నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పరట్యన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. పలాస పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ముందుగా కంచిలి మండలం మకరాంపురంలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.. ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ బహిరంగ సభతో సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగియనుండగా.. సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఏపీలో కేంద్రం బృందం.. ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో పంట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు. దీంతో ఏపీలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏపీలో పర్యటించింది. రెండురోజుల పాటు ఏపీలో కేంద్ర పర్యటిస్తోంది. మిచౌంగ్ తుఫాన్‌తో జరిగిన పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనా వేస్తోంది. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరులో పర్యటించింది కేంద్ర బృందం. తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. స్థానిక రైతులు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. పంట నష్టం పరిహారంపై నివేదిక తయారు చేసి కేంద్రానికి అందిస్తామన్నారు కేంద్ర అధికారులు. అంతకు ముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు కేంద్ర బృందం సభ్యులు. మిచౌంగ్ తుఫాన్‌తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. మరోవైపు కర్నూలు జిల్లాలో వర్షాలు లేక నష్టపోయిన పంటలను కూడా పరిశీలించింది కేంద్ర బృందం.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో ఫేక్ లెటర్లు.. వైసీపీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంగళగరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు.. ఫేక్ లెటర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ, అదంతా అవాస్తవం. ఇటీవల మంగళగిరి ఇంఛార్జ్‌గా పార్టీ మరొకరిని నియమించడంతో.. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు ఆర్కే. అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారాయన. పార్టీపై కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా మంగళగిరిని ఆళ్ల అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు వైసీపీ నేతలు. సామాజిక సమీకరణాల వల్ల మంగళగిరి నుంచి ఆర్కే బదులు.. మరొకరిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆళ్లపై పార్టీ యాక్షన్ తీసుకుందని, సస్పెండ్ చేసిందని.. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు లేఖలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు.
చుక్కలు చూపిస్తోన్న కొత్త సాఫ్ట్‌వేర్.. రిజిస్ట్రేషన్లు ఆలస్యం
రిజిస్ట్రేషన్లు వేగంగా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టింది. దీని కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను సైతం తీసుకొచ్చింది.. అయితే, ఏపీ సర్కార్ తెచ్చిన కార్డ్ 2.0 సాఫ్ట్‌వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. డిజిటలైజేషన్‌లో భాగంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో అనుసంధానం చేయడం, ఈకేవైసీ కోసం చేసిన ఏర్పాటు.. కొత్త సమస్యలకు కారణమవుతోంది. రెగ్యులర్‌గా జరిగే సేవలు తప్ప మిగిలినవి అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల గంటలు తరబడి సబ్ రిజిస్టారు ఆఫీసుల్లో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకువచ్చిన కార్డ్ ప్రైమ్ విధానంలో రెండుసార్లు ఈకేవైసీ చేయాల్సి వస్తోంది. మొత్తం 156 రకాల రిజిస్ట్రేషన్‌లు అందుబాటులో ఉండగా రెగ్యులర్‌గా జరిగే గిఫ్ట్, సేల్, జీపీలు తప్ప మిగిలినవి అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రోజుకు సగటున 20 నుంచి 30 శాతం వరకు రిజిస్ట్రేషన్లు తక్కువగా అవుతున్నాయి. రెండుసార్లు ఈకేవైసీ చేయాల్సి రావడంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి. విశాఖలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సర్వర్ ఇంటిగ్రేషన్‌లో సమస్యలు కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు అనంతపురంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు మాత్రం రోజుకు 60 రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెబుతున్నారు. మొదట్లో సాఫ్ట్ వేర్ లో సమస్యలు ఉన్నా.. రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నామని అంటున్నారు. ఇప్పటికైనా కొత్త సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.
ఆ వార్తలు అవాస్తవం.. ఐఏఎస్‌గానే విధులు నిర్వహిస్తా: స్మితా సభర్వాల్
మొన్నటివరకు కేసీఆర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ నెట్టింట వస్తున్న వార్తలను స్మితా సభర్వాల్ ఖండించారు. ఆ వార్తలు అన్ని అవాస్తవమని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశా. ఆ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనవి. నేను తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగానే విధులను నిర్వహిస్తా. తెలంగాణ ప్రభుత్వం నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను’ అని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
తనకు పాలన అనుభవం లేదు.. కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్
కేటీఆర్ కు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నాడని రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవకముందే పథకాలు అమలవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. దానిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ప్రారంభమైందే ఇప్పుడు క్రమంగా హామీల అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. ప్రతీ పథకం అమలుపై 15 రోజులకోసారి సమీక్ష చేస్తామని తెలిపారు.
చనిపోయిన 3351మంది సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ సైనికులు
దేశవ్యాప్తంగా జనవరి 1, 2018 నుండి డిసెంబర్ 1, 2023 వరకు మొత్తం 3351 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 275 మంది సైనికులు చర్యలో మరణించగా, 3076 మంది డ్యూటీలో మరణించారు. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పార్లమెంటులో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. అమరవీరులైన CAPF, అస్సాం రైఫిల్స్ సైనికుల కుటుంబాలకు ఇచ్చే కేంద్ర ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని 15 లక్షల రూపాయల నుండి 35 లక్షల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కాగా విధి నిర్వహణలో అమరులైతే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1939 ప్రకారం, అమరవీరులైన సైనికుల తదుపరి బంధువులు సరళీకృత కుటుంబ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులని ఆయన చెప్పారు. 2016 నుంచి 2020 వరకు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 355 మంది సైనికుల్లో అత్యధికంగా 209 మంది సైనికులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు చెందిన వారేనని మంత్రి తెలిపారు. మంత్రి నిత్యానంద్ రాయ్ అందించిన సమాచారం ప్రకారం.. బీఎస్‌ఎఫ్‌కు చెందిన 78 మంది, ఐటీబీపీకి చెందిన 16 మంది, సశాస్త్ర సీమా బల్‌కు చెందిన ఎనిమిది మంది, సీఐఎస్‌ఎఫ్‌కి చెందిన ఏడుగురు, అస్సాం రైఫిల్స్‌కు చెందిన 37 మంది సైనికులు వీరమరణం పొందారు. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 1, 2023 వరకు దేశవ్యాప్తంగా 3351 మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఎఆర్) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో మరోసారి లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు.
ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ఛాన్స్
ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. యూపీ, పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పొగమంచు కనిపిస్తోంది. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో తేలికపాటి వర్షంతో మంచు కురుస్తోంది. కొండ ప్రాంతాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయి. హిమపాతం కారణంగా, పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వతాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. కేరళ, తమిళనాడులో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఆదివారం వరకు వర్షాకాలం కొనసాగుతుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలలో దట్టమైన పొగమంచుతో పాటు ఈశాన్య భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో పశ్చిమ భంగం చురుకుగా మారుతోంది. అందువల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తేలికపాటి వర్షంతో మరోసారి తీవ్రమైన చలి ప్రారంభమవుతుంది. రాయ్‌పూర్‌లో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ సంవత్సరం చలి కాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఇది.
నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!
మైదానంలో నమాజ్ చేశానని తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నమాజ్ చేయాలనుకుంటే.. అడ్డుకునేవాడు ఎవడు? అని ప్రశ్నించాడు. తాను గర్వించదగిన భారతీయుడిని, గర్వించదగిన ముస్లింనని షమీ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్స్ తీసిన అనంతరం షమీ మోకాళ్లపై కూర్చొని.. రెండు చేతులతో నేలను టచ్ చేశాడు. ఈ సంబరాలను కొంతమంది అభిమానులు, నెటిజన్స్ తప్పుబట్టారు. మైదానంలో షమీ నమాజ్ చేశాడని విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై షమీ ఘాటుగా స్పందించాడు. బుధవారం ఆజ్ తక్‌తో మహమ్మద్ షమీ మాట్లాడుతూ… ‘నేను నమాజ్ చేయాలనుకుంటే.. నన్ను ఎవరు ఆపుతారు?. నేను ఎవరినీ ప్రేయర్ చేయకుండా ఆపను. నేను నమాజ్ చేయాలనుకుంటే చేస్తా. ఇందులో సమస్య ఏముంది. నేను ముస్లింనని గర్వంగా చెబుతాను. నేను భారతీయుడిని అని గర్వంగా చెబుతా. అందులో ఏముంది ప్రాబ్లమ్?. నమాజ్ చేయడానికి ఎవరి వద్దైనా పర్మిషన్ అడగాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉండాలి?. ఇంతకుముందు 5 వికెట్లు తీసిన తర్వాత నేను ఎప్పుడైనా నమాజ్ చేశానా?. నేను చాలాసార్లు ఐదు వికెట్లు తీశాను. నేడు ఎక్కడ నమాజ్ చేయాలో చెప్పండి, అక్కడికి వెళ్లి చేస్తా’ అని ఘాటుగా స్పందించాడు.
దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20.. సిరీస్ సమం చేస్తారా?
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్ నెగ్గాలంటే వాళ్లు పుంజుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ యువ భారత్ సత్తాకు పరీక్ష పెడుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా సొంత గడ్డపై సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో పోల్చితే భారత్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ ఇద్దరు ఇప్పటివరకు 15.50, 11.33 ఎకానమీతో పరుగులిచ్చారు. వ్యక్తిగత కారణాలతో పేసర్ దీపక్ చహర్ అందుబాటులో లేకపోవడం భారత్ బౌలింగ్ కష్టాలను పెంచింది. జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ గైర్హాజరీలో అర్ష్‌దీప్, ముకేశ్‌లపై విశ్వాసం ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు నిరాశ తప్పలేదు. మరి మూడో టీ20లో అయినా ఈ ఇద్దరు రాణిస్తారేమో చూడాలి. టీ20 ప్రపంచకప్‌కు ముందు నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిలో ఉండాలంటే మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం. మ్యాచ్ వేదిక జొహానెస్‌బర్గ్‌లో జల్లులు పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌కు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మైదానంలో బంతి చాలా వేగంగా బౌండరీకి చేరుతుంది. పేసర్లకు కూడా సహకారం లభించవచ్చు. ఈ వేదికలో అన్ని ఫార్మాట్లలోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. మ్యాచ్ రాత్రి 8.30కి ఆరంభం కానుంది.
మళ్లీ రష్మిక టార్గెట్ చేసిన దుండగులు.. మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.. గతంలో కన్నా ఇది డీప్ గా ఉంది.. దీనిపై ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ మండిపడుతున్నారు.. ఇలాంటి వాటిని ఆపాలని హెచ్చరిస్తున్నారు.. వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రష్మికకి ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరమనే చెప్పాలి. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైన మరోసారి ఇలాంటి వీడియో బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. ఇటీవల యానిమల్ చిత్రంతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక మందన్నా. పుష్ప చిత్రంతోనే ఆమె పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ యానిమల్ చిత్రంతో దాన్ని మించిన ఇమేజ్‌ని క్రేజ్‌ని సొంతం చేసుకుంది.. అల్లు అర్జున్ పుష్ప2 లో నటిస్తుంది. మరో సారి శ్రీవల్లిగా సందడి చేయడానికి రెడీ అవుతుంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించింది. దీంతోపాటు రెయిన్ బో అనే సినిమా చేస్తుంది. అలాగే `యానిమల్ పార్క్`లోనూ పార్ట్ కాబోతుంది.. మొత్తానికి ఫుల్ బిజీ అయిపొయింది.
ఇవెక్కడి సెంటిమెంట్లు… మహేష్ ఫ్యాన్స్ కి భయమా?
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్ కాగా ఇంకొకటి మెలోడీ. ఈ రెండు సాంగ్స్ గుంటూరు కారం సినిమా మూడ్ ని తెలిపేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ‘ధమ్ మసాలా’ నవంబర్ 7న బయటకి వచ్చింది. సెకండ్ సాంగ్ ఓ మై బేబీ డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. ఇదే డేట్స్ కి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమాలోని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మోస్ట్ హైప్డ్ సినిమాగా అజ్ఞాతవాసి తెరకెక్కింది. అజ్ఞాతవాసి నుంచి ఫస్ట్ సాంగ్ ‘బయటకొచ్చి చూస్తే’ నవంబర్ 7నే రిలీజ్ అయ్యింది. అజ్ఞాతవాసి సినిమాలోని సెకండ్ సాంగ్… గాలి వాలుగా డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది కానీ ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ కోసం అనిరుధ్ స్పెషల్ గా ట్రిబ్యూట్ వీడియో చేసాడు. ఆ ట్రిబ్యూట్ సాంగ్ డిసెంబర్ 13నే రిలీజ్ అయ్యింది. ఇలా రెండు సినిమాల పాటలు ఒకే డేట్ ని రిలీజ్ అవ్వడంతో రిలీజ్ కూడా అజ్ఞాతవాసి సినిమాలాగే ఉంటుందేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. సెంటిమెంట్స్ ని ఎక్కువగా నమ్మే ఫిల్మ్ ఇండస్ట్రీలో గుంటూరు కారం సాంగ్ రిలీజ్ డేట్స్ అజ్ఞాతవాసితో మ్యాచ్ అవుతుంటే మేకర్స్ క్రాస్ చెక్ చేసుకోలేదా లేక గుంటూరు కారం సినిమాపై ఉన్న నమ్మకంతో సెంటిమెంట్ ని పట్టించుకోకుండా ప్రమోషన్స్ చేస్తున్నారా అనేది చూడాలి.