శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజే ఆ టికెట్లు అన్ని విడుదల..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం రానే వచ్చింది.. జులై మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్‌లైన్‌లో పెట్టనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ రోజు ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించి లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది.. ఇక, ఉదయం 11:30 గంటలకు జులై మాసానికి సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.. మరోవైపు.. ఈ రోజు మధ్యహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు టీటీడీ అధికారులు.
రేవంత్ రెడ్డి పార్టీని వీడే టైమ్ దగ్గరలోనే ఉంది
రేవంత్ రెడ్డి పార్టీ నీ వీడే టైమ్ దగ్గరలోనే ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చేతులు కలుపుతారు… ఇక్కడ పోరాటం చేస్తారా.. మీ స్టాండ్ ఎంటి? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎవరి కోసం యాత్ర చేస్తున్నావు? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కి బీఆర్‌ఎస్ బీ టీమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్గే కోసం ఢిల్లీలో ఆ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నావు రేవంత్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ రెండు పార్టీలు కలుస్తాయి! కలిస్తే పార్టీ నీ వీడుతానని అన్న రేవంత్ రెడ్డి పార్టీ నీ వీడే టైమ్ దగ్గరలోనే ఉందని తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కోవిడ్ మరణాలు..! క్లారిటీ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఇదే సమయంలో.. కోవిడ్ బారినపడి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు పెరగడంతో పాటు.. కొన్ని కోవిడ్ మరణాలు సంభవించినట్టు వార్తలు వచ్చాయి.. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది.. రాష్ట్రంలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.. రాష్ట్రంలో ఈ మధ్య ముగ్గురు మృతిచెందారన్న ప్రచారంపై స్పందించిన ఆయన.. వివరణ ఇచ్చారు. కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తికి ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అయితే, వైరల్ న్యూమోనియా కారణంగా మరణించాడని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని తెలిపారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్. అలాగే 26 ఏళ్ల సందీప్ అనే వ్యక్తికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.. నెక్రోటైజింగ్ ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్టు నివేదికలో సూపరింటెండెంట్ పేర్కొన్నారని తెలిపారు.. మరోవైపు.. వైజాగ్‌లో 21 ఏళ్ల పి.చింటో కూడా వైరల్ న్యూమోనియాతో మరణించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని.. అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ అని తేలిందని పేర్కొన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.
ప్రేమికులకు నచ్చజెప్పేందుకు వచ్చాడు.. దారుణ హత్యకు గురయ్యాడు..!
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది.. ప్రేమ వ్యవహారంలో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన బెజవాడలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన నవీన్ కు ఒంగోలుకు చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.. దీంతో సదరు మైనర్ బాలిక.. నవీన్ కోసం ఒంగోలు నుండి విజయవాడలోని నవీన్ ఇంటికి వెళ్లిపోయింది.. ఇక, బాలికను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తామని వచ్చిన కుటుంబ సభ్యులు.. విజయవాడ చిట్టి నగర్ లోని ఆ బాలిక మేనమామను తీసుకుని ప్రియుడి ఇంటికి బుధవారం సాయంత్రం వెళ్లారు.. ఇక, నవీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. సదరు బాలికను చిట్టినగర్ లోని మేనమామ ఇంటికి తాసుకువెళ్లారు.. అయితే, కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక.. దీంతో మరలా నవీన్ ఇంటికి చేరుకున్న ఆ బాలిక కుటుంబ సభ్యులు, మేనమామ శ్రీనివాస్.. నవీన్‌ను నిలదీశారు.. తన వద్ద నుండి తీసుకెళ్లి.. మళ్లీ తనను ప్రశ్నిస్తున్నారా? అంటూ గొడవకు దిగాడు నవీన్.. ఆవేశంలో కత్తితో బాలిక మేనమామపై దాడికి దిగాడు.. శ్రీనివాస్ చాతిలో బలంగా కత్తి దిగడంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు శ్రీనివాస్.. ఆస్పత్రికి తరలించే సరికి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.. దీంతో సత్యనారాయపురం పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మరోవైపు ఇంకా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు..
ఈ నెల 21న జరగాల్సిన నిరుద్యోగ సభ రద్దు.. టీపీసీసీ ప్రకటన
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా వెంటనే మీడియాకు వివరిస్తారని ఫైర్ అయ్యారు. ఈ విషయం మీడియాలో చూసి ఖంగుతానాల్సి వస్తోందన్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుని మీడియాతో వివరాలు పంచుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని మీడియాకు వివరిస్తే స్థానిక పార్టీ శ్రేణులను ఎలా ఒప్పించగలరని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ థాక్రేకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో టీపీసీసీ నిరసన సభను రద్దు చేసింది. కాంగ్రెస్ లో ఇదేవిషయాన్ని తీసుకుని వివాదం ముదిరే అవకాశం ఉందనో లేక అధిష్ఠానం ఆదేశించిందో గానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 21న నల్గొండ జిల్లాలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనున్నట్లు రేవంత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సభను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి జిల్లా నాయకత్వానికి పిలుపునిచ్చారు. అధిష్టానాన్ని సంప్రదించి, సీనియర్ నాయకులతో మాట్లాడి దీనిపై స్పష్టంత ఇస్తామని ప్రకటించారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీనిరయర్లు అంతా గుర్రుమన్నారు. అంతేకాకుండా.. ఈ వార్తతో అదే జిల్లాకు చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యపోయారు. విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ పిటిషన్‌పై సూరత్ కోర్టు నేడు తీర్పు
పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై సూరత్ కోర్టు నేడు తన తీర్పును ప్రకటించనుంది. ఈ కేసులో దోషిగా తేలడంతో అప్పీల్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతకు ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.మాజీ ఎంపీకి బెయిల్ మంజూరు చేస్తూనే, తన నేరారోపణపై స్టే విధించాలన్న కాంగ్రెస్ నాయకుడి విజ్ఞప్తిపై ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ఇరుపక్షాల వాదనలను విని, ఆపై ఆర్డర్‌ను ఏప్రిల్ 20కి రిజర్వ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్ కోర్టును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశ్రయించారు. శిక్షపై స్టే విధించకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా తీర్పును ఈ నెల 20కి రిజర్వు చేశారు. ఈ కేసులో స్టే లభిస్తే రాహుల్ సభ్యత్వం పునరుద్ధరించేందుకు మార్గం సుగమం కానుంది.
ప్రధానికి బాలిక చేసిన విజ్ఞప్తి వైరల్.. పాఠశాలకు రానున్న కొత్త రూపు
జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లాలోని తన పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని 3వ తరగతి విద్యార్థిని వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన కొన్ని రోజుల తర్వాత.. జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ దానికి కొత్త రూపాన్ని ఇచ్చే పనిని ప్రారంభించింది. గత వారం ప్రధానమంత్రికి సీరత్ నాజ్ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో జమ్మూలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ ఆ పాఠశాలను సందర్శించారు. ‘మా స్కూల్ ను బాగు చేయండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలపై సౌకర్యాలపై ఏకరువు పెడుతూ జమ్మూకు చెందిన చిన్నారి సీరత్ నాజ్ ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో సందేశాన్ని పంపింది. తన స్కూల్ దుస్థితిని ఆ వీడియోలో వివరిస్తూ.. మా కోసం మంచి స్కూల్ బిల్డింగ్ కట్టించాలని ప్రధానిని బాలిక కోరింది. దేశం మొత్తం చెప్పింది వినాలని, నా మొర కూడా ఆలకించాలని ఆ పసిపాప విజ్ఞప్తి చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ వీడియోను ఒకరు తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. 2 మిలియన్లకుపైగా వ్యూస్, దాదాపు 1.20 లక్షల లైక్‌లు వచ్చాయి. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. ఆ వీడియోలో పాఠశాల శిథిలావస్థ గురించి నాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మురికి నేలపై కూర్చోవలసి వస్తుంది, దీని వల్ల వారి యూనిఫామ్‌లకు మరకలు అవుతున్నాయి. మరుగుదొడ్ల దుస్థితి, బహిరంగ మలవిసర్జన సమస్యలు, భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆ చిన్నారి వివరించింది. “మోడీజీ.. మీరు మొత్తం దేశం చెప్పేది వినండి, దయచేసి నా మాట కూడా వినండి. మా కోసం ఒక మంచి పాఠశాలను నిర్మించండి, తద్వారా మేము మా విద్యను కొనసాగించగలము. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. దీంతో అమ్మలు తరచూ మమ్మల్ని తిడుతున్నారు. ఏం చేస్తాం.. ఇక్కడ మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు.” అని బాలిక తన ఉద్వేగభరితమైన విజ్ఞప్తిలో పేర్కొంది.
మహిళను బెదిరించిన బాలీవుడ్ నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ పై ముంబైలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఓ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే అతనిపై ఆరోపణలున్నాయి. ఆ మహిళ ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు, మహిళ నిరసన వ్యక్తం చేయడంతో సంబంధిత మహిళ, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని సాహిల్ ఖాన్ బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసును విచారిస్తున్నారు. ఈ మేరకు ముంబైలోని ఓషివిరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇంతకు ముందు కూడా సాహిల్ ఖాన్ పలు కేసుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 2021లో, మోడల్, ఫిట్‌నెస్ ట్రైనర్ మనోజ్ పాటిల్‌ను వేధించడం, ఆత్మహత్యకు ప్రోత్సహించినందుకు సాహిల్ ఖాన్‌పై కేసు నమోదు చేయబడింది. ఇది కాకుండా, 2014లో సాహిల్ ఖాన్ బాలీవుడ్ నటి సనా ఖాన్ స్నేహితురాలు ఇస్మాయిల్ ఖాన్‌తో జిమ్‌లో గొడవ పడ్డాడని కూడా ఆరోపణలు వచ్చాయి.