మాంసాహారంతో భోజనాలు పెట్టారు. అబ్బాయి తరఫు బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. దాంతో ఇరువర్గాల మధ్య చిన్న గొడవ మొదలైంది. ఈ గొడవ చిలికి చిలికి.. గాలివానగా మారింది. మూలుగ బొక్క గొడవ చివరికి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ ఇరువర్గాలు శాంతించినప్పటికీ.. పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వివాహ సమయంలో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవకు కారణం అవుతాయన్న విషయం తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ కొత్త స్కెచ్
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ “అఖండ” విజయంపై దృష్టి సారించింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ ఓట్ల వాటాను 10 శాతం పెంచడానికి కృషి చేయాలని కీలక సంస్థాగత నాయకులను కోరినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.. రెండు రోజుల మేధోమథనం సమావేశం ముగింపు రోజున శనివారం బీజేపీ జాతీయ పదాధికారులు మరియు రాష్ట్ర అధ్యక్షులను ఉద్దేశించి హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ సూచనలు చేశార.ట. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లను సాధించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారట.. దీనికోసం జనవరి 15వ తేదీ నుంచి క్లస్టర్ సమావేశాలు నిర్వహించనున్నారు.. దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభలను క్లస్టర్లుగా విభజించి, సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. క్లస్టర్ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించేలా ప్లాన్ చేయనున్నారు. యువమోర్చా అధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5000 సదస్సులు నిర్వహించబోతున్నారట.. కొత్త ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది.. జనవరి 24వ తేదీ నుంచి యువమోర్చా అధ్వర్యంలో కొత్త ఓటరు సదస్సులు పెట్టబోతున్నారు.. ప్రతి బీజేపీ నాయకుడు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించాలి అని పిలుపు నిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, జనవరి 1వ తేదీ నుండి రామమందిర ఉత్సవాల ప్రచారం నిర్వహించబోతున్నారు. బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పది కోట్ల కుటుంబాలను రామ మందిరానికి దియా మెరుపు కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు.
ప్రయాణికులకు శుభవార్త.. రూ.10కే భోజనం, రూ. 5 లకు అల్ఫాహారం!
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పోలిస్తే దాదాపు డబుల్ రేట్స్ అక్కడ ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ. 200 నుంచి రూ. 500 ఉంటుంది. అదే భోజనం చేయడానికి రూ. 500-1,000 చెల్లించుకోవాల్సిందే. అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఓ శుభవార్త. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ను విమానాశ్రయంలో ప్రారంభించాలని కర్ణాటక కేబినెట్ సమావేశం నిర్ణయించింది. బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని.. వాటిని మూసేయాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్లోని లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. రాగి ముద్ద, మంగళూరు బన్స్‌తో సహా పలు రకాల భోజనాలు వడ్డిస్తున్నారు.
భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతకు చేరిందో తెలుసా?
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధర తగ్గుతుందనుకునే లోపే ఇంకా పైపైకి ఎగబాకుతున్నాయి. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 200 ఎగబాకగా.. ఏకంగా రూ. 58 వేల మార్కు దాటేసింది. స్వచ్ఛమైన బంగారం ధర 24 క్యారెట్లపై రూ. 260 పెరిగి ప్రస్తుతం రూ. 63,490 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,750లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,090గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా కొనసాగుతోంది. బంగారం ధర పెరిగితే. వెండి ధర మాత్రం తగ్గింది. దేశీయ మార్కెట్లో కిలో వెండిపై రూ. 500 తగ్గి.. రూ. 79,000లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. బెంగళూరులో 77,000గా ఉంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతోంది.