21వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఇవాళ్టి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుంటారు.. ఇక, స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత.. ప్రచారవ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు.. అనంతరం.. తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని.. బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.. జొన్నాడలో మధ్యాహ్న విరామం.. సాయంత్రం విజయనగరం నియోజకవర్గం చెల్లూరు సమీపంలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.. అనంతరం భోగాపురం, పూసపాటి రేగ మీదుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.
నేడు ఏపీకి కేంద్ర మంత్రులు..
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పర్యటించనున్నారు.. ఏపీలో నామినేషన్ల పర్వం రోజుగా కొనసాగుతండగా.. ఈ సారి టీడీపీ-జనసేన తో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతోన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొంతమంది నామినేషన్ల దాఖలు చేశారు.. ఈ రోజు మరికొందరు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ తరుణంలో ఏపీకి వస్తున్నారు కేంద్ర మంత్రులు.. నేడు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. ఆయన నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొనబోతున్నారు. ఇక, అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ యాదవ్.. ఆయన నామినేషన్ కు హాజరు కానున్న కేంద్ర మంత్రి వీకే సింగ్ హాజరుకానున్నారు. మరోవైపు.. కైకలూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మాజీ మంత్రి కామినేని శ్రీ నివాస్.. ఆయన నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొనబోతున్నారు.. ఇక, విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణు కుమార్ రాజు ఈ రోజు నామినేషన్ వేయనుండగా.. ఆ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాజరుకాబోతున్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.. ప్రతీ రోజు తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. ఇక, ఏదైనా ప్రత్యేక రోజుల్లో అయితే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడడం చూస్తుంటాం.. అయితే, శ్రీవారి దర్శనానికి, శ్రీవారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయని.. మరోవైపు మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు.. ఇక, రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని.. సంబంధిత టికెట్లను భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అనుభవాలు చూస్తే.. నిమిషాల వ్యవధిలోనూ టికెట్ల కోటా పూర్తిస్థాయిలో బుక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే.. మరోవైపు.. తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి.. ఇవాళ మలయప్పస్వామి, రాములవారు, శ్రీకృష్ణ స్వాములకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.. తిరుమలలో వసంతోత్సవాలు కారణంగా ఇవాళ పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.
నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ..
నేటితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ష్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను అధికారులు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు ఈడీ వాదనలు విననుంది. సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భవేజా ధర్మాసనం తీర్పును ప్రకటించనుంది. ఈడీ ఆమెను రెండు విడతలుగా మొత్తం పది రోజుల పాటు ప్రశ్నించింది. కవితను మరికొద్ది రోజులు కస్టడీలో ఉంచాలని కోరనున్నట్లు సమాచారం. అయితే కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తారా? లేక తిరస్కరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్యం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసి వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడీ అధికారులు కవిత నుంచి వివరణ తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారించే అవకాశం ఉంది. కవిత మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా? లేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ ఇస్తుందా? లేకుంటే బెయిల్ ఇస్తారా? అనే విషయాలపై స్పష్టత రానుంది.
కాషాయ వనమైన కొండగట్టు.. భారీగా తరలివచ్చిన దీక్షాపరులు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మినీ హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు పోటెత్తుతున్నారు. నిన్న అర్ధరాత్రి నుండి బారులు తీరిన భక్తులు రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అనే కీర్తనలతో కొండగట్టు మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో అంజన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఉత్సవాల దృష్ట్యా అధికారులు వాహనాలు, పూజలు రద్దు చేశారు. 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో కొండగట్టు అంజన్నను 3 నుంచి 4 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సంబంధించి ఓ కథనం.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే గోరక్షకుడు ఒకరోజు అడవిలో ఆవులను మేపుతున్నాడు. మందలో ఒక ఆవు తప్పిపోయినప్పుడు, అతను దానిని వెతుక్కుంటూ వాగు వద్దకు వస్తాడు.
కేక్ తిని బాలిక మృతి కేసు.. మరణానికి కారణం తెలిసి అంతా షాక్!
గత నెల పుట్టినరోజు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నారి తిన్న కేక్‌లో సింథటిక్ స్వీటెనర్ అధిక స్థాయిలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు. బేకరీ నుంచి నాలుగు కేక్ నమూనాలను తీసుకోగా వాటిలో రెండు శాంపిల్స్‌లో కృత్రిమ స్వీటెనర్ అయిన సాచరిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ విజయ్ జిందాల్ తెలిపారు. సాచరిన్ సాధారణంగా చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, అధిక పరిమాణంలో పదార్ధం కడుపు నొప్పికి కారణమవుతుంది. మాన్వి, ఆమె సోదరి తిన్న కేక్‌పై ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రాలేదని, అయితే కేక్‌ను తయారు చేసిన బేకరీలోని ఇతర నమూనాలలో కృత్రిమ స్వీటెనర్‌లు అధిక స్థాయిలో ఉన్నాయని డాక్టర్ విజయ్ జిందాల్ స్పష్టం చేశారు. మాన్వి మృతితో బేకరీపై దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు.డాక్టర్ జిందాల్ మాట్లాడుతూ, కేక్ నమూనాల నిర్ధారణలను కోర్టుకు తెలియజేస్తామని, బేకరీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాన్వి మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మార్చి 24న పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి కుటుంబసభ్యులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి, ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. ఆ కేక్ తిన్న తర్వాత అందరూ అనారోగ్యం బారిపడ్డారు. అస్వస్థతకు గురైన మాన్విని ఆస్పత్రికి తరలించగా.. ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆర్డర్ చేసిన కేక్ నమూనాలను పరీక్షలకు పంపగా.. అందులో ప్రమాదకర పదార్థం సింథటిక్ స్వీటెనర్ ఉన్నట్టు తేలింది.
భారత్‌లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు.. మోడీపై శరద్ పవార్ ఫైర్
మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు. మహా వికాస్ అఘాడీ అభ్యర్థి కోసం అమరావతిలో జరిగిన ప్రచార సభలో పవార్ ప్రసంగిస్తూ.. దేశానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని ప్రశ్నించలేమని అన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చడం గురించి బహిరంగంగా మాట్లాడారని, భారతదేశంలో నిరంకుశ పాలనను అనుమతించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరావతి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన బల్వంత్ వాంఖడేపై 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. ప్రధాని మోడీ భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌ను అనుకరిస్తున్నారని శరద్ పవార్ ఆరోపించారు. అభ్యర్థి (నవనీత్ రాణా)కి మద్దతు ఇవ్వడం ద్వారా 2019 ఎన్నికల్లో తాను చేసిన పొరపాటుకు అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు వచ్చానని శరద్ పవార్ చెప్పారు. “గత ఎన్నికల్లో, నేను ప్రజల మద్దతు కోరాను. రాణాను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాను. నేను విజ్ఞప్తి చేసిన అభ్యర్థిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ తప్పును సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆయన అన్నారు.
దుబాయ్ వరదలను అంతరిక్షం నుంచి చూస్తే.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
దుబాయ్‌లో గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదం నెలకొంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 17 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారీ వర్షపాతం సంభవించింది. వర్షం కారణంగా దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. భారీ వరదలు దుబాయ్‌ను అల్లకల్లోలం చేశాయి. అది అంతరిక్షం నుండి కూడా కనిపించింది. యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు సంబంధించిన కొన్ని ఫోటోలను నాసా విడుదల చేసింది. ఇందులో వర్షం కురిసే ముందు, తర్వాత ఆ ప్రాంతం చూపబడింది. సీఎన్‌ఎన్ ప్రకారం, చిత్రాలలోని నీలిరంగు దుబాయ్‌లో వరదలతో కప్పబడిన ప్రాంతాన్ని చూపిస్తుంది. దుబాయ్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంతో పాటు పామ్ జెబెల్ అలీకి దక్షిణాన ఉన్న ప్రతిచోటా పార్కులు, రోడ్లు నీటితో నిండిపోయాయి. దుబాయ్ వర్షానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇందులో పెద్ద భవనాలు నీటిలో మునిగిపోవడం, కార్లు నీటిలో తేలడం చూడవచ్చు. దుబాయ్‌లో మంగళవారం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, అయితే ఇక్కడ సగటు వర్షపాతం ఏడాదికి 95 మిమీ మాత్రమే. నాసాకు చెందిన ల్యాండ్‌శాట్ 9 ఉపగ్రహం వర్షాలు తగ్గుముఖం పట్టిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 19న శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారీగా వరద నీటితో నిండిన చెరువుల ఫోటోలను తీసింది. NASA యొక్క ల్యాండ్‌శాట్ 9 ఉపగ్రహం మానవ జీవితాన్ని నిలబెట్టడానికి అవసరమైన భూ వనరులను పర్యవేక్షిస్తుంది . నాసా విడుదల చేసిన ఫోటోలో ముదురు నీలం రంగులో వరద నీరు కనిపిస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్!
ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. చీలమండ నొప్పికి చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మార్ష్.. తిరిగి భారత్‌కు రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయాడు. తన గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వైద్య సిబ్బందిని సంప్రదించడానికి ఏప్రిల్ 12న మిచెల్ మార్ష్ పెర్త్‌కు వెళ్లాడు. మార్ష్ గాయాన్ని అంచనా వేసిన సీఏ వైద్య బృందం.. ఐపీఎల్ ఆడకుండా ఆస్ట్రేలియాలోనే ఉండాలని సూచించింది. టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతుండడంతో అతడిని భారత్‌కు పంపించి రిస్క్ చేయకూడదని సీఏ బావించింది. దాంతో మార్ష్ ఐపీఎల్ 2024లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024లో మిచెల్ మార్ష్ విఫలమయ్యాడు. 4 మ్యాచ్‌లలో 61 రన్స్ మాత్రమే చేశాడు. రాజస్తాన్‌పై అత్యధికంగా 23 పరుగులు చేశాడు. ఏప్రిల్ 3న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చివరిగా మార్ష్ ఆడాడు. ఆపై ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న మార్ష్.. టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది.
పద్మభూషణ్ అందుకున్న మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్
సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దివంగత సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యంలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్‌లకు పద్మభూషణ్ లభించింది. పద్మ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజా సేవ, సైన్స్, సాహిత్యం మరియు క్రీడలు వంటి వివిధ రంగాలలో రాణించిన వ్యక్తులకు ఇచ్చే దేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో పద్మ అవార్డులు ముఖ్యమైనవి. అసాధారణమైన – విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డుతో సత్కరించనున్నట్లు ప్రకటించారు. వీరిలో ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్ మరియు 110 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈసారి పద్మ అవార్డులు అందుకున్నవారిలో 30 మంది మహిళలు ఉండగా, మరణానంతరం 9 మందికి పద్మ అవార్డులు లభించాయి. దాదాపు సగం మంది అవార్డు విజేతలు సోమవారం నాటి వేడుకలో గౌరవాలను అందుకున్నారు, మిగిలిన వారు వచ్చే వారం అందుకుంటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. అయితే, 1978, 1979 మరియు 1993 నుండి 1997 సంవత్సరాలలో, కొన్ని కారణాల వల్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాటిని ప్రకటించలేకపోయారు. మిథున్ చక్రవర్తి భారతీయ సినిమాకు చేసిన కృషికి మరియు సామాజిక సేవలో చురుకుగా ఉన్నందుకు పద్మభూషణ్ అందుకున్నారు. మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌లో సుదీర్ఘ కెరీర్‌లో 350కి పైగా సినిమాలకు పనిచేశారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉషా ఉతుప్ పద్మభూషణ్ అందుకున్నారు. ఎన్నో పాటలకు ఆమె తన గాత్రాన్ని అందించారు. ఉషా ఉతుప్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గాయని.
గ్రాండ్‌గా యంగ్ హీరోయిన్ హల్దీ వేడుక.. ఫొటోస్ వైరల్!
మలయాళీ ముద్దుగుమ్మ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. నటుడు దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) అపర్ణ, దీపక్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. హల్దీ వేడుకల్లో అపర్ణ హాఫ్ శారీలో మెరిశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో ‘న్యాన్ ప్రకాషన్’ సినిమాతో అపర్ణ దాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదా మూవీతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న అపర్ణ.. దళపతి విజయ్ బీస్ట్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ప్రస్తుతం అపర్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణ సినిమాల మీద మక్కువతో ఇటు వైపు వచ్చారు. కెరీర్ ఊపందుకునే సమయంలోనే 28 ఏళ్ల అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. ‘ముంజుమ్మల్ బాయ్స్’తో పాటు పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. అపర్ణ, దీపక్ కలిసి మనోకరం మూవీలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని సమాచారం. వీరి వివాహనికి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. పెళ్లితో ఒక్కటి కాబోతున్న దీపక్, అపర్ణ జంటకు నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
దావూద్ పార్టీలో హీరోయిన్ డాన్స్.. షాకింగ్ కామెంట్స్
ఒకప్పటి స్టార్ హీరోయిన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా నటనా ప్రపంచం నుండి విరామం తీసుకుని రచయిత్రిగా మారిందన్న సంగతి తెలిసిందే. ఆమె ‘మిసెస్ ఫన్నీబోన్స్’, ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’, ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ మరియు ‘వెల్ కమ్ టు ప్యారడైజ్’ పుస్తకాలను రచించారు. దీనితో పాటు, ఆమె తన జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. అయితే ట్వింకిల్ ఖన్నా తన మీద ట్రోల్స్ వస్తే వాటికి సమాధానం ఇస్తూ పుకార్లకు శాశ్వతంగా ముగింపు పలికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే, వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం తాను పనిచేశానని దాదాపు దశాబ్దంన్నర క్రితం తనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల మీద ఆమె స్పందించలేదు. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత, ట్వింకిల్ ఈ రూమర్‌పై తన మౌనాన్ని వీడి తన స్టాండ్‌ను స్పష్టం చేసింది. 2010లో ట్వింకిల్ ఖన్నా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం పార్టీలలో ప్రదర్శన ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సర్వత్రా జోరుగా చర్చ జరగడంతో దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి నుంచి ఈ విషయం మీద మౌనం పాటించిన ట్వింకిల్ తన కొత్త కాలమ్‌లో మీడియా ధోరణి గురించి రాసింది. “మల్లయోధుల నిరసన సమయంలో ఫోగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోల నుండి, కరోనావైరస్ యొక్క మూలాల గురించి లెక్కలేనన్ని కథనాల వరకు మేము ఇప్పటికే అనేక తారుమారు చేసిన వార్తా కథనాలను చూశాము” అని ఆమె రాసుకొచ్చింది. ‘నేను దావూద్ కోసం ఒక మెడ్లీ పాటకి డాన్స్ చేశా అని తెలిపే ఒక ప్రధాన స్రవంతి టెలివిజన్ ఛానెల్ టిక్కర్‌లో నా పేరును కూడా చూశాను. నా డ్యాన్స్ స్కిల్స్ WWF మ్యాచ్ చూడడానికి సమానమని నా పిల్లలకు కూడా తెలుసు, దావూద్ నాకంటే మంచి డ్యాన్సర్‌లను ఎంచుకుంటాడని న్యూస్ ఛానెళ్లకు తెలియాలి అంటూ ఆమె రాసుకొచ్చింది. అక్షయ్ కుమార్ ను 2010లో ప్రెస్ మీట్‌లో ఈ ఆరోపణల గురించి అడిగినప్పుడు, ‘ఈ కథలన్నీ ఎక్కడ నుండి వచ్చాయో నాకు తెలియదు. ఈ కథనాలు నిజమైతే నా ఇంటిపై దాడులు జరిగేవి కానీ ఒక్క కానిస్టేబుల్ కూడా రాలేదు, ఈ వార్తలు నన్ను కలచివేశాయి అని పేర్కొన్నారు.